మోదీ, యోగీ డ్రామాలు.. జనాలు చూస్తున్నారు

కుంభమేళా పేరుతో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం పరోక్ష కారణంగా నిలిచింది. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇతోధికంగా సాయపడ్డాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది, మూడో వేవ్ ముప్పు భయపెడుతోంది.…

కుంభమేళా పేరుతో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం పరోక్ష కారణంగా నిలిచింది. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇతోధికంగా సాయపడ్డాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది, మూడో వేవ్ ముప్పు భయపెడుతోంది. ఈ సందర్భంలో కావడ్ యాత్ర అనే పేరుతో మరో తప్పు చేసేందుకు సిద్ధమయ్యారు నేతలు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం యాత్రకు అనుమతిస్తే, ఉత్తరాఖండ్ తప్పు తెలుసుకుని తప్పుకుంది.

యాత్ర పేరుతో ప్రజల ప్రాణాలు పోవడానికి దేవుడు కూడా ఇష్టపడడు అంటూ ఉత్తరాఖండ్ కొత్త సీఎం చేసిన వ్యాఖ్యలు చాలామంది కళ్లు తెరిపించాయి. కానీ యూపీలోని యోగీ ప్రభుత్వం మాత్రం అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే కావడ్ యాత్ర చేపడతామని లాజిక్ తీస్తోంది. దీంతో సుప్రీంకోర్టు సీన్ లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది.

కావడ్ యాత్రకు యూపీ పర్మిషన్ ఇవ్వడాన్ని సుప్రీం సీరియస్ గా తీసుకుంది. యాత్రను మీకై మీరు రద్దు చేస్తారా? లేదా మమ్మల్ని రద్దు చేయమంటారా అంటూ యూపీకి అల్టిమేట్టం జారీ చేసింది. దీంతో కావడ్ యాత్ర రద్దవుతుందని తేలిపోయింది. అసలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, పట్టించుకోవాల్సిన కేంద్రానికి కానీ ప్రజల ప్రాణాలపై బాధ్యత లేదా..? 

లాక్ డౌన్ ఎత్తేశాక దేశంలో విహార యాత్రలు పెరిగిపోయాయని, జనాలు కొవిడ్ నిబంధనలు పాటించకుండా బయటకొచ్చేస్తున్నారని, మూడో వేవ్ కి ఇలాంటి వారే కారణం అని ఈమధ్య ప్రధాని మోదీ మొసలి కన్నీరు కార్చారు. నిజంగా అంత సింపతీ ఉంటే యోగీకి చెప్పి యాత్రను ఆపించేయొచ్చు కదా..? సీఎం కుర్చీ పీకిపారేస్తామంటూ భయపెట్టి మరీ యోగిని ఢిల్లీకి పిలిపించుకున్న మోదీ.. కావడ్ యాత్ర రద్దు చేసేయండి అని ఆదేశాలివ్వలేరా. బీజేపీ పాలిత రాష్ట్రం, కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తుందని ఎవరైనా ఊహించగలరా..?

ఇక్కడ ట్విస్ట్ అదే..

ప్రధాని మోదీ ఆదేశాలిస్తే.. కచ్చితంగా యోగీ ప్రభుత్వం దాన్ని అమలు చేయాల్సిందే. కరోనా కష్టకాలంలో తోక జాడించడానికి అవకాశమే లేదు. కానీ యూపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి, అక్కడ హిందూ ఓట్లు గుంపగుత్తగా బీజేపీకి పడాలి. అలా జరగాలంటే ఇలాంటి యాత్రలకు చూసీ చూడనట్టుగా అనుమతులిచ్చేయాలి. అందుకే యోగీతో యాత్రకు అనుమతిచ్చేలా చేశారు, ఇప్పుడా యాత్రను రద్దు చేసే పాపాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఖాతాలో వేస్తున్నారు.

యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందని, సుప్రీంకోర్టుతో కూడా కొట్లాడిందనే పేరు రావాలి. యాత్ర రద్దుకి సుప్రీంతో ఆదేశాలిప్పించాలి. మోదీ-యోగీ కలసి ఆడుతున్న డ్రామా ఇది. ఈ నాటకాలు తెలుసుకోలేనంత అమాయకులేం కాదు భారత ప్రజలు. ఇప్పటివరకూ ఈ వేషాలతోనే జనాల్ని మోసం చేశారు.

యూపీ స్థానిక ఎన్నికల్లో ఓటర్లు యోగీకి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రాబోతున్నాయి. అందుకే మోదీ-యోగి కలిసి ఇలా ముందస్తుగా హిందూజపం చేస్తున్నారు. యాత్రల పేరుతో జనాల్ని రెచ్చగొడుతున్నారు.