2023 వరకు పవన్ డైరీ ఫుల్?

సినిమాలు వదిలేసా..రాజకీయాల కోసం, జనం కోసం అని చెప్పి, ఆ పైన మళ్లీ మాట మార్చి, నాకేమైనా పాల ఫ్యాక్టరీలు వున్నాయా? సిమెంట్ ఫ్యాక్టరీలు వున్నాయా? అని ఎదురుదాడికి దిగారు పవన్ కళ్యాణ్.  Advertisement…

సినిమాలు వదిలేసా..రాజకీయాల కోసం, జనం కోసం అని చెప్పి, ఆ పైన మళ్లీ మాట మార్చి, నాకేమైనా పాల ఫ్యాక్టరీలు వున్నాయా? సిమెంట్ ఫ్యాక్టరీలు వున్నాయా? అని ఎదురుదాడికి దిగారు పవన్ కళ్యాణ్. 

నిజానికి ఆయనను సినిమాలు చేయవద్దని ఎవరూ అనలేదు. ఆయనకు ఆయనే తన పార్టీని ఎక్కువ అంచనా వేసుకుని, ఇక సినిమాలు అనవసరం అనుకుని, ఎన్నికల బరిలోకి దిగారు. 

దిగిన తరువాత లోతు తెలిసింది. తన స్టామినా తెలిసింది. దాంతో మళ్లీ వెనక్కు వచ్చారు. అలా వచ్చినందుకు తనకు తానే వివరణ ఇచ్చుకోలేక ఈ విధమైన ఎదురుదాడికి దిగారు. 

సరే, అదంతా అలా వుంచితే మళ్లీ వెనక్కు వచ్చిన తరువాత చేసి తీరాల్సిన పాత సినిమాలు రెండు వున్నాయి. వాటి జోలికి వెళ్లకుండా కొత్త వాటిని తలకెత్తుకోవడం ప్రారంభించారు. దాంతో ఇప్పుడు దాదాపు అయిదు సినిమాలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికి వకీల్ సాబ్ ఒక్కటే బయటకు వచ్చింది. 

క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా కొంత వరకు వర్క్ చేసి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టారు. ముందుగా అయ్యప్పన్ రీమేక్ పూర్తి చేసిన తరువాతే వీరమల్లు ఫినిష్ చేయాలని నిర్ణయించారు. 

అంతకు ముందు రెండూ సమాంతరంగా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారు. అయ్యప్పన్ రీమేక్ వ్యవహారం కనీసం మరో మూడు నెలలు పట్టేలా వుంది. ఇప్పుడే కొత్త సినిమాటోగ్రాఫర్ ఫిక్స్ అయ్యారు. అతను వచ్చి జాయిన్ కావాల్సి వుంది.

క్రిష్ సినిమా చేసాక కానీ హరీష్ శంకర్-మైత్రీ సినిమా స్టార్ట్ కాదు. అది ఎన్నాళ్లు పడుతుందన్నది తెలియదు. ఈ లెక్కన చూసుకుంటే 2022 లో రెండు సినిమాలు చేసేస్తారు అనుకుంటే హరీష్ శంకర్ సినిమాతో పాటు మరో సినిమా పూర్తి చేయడానికి అవకాశం వుంది. 

అయితే అలా చేయడానికి అటు రామ్ తాళ్లూరికి కానీ ఇటు పీపుల్స్ మీడియాకు కానీ ఇంకా స్క్రిప్ట్ లు, డైరక్టర్లు పూర్తిగా లాక్ కాలేదు. వీటిలో ఓ సినిమా 2023 లో వుంటుంది.

ఇప్పుడు కొత్తగా కూడా అడ్వాన్స్ లు తీసుకునే ఆలోచన చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద పవన్ డైరీ 2023 చివరి వరకు ఫుల్ అయిపోతుంది. మరి రాజకీయాలు ఎప్పుడు చేస్తారో? 2024 ఎన్నికలకు ఎలా సన్నద్దం అవుతారో చూడాలి?