అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా ఓ మహిళా మాజీ ఎమ్మెల్యే రాజీనామాతో విజయనగరం జిల్లాలో ఆ పార్టీకి “శోభ” పోయినట్టైంది. 22 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా, తనకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని మనస్తాపం చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి శనివారం రాజీనామా చేశారు.
గతంలో ఆమె తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా, విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యేగా సేవలందించారు. మహిళా అధ్యక్షురాలిగా శోభా హైమావతి ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసేవారు. గిరిజన నాయకురాలిగా ఆ సామాజిక వర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేశారు.
ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీలో పరిణామాలను జీర్ణించుకోలేకే టీడీపీని వీడుతున్నట్టు ఆమె ప్రకటించారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబుకు పంపనున్నట్లు ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా శోభా హైమావతి కుమార్తె స్వాతి వైసీపీలో కొనసాగుతున్నారు. తల్లి ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. డెంటల్ విద్యనభ్యసించిన ఆమె రాజకీయాలకు గ్లామర్ తీసుకొచ్చారు. మొట్ట మొదటిసారి ఆమె విజయనగరం జిల్లా వేపాడ జెడ్పీటీసీ సభ్యురాలిగా టీడీపీ తరపున ఎన్నికయ్యారు. ఎస్టీ కోటాలో విజయనగరం జెడ్పీటీసీ చైర్‌పర్సన్‌గా చిన్న వయసులోనే ఆమెను పదవి వరించింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ సీటును ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి దక్కడంతో ఆమె నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే స్వాతి తల్లి మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆమె పార్టీని వీడడం టీడీపీలో చర్చనీయాంశమైంది.