2 సినిమాలు రెడీ.. రిలీజ్ ఎలా నాని గారు..!

కరోనా వల్ల హీరోల ప్లాన్స్, ప్లానింగ్స్ అన్నీ తారుమారయ్యాయి. మరీ ముఖ్యంగా ఏడాదికి మినిమం 3 సినిమాలు చేసే హీరోలు లాక్ డౌన్ దెబ్బకు బాగా ఇబ్బంది పడ్డారు. షూటింగ్స్ వాయిదాపడ్డం అనేది ఓ…

కరోనా వల్ల హీరోల ప్లాన్స్, ప్లానింగ్స్ అన్నీ తారుమారయ్యాయి. మరీ ముఖ్యంగా ఏడాదికి మినిమం 3 సినిమాలు చేసే హీరోలు లాక్ డౌన్ దెబ్బకు బాగా ఇబ్బంది పడ్డారు. షూటింగ్స్ వాయిదాపడ్డం అనేది ఓ కోణమైతే, రిలీజ్ డేట్స్ దొరక్కపోవడం మరో సమస్యగా మారింది. ఇప్పుడీ రెండో సమస్యతో బాధపడుతున్నాడు నాని.

నాని నటించిన రెండు సినిమాలు రెడీ అయిపోయాయి. వీటిలో ఒకటి టక్ జగదీష్. ఈ సినిమా సెకెండ్ వేవ్ కు ముందే ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయింది. కట్ చేస్తే, ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా దాదాపు రెడీ అయింది.

శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ నెలాఖరుకు సినిమా రెడీ అయిపోతుంది. టక్ జగదీశ్ సినిమాకే ఇంకా విడుదల తేదీ ఫిక్స్ చేయలేదు. అంతలోనే శ్యామ్ సింగరాయ్ కూడా విడుదలకు సిద్ధమవ్వడంతో.. ఇప్పుడీ రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత నానిపై పడింది.

ఓవైపు ఈ వ్యవహారం ఇలా నడుస్తుంటే, మరోవైపు టక్ జగదీష్ రిలీజ్ పై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తున్నాయి. ఈ నెల 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తారంటూ తాజాగా ప్రచారం మొదలైంది. కొంతమంది పోస్టర్లు కూడా తయారుచేసి వదిలారు. 

ఓవైపు ఈ పుకార్లు ఖండించలేక, మరోవైపు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేక సతమతమౌతున్నాడు నాని. టక్ జగదీష్ కు ఓ దారి చూపిస్తే తప్ప శ్యామ్ సింగరాయ్ కు దారి దొరికే పరిస్థితి లేదు.