త‌మిళ సినిమా క‌థ‌ను రాయ‌ల‌సీమ‌కు ఎలా అతికిస్తారు?

జూలై 20 వ తేదీన అమెజాన్ లో విడుద‌ల కానుంది నార‌ప్ప సినిమా. ద‌గ్గుబాటి వెంక‌టేష్ హీరోగా, ప్రియ‌మ‌ణి హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా ను ముందుగా థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నా,…

జూలై 20 వ తేదీన అమెజాన్ లో విడుద‌ల కానుంది నార‌ప్ప సినిమా. ద‌గ్గుబాటి వెంక‌టేష్ హీరోగా, ప్రియ‌మ‌ణి హీరోయిన్ గా న‌టించిన ఈ సినిమా ను ముందుగా థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నా, ఇక ఇప్పుడ‌ప్పుడే వీలు కాని నేప‌థ్యంలో.. దీన్ని అమెజాన్ లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు దీని రూప‌క‌ర్త‌లు. దానిపై విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు స్పందిస్తూ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. 

ట్రైల‌ర్ లో వెంక‌టేష్ బాగా క‌నిపించాడ‌ని, బాగా న‌టించాడ‌ని.. అంటూ ర‌క‌ర‌కాల రీతిలో ప్ర‌శంస‌లు వ్య‌క్తం అయ్యాయి. ఈ సినిమాను చూసే ఇత‌ర ప్రాంతాల వాళ్లు దీన్ని ఎలా చూస్తున్నారో కానీ.. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన కాస్త ఆలోచ‌నా ప‌రుల‌కు మాత్రం ఇది ఎక్క‌డో కొడుతోంది. ఈ సినిమాను ఎందుకు రాయ‌ల‌సీమ‌కు ఆపాదిస్తున్నారు? అనేది సీమ నుంచి వ్య‌క్తం అవుతున్న ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌.

ఈ సినిమా టైటిల్ లోనే రాయ‌ల‌సీమ స్టైల్ ఉంది. నారప్ప అనే పేరు రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన‌ది. నార‌ప్ప‌, నార‌ప‌రెడ్డి వంటి పేర్లు రాయ‌ల‌సీమ‌లో గ‌త జ‌న‌రేష‌న్ లో చాలా ఎక్కువ‌గా ఉండేవి. ఊరికి ఇద్ద‌రు ముగ్గురు నార‌ప్ప‌లు, నారాప‌రెడ్డిలు ఉంటారు. క్ర‌మంగా ఈ పేరు పాత‌బ‌డింది, నారాప్ప అనే పేరు ఈ జ‌న‌రేష‌న్ లో పెట్టుకోవ‌డం బాగా త‌గ్గిపోయింది. 

ఇంటిపేర్లుగా మాత్రం ఇది కొంద‌రికి మిగిలిపోయింది. నార‌ప్ప గారి, నార‌ప‌రెడ్డి గారి వంటి ఇంటి పేర్లు శాశ్వ‌తం. వ్య‌క్తి పేరుగా మాత్రం ఇది కేవ‌లం ముస‌లి వాళ్ల పేరుగా, పాత పేరుగా మిగిలింది. ఏదేమైనా నార‌ప్ప అనే సౌండింగే రాయ‌ల‌సీమ సొంతం. ఇలా టైటిల్ ద‌గ్గ‌ర నుంచినే రాయ‌ల‌సీమ వాస‌న కొట్టిస్తున్నారు.

ఇక రెండో అంశం ఈ సినిమా షూటింగును కొంత మేర‌కు రాయ‌ల‌సీమ‌లోనే చేశారు. అనంత‌పురం జిల్లాలో ఈ సినిమాను కొంత మేర చిత్రీక‌రించారు. ఉర‌వ‌కొండ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జ‌రిగింది. ఇది వ‌ర‌కూ ఈ ప్రాంతంలోనే కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ సినిమాను చిత్రీక‌రించారు. ఇప్పుడు నార‌ప్ప సినిమాలోని కొంత పార్టును అక్క‌డ తీశారు.  

ఇలా రాయ‌ల‌సీమ టైటిల్ తో రాయ‌ల‌సీమ‌లోనే చిత్రీక‌రించిన సినిమాగా నార‌ప్ప నిలుస్తోంది. ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, రాయ‌ల‌సీమ ప్రాంతానికి ఏ మాత్రం సంబంధించ‌ని ఈ క‌థ‌ను సీమ‌కు ఎందుకు అన్వ‌యించారు? అస‌లు ఆ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది? ఎందుకు రాయ‌ల‌సీమ‌కు ఇలాంటి దుర్మార్గాల‌ను ఆపాదిస్తారు? అనేది ప్ర‌శ్నించాల్సిన అంశం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా త‌మిళ సినిమా అసుర‌న్ కు రీమేక్. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ హీరోగా న‌టించిన సినిమా అసుర‌న్. దాన్ని తెలుగులో రీమేక్ ల‌కు అల‌వాటు ప‌డ్డ వెంక‌టేష్ చేస్తున్నాడు. ఎవ‌రు ఎవ‌రి సినిమాను అయినా రీమేక్ చేసుకోండి కానీ.. ఒక వివాదాస్ప‌ద‌, త‌మిళ‌నాడు చ‌రిత్ర‌లోనే ఒక చీక‌టి అధ్యాయం పై ఆధారంగా రూపొందించిన త‌మిళ సినిమాను రాయ‌ల‌సీమ‌కు ఎందుకు ఆపాదిస్తున్న‌ట్టు? 

త‌మిళ‌నాడులో వాస్త‌వంగా జ‌రిగిన ఒక ఘ‌ట‌న ఆధారంగా రూపొందిన త‌మిళ సినిమాను తెలుగులో రూపొందిస్తూ.. దాన్ని రాయ‌ల‌సీమ‌లోనే జ‌రిగిన‌ట్టుగా ఎందుకు చూపుతున్న‌ట్టు? అనే దానికి ఈ సినిమా రూప‌క‌ర్త‌లు ఇప్ప‌టికే వివ‌ర‌ణ ఇవ్వాల్సింది. అయితే అడిగే వారు లేరు. రాయ‌ల‌సీమ గురించి ఏం చూపించినా చెల్లిపోతుంది. కాబ‌ట్టి దీన్ని సులువుగా రాయ‌ల‌సీమ‌కు ఆపాదించారు.

ఇది వ‌ర‌కూ రాయ‌ల‌సీమ ర‌క్త చ‌రిత్ర అంటూ ప‌దుల కొద్దీ సినిమాలు వ‌చ్చాయి. రాయ‌లసీమ‌కు హింస‌ను ఆపాదిస్తూ.. టాలీవుడ్ లో అనేక సినిమాలు వ‌చ్చాయి. అక్క‌డ ఫ్యాక్ష‌న్ హ‌త్య‌లు అంటూ టాలీవుడ్ త‌న క్రియేటివిటీని అంతా చాటింది. రాయ‌ల‌సీమ అంటే ర‌క్త‌దాహంతో ఉండే ప్రాంతం అన్న‌ట్టుగా టాలీవుడ్ ర‌చ‌యిత పెన్నులు ప‌లికాయి. స్టార్ హీరోలు కూడా రాయ‌ల‌సీమ పేరుతో త‌మ త‌మ కెరీర్ లలో సూప‌ర్ హిట్ల‌ను జ‌మ చేసుకున్నారు. సీమ‌కు ఒక దుర్మార్గ‌మైన ఇమేజ్ ను అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం అలా జ‌రిగింది. ఇప్పుడు ఏకంగా త‌మిళ క‌థ‌ను తెచ్చి సీమ‌కు అంట‌గట్టారు!

త‌మిళ‌నాడులో ద‌ళితుల‌పై ఎక్క‌డో జ‌రిగిన ఒక ఊచ‌కోత ఆధారంగా క‌మ‌ల్ హాస‌న్ ఒక సినిమాను రూపొందించ‌నున్న‌ట్టుగా కొన్నేళ్ల కింద‌ట ప్ర‌క‌టించాడు. ఒకే ఊర్లో ప‌దుల సంఖ్య‌లో ద‌ళితుల‌ను ఊచ‌కోత కోశార‌క్క‌డ‌. అది కొన్ని ద‌శాబ్దాల కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న‌, త‌మిళ‌నాడు చ‌రిత్ర‌లోనే ఒక చీక‌టి అంశం. క‌మ‌ల్ ఆ సంచ‌ల‌న క‌థాంశాన్ని సినిమాగా రూపొందిస్తానంటూ గ‌తంలో ప్ర‌క‌టించాడు. దానికి *దండం అయ్యా* అనే మీనింగ్ వ‌చ్చేలా ఒక త‌మిళ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.  అయితే అది ప‌ట్టాలెక్క‌లేదు. 

క‌మ‌ల్ వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యాడు. ఈ క్ర‌మంలో ద‌ళితుల‌పై జ‌రిగిన అదే ఊచ‌కోత ఆధారంగా ధ‌నుష్ అసుర‌న్ సినిమాను అనౌన్స్ చేశాడం, దాన్ని రూపొందించి, విడుద‌ల చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. క‌మ‌ల్ హాస‌న్ అనుకున్న కాన్సెప్ట్ ను ధ‌నుష్ ప్ర‌భావ‌వంతంగా రూపొందించాడు, ప్ర‌శంస‌లు పొందాడు. అక్క‌డి వ‌ర‌కూ అభినంద‌నీయ‌మే. ఇలాంటి చీక‌టి చ‌రిత్ర‌ను తెర‌కెక్కించి భావి త‌రాల‌కు జ‌రిగిన విష‌యాల‌ను గుర్తుంచుకొమ్మ‌ని చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. 

ద‌ళితుల‌పై ఆ త‌ర‌హా ఊచ‌కోత‌ల‌కూ, అంట‌రాని త‌నానికి తెలుగు గ‌డ్డ ఏమీ మిన‌హాయింపు కాదు. కాబ‌ట్టి అలాంటి సినిమాను తెలుగు వాళ్ల‌కు రీమేక్ గా ప‌రిచ‌యం చేయ‌డం కూడా మంచిదే. అయితే.. దాన్ని తెచ్చి రాయ‌ల‌సీమ‌కు ఆపాదించ‌డం, రాయ‌ల‌సీమ‌లో అలాంటి ఘ‌ట‌న జ‌రిగింద‌న్న‌ట్టుగా చూప‌డం మాత్రం నిర్ద్వంద్వంగా ఖండించాల్సిన అంశం.

రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు ఉండ‌వ‌చ్చు, కొన్ని కుటుంబాల మ‌ధ్య‌న ర‌చ్చ‌లు రావ‌ణ‌కాష్టంగా మారి ఉండొచ్చు. కేవ‌లం కొన్ని కుటుంబాల‌కు మ‌ధ్య‌న జ‌రిగిన ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ల‌ను రాయ‌ల‌సీమ మొత్తానికీ ఆపాదించేశారు ఇప్ప‌టికే. ఇప్పుడు తెచ్చి ద‌ళితుల‌పై ఊచ‌కోత‌లు, కులాల కుంపట్ల‌ను కూడా రాయ‌ల‌సీమ‌కే అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్టుగా ఉంది నార‌ప్ప సినిమాతో. 

రాయ‌ల‌సీమ చ‌రిత్ర‌నంతా వెదికినా… కులాల పై దాడులు, ఊచ‌కోత‌లు లేవు. ఉండ‌వు. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయంలో కూడా హ‌తులు వివిధ కులాల వారు ఉంటారు. బ‌డుగు కులాల వ్య‌క్తులు కూడా ఫ్యాక్ష‌న్ రాజ‌కీయంలో ఆ గ్రూప్ లోనూ ఉంటారు, ఈ గ్రూప్ లోనూ ఉంటారు. ఇటూ ఇటూ రెడ్డి కుల‌స్తుల మ‌ధ్య‌నే ఫ్యాక్ష‌న్ హ‌త్యాకాండ‌లు న‌డిచిన ఉదంతాల్లో కూడా.. ఇత‌ర కుల‌స్తులు రెండు గ్రూపుల్లోనూ ఉంటారు. 

ఇలా ఎలా చూసినా.. రాయ‌ల‌సీమ‌కు ఈ కులాల ఊచ‌కోత మ‌కిలి అంట‌దు. కులాల వారీగా ఎక్క‌డ హ‌త్య‌లు జ‌రిగాయో తెలుగు వారికి ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. ఈ దుష్ట చ‌రిత్ర విష‌యంలో వేరే ప్రాంత పేరు ప్ర‌స్తావ‌న కూడా అన‌వ‌స‌ర‌మే. మ‌రి ఇంత చ‌రిత్ర‌ను పెట్టుకుని.. త‌మిళ గోడును తెచ్చి రాయ‌ల‌సీమ‌కు ఆపాదిస్తూ.. తెలుగు చిత్ర‌సీమ సీమ‌పై త‌న చిన్న‌చూపును చాటుకుంటూ ఉంది. ఇది కొత్త కాదు. సీమ‌కు దుర్మార్గాల‌ను ఆపాదించే ప్ర‌య‌త్నాలు ఇప్పుడు కూడా కొన‌సాగుతూ ఉండ‌టం విచార‌క‌రం. ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తూ ఉంటే.. రాయ‌ల‌సీమ ప్రాంతంలో క‌చ్చితంగా ప్ర‌తిఘ‌ట‌న వ్య‌క్తం అయ్యేది. 

థియేట‌ర్ల‌లో దీని ప్ర‌ద‌ర్శ‌న‌ను శాంతీయుతంగానే అడ్డుకునే అవ‌కాశం ఉండేది. అయితే ఓటీటీ విడుద‌ల కావ‌డంతో.. దీని రూప‌క‌ర్త‌లు సేఫ్ అవుతున్నారు. అయితే ఇప్ప‌టికీ రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు ఒక అవ‌కాశం ఉంది. ఈ సినిమా గురించి నెగిటివ్ రేటింగ్ ఇవ్వ‌డం, త‌ప్పుడు చ‌రిత్ర‌ను రాయ‌ల‌సీమ‌కు ఆపాదిస్తున్న ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూల‌తో విరుచుకుప‌డ‌టం వంటి అవ‌కాశాలున్నాయి. ఈ సినిమా రూప‌క‌ర్త‌లు, ఈ విష‌యంలో స్పందించాల్సి ఉంది.

జీవ‌న్ రెడ్డి.బి