బాలీవుడ్ ప్రముఖ నిర్మాత భూషన్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. ఒక 30 యేళ్ల యువతి ఫిర్యాదు మేరకు భూషన్ కుమార్ పై అత్యాచారం కేసును నమోదు చేసినట్టుగా ముంబై పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కేసులో ఇంకా ఆయనను అరెస్టు చేయలేదు. ఆయనను ఇంకా ప్రశ్నించనట్టుగా తెలుస్తోంది.
ప్రముఖ ఆడియో కేసెట్ల సంస్థ టీ-సీరిస్ గుల్షన్ కుమార్ తనయుడే ఈ భూషన్ కుమార్. టీ- సీరిస్ సంస్థ అనేక సినిమాలను నిర్మించింది, నిర్మిస్తోంది. ప్రస్తుతం కూడా ఆ మూవీ మేకింగ్ సంస్థకు సంబంధించిన సినిమాలు విడుదలకు సన్నద్ధం అవుతున్నాయి. అంతే కాదు.. ఈ భూషన్ కుమార్ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు.
ఆమె పేరు దివ్యా ఖోస్లా. తెలుగులోనూ, దక్షిణాది భాషల్లో దివ్యా ఖోస్లా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వివాహానంతరం దివ్యా ఖోస్లా కుమార్ గా ఆమె బాలీవుడ్ మీడియాలో సెలబ్రిటీగా చలామణిలో ఉన్నారు. ఇప్పుడు ఆమె భర్త అత్యాచారం కేసును ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.
ఇక భూషన్ పై ఈ తరహా ఆరోపణలు రావడం కొత్త కాదు. గతంలో మీ టూ ఉద్యమం ఎగసిన సమయంలో భూషన్ పై ఒక యువతి ఇదే తరహా ఆరోపణలు చేసింది. ఆయనతో పడుకోవడానికి నిరాకరించినందుకు తనను ఒక ప్రాజెక్టు నుంచి తప్పించినట్టుగా ఆమె ట్వీట్ చేసింది. అయితే భూషన్ ఆ ఆరోపణలను ఖండించాడు. ఫేమ్ కోసమే తన పేరును లాగారని అన్నాడు.
ప్రస్తుతం భూషన్ పై ఆరోపణలు చేసిన యువతి.. ఆయన తనపై మూడు సంవత్సరాల పాటు లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా తన కంప్లైంట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. తను టీ-సీరిస్ లో పని చేసినట్టుగా ఆమె చెప్పిందట.
తను పని చేస్తున్న తరుణంలో భూషన్ కుమార్ తనపై వరసగా మూడేళ్ల పాటు అత్యాచారం చేసినట్టుగా ఆమె తన కంప్లైంట్ లో వివరించిందట. ఇక ఈ అంశంపై భూషన్ కుమార్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. పోలీసులు కూడా ఆయనను ప్రశ్నించడం కానీ, ఇంకా అరెస్టు చేయడం కానీ లేదు.