ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలపడే దారే కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో సానుకూలతను పెంచుకోవాల్సిన టీడీపీ ఆ పని అసలు చేయడం లేదు. కేవలం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమను తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని టీడీపీ నేతలు ఆశావహ దృక్పథంతో ఉన్నట్టు కనిపిస్తోంది.
అంతే తప్ప ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఏపీ ప్రభుత్వంపై పోరాడి, మళ్లీ పుంజుకోవాలనే ఆలోచనలు, ప్రయత్నాలు ఏ మాత్రం కనిపించడం లేదు. పాలనలో అట్టర్ ఫ్లాప్ అయిన టీడీపీ ప్రతిపక్షంలోనూ అదే పనితీరు కనబరుస్తుండడం ముఖ్యంగా ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపుతోందని చెప్పొచ్చు. అర్రె …తమ డ్రామాలను ప్రజలు పసిగడతారనే స్పృహ కూడా టీడీపీకి లేనట్టుంది.
ఉదాహరణకు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయాన్నే తీసుకుందాం. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ పరిశ్రమను రాష్ట్ర ప్రజలు ప్రాణాలర్పించి సాధించుకున్నారు. ఇది ఏపీ ప్రజలకు ఓ సెంటిమెంట్. దీన్ని ప్రయివేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ స్పీడ్ పెంచింది. ఏపీలోని అన్ని పార్టీలు కూడా విశాఖను ప్రయివేటీకరించొద్దని డిమాండ్ చేస్తున్నాయి. అంతే తప్ప ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయిలో పోరాటాలకు దిగడం లేదు.
మోడీ సర్కార్ అంటే వైసీపీ, టీడీపీ నేతలకు భయం. ఇక బీజేపీ, జనసేన మిత్రపక్షాలయ్యాయి. దీంతో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను అడ్డుకోవాలని వీధిపోరాటాలు చేసే పార్టీనే కరువైంది. కార్మిక సంఘాలు ఆందోళన చేస్తుంటే వాటికి మద్దతు పలకడంతోనే తమ బాధ్యత పూర్తియినట్టుగా అన్ని పార్టీలు తమతమ స్థాయిల్లో నటిస్తున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు కానున్న నేపథ్యంలో పార్టీలు తమ ప్రాధాన్యతల గురించి చెప్పాయి. ఇందులో విశాఖ ఉక్కు ప్రయివేటీ కరణ అంశ ప్రధానంగా ఉంది. ఈ సందర్భంగా టీడీపీ ఓ ముఖ్య ప్రతిపాదన చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై కేంద్రాన్ని నిలదీయడానికి వైసీపీ నాయకత్వం వహించాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. ఆ పార్టీ ముందుకొస్తే రాజీనామాలకు కూడా తాము సిద్ధమని రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.
ఇక్కడే టీడీపీ డ్రామాలు బట్టబయలయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీక రణను అడ్డుకోవాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే, వైసీపీతో పనేంటి? తానే నాయకత్వం వహించొచ్చు కదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా కేంద్రంతో పాటు ఏపీ అధికార పార్టీ వైసీపీపై ఒత్తిడి ఎందుకు పెంచకూడదనే నిలదీతలు ఎదురవుతున్నాయి.
గతంలో ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలు రాజీనామా తమపై ఒత్తిడి పెంచిన విషయాన్ని టీడీపీ ఎందుకు మరిచిపోయిందని ప్రశ్నిస్తున్నారు. కేవలం జగన్ కేంద్రంగా రాజకీయాలు చేస్తే, ప్రయోజనం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని అందరికీ తెలుసు.
సమస్యకు కారణమైన వారిని వదిలేసి జగన్‌ను ఇరకాటంలో పెట్టాలనే టీడీపీ ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయని సొంత పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదంలో కూడా టీడీపీ తన వైఖరి ఏంటి? తఆను ఎటువైపు? అనేది తేల్చకుండా, జగన్‌పై విమర్శలేంటి? అనే అసహనం తటస్థుల వైపు నుంచి వస్తోంది. పైగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాయడం… ఆ పార్టీ సీమ వ్యతిరేక బుద్ధి బయట పడిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమకు సాగునీళ్లు అందించకపోగా, ఆ ప్రయత్నాలను అడ్డుకోవడం టీడీపీపై ఆ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. సమస్యల ప్రాతిపదికన కేంద్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, అన్నిటికి జగనే కారణమన్నట్టు టీడీపీ వ్యవహరించడం ఆ పార్టీ పతనానికి కారణమవుతోందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం మానేసి, కేవలం రాజకీయ దృష్టితో విమర్శలకే పరిమితం కావడం వల్లే… టీడీపీ క్రమంగా ప్రజలకు దూరం అవుతోందనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ బలపడే దారేది? అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది.