మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా తను సిద్ధమని రాజశేఖర్ ఇది వరకే ప్రకటించారు. జగపతిబాబు టైపులో కెరీర్ ను మార్చుకోవాలని చూస్తున్నారు. హీరోగా మార్కెట్ పడిపోవడంతో ఇక విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఎప్పటికప్పడు ఆ 'ఎంట్రీ' వాయిదాపడుతూనే ఉంది.
నిజానికి అఖండ సినిమాతో రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నారంటూ ఆమధ్య వరుసగా కథనాలొచ్చాయి. ఈ మేరకు యూనిట్ నుంచి ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో మరోసారి జగపతిబాబు వైపు మొగ్గుచూపారు బోయపాటి.
ఇప్పుడు మరోసారి రాజశేఖర్ పేరు తెరపైకొచ్చింది. తాజాగా ప్రకటించిన గోపీచంద్-శ్రీవాస్ సినిమా కోసం రాజశేఖర్ ను గట్టిగా ప్రయత్నిస్తున్నారట. అయితే ఇది విలన్ పాత్ర కాదు. సినిమాను మలుపు తిప్పే ఓ మంచి పాత్ర కోసం రాజశేఖర్ ను దర్శకుడు సంప్రదించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజశేఖర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న ఈ సీనియర్ నటుడు.. ఈమధ్య తన పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు 2 సినిమాలు ప్రకటించారు. ఇలా హీరోగా బిజీగా ఉన్న రాజశేఖర్ ను.. గోపీచంద్ సినిమా కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చగలరా అనేది డౌట్.