వాళ్లిద్దరూ కాషాయానికి ప్రచారం చేస్తారట!

రాజకీయ నాయకులకు, పార్టీలకు ప్రచారం యావ ఎక్కువ. తమకు సంబంధించి ప్రజల్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరగాలని వారి కోరిక. అలాగే పార్టీలు ఎప్పుడూ పరస్పరం ఒకదానితో మరొకటి మైండ్ గేమ్ ఆడుతుంటాయి.…

రాజకీయ నాయకులకు, పార్టీలకు ప్రచారం యావ ఎక్కువ. తమకు సంబంధించి ప్రజల్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరగాలని వారి కోరిక. అలాగే పార్టీలు ఎప్పుడూ పరస్పరం ఒకదానితో మరొకటి మైండ్ గేమ్ ఆడుతుంటాయి. ఏదో జరుగుతోందని, ఏదో చేసేస్తున్నారని ప్రజలను, ప్రత్యర్థులను టెన్షన్ లో పెట్టడం ఒక అలవాటు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువగా ఎలాంటి పొలిటికల్ గేమ్స్ ప్లే చేస్తోంది. దానిమీద కొంత కాలం చర్చ జరిగి అందరూ జుట్లు పీక్కుంటారు. 

ఈమధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మునుగోడు సభకు వచ్చినప్పుడు ఉన్నట్లుండి హీరో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఇది పక్కా రాజకీయ వ్యూహంతో జరిగిన సమావేశమని అందరికీ తెలుసు. కానీ బీజేపీ నేతలు మాత్రం అదేమీ లేదని, త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండటంతో అమిత్ షా ఆయన్ని అభినందించారని చెవిలో పూలు పెట్టారు.  హీరో జూనియర్ ఎన్టీఆర్ తో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది.

అమిత్ షా, జూనియర్ భేటీపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అదో సెన్సెషన్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ఏం మాట్లాడారు.. త్రిపుల్ ఆర్ సినిమా గురించే మాట్లాడుకున్నారా లేక రాజకీయాలపై చర్చ జరిగిందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏపీలో అయితే ఈ భేటీపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. 

ఇదిలా సాగుతుండగానే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చారు. ఆయన క్రికెటర్ మిథాలీ రాజ్ తో, అంతగా పాపులారిటీ లేని తెలుగు హీరో నితిన్ తో భేటీ అయ్యారు. ఇది కూడా ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్ సంగతి వేరు. ఆయన సినిమా కమ్ పొలిటికల్ ఫామిలీ నుంచి వచ్చాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. అత్యధిక సంఖ్యలో అభిమానులున్నారు. రాజకీయాల వాసన కూడా ఉంది. ఆయనతో అమిత్ షా భేటీ అయ్యారంటే దాని వెనుక ఒక లక్ష్యం ఉండొచ్చు. కానీ నితిన్ తో ఎందుకు నడ్డా భేటీ అయినట్లు? 

శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మిథాలీరాజ్‌, నితిన్‌ సమావేశం కావడంపై తెలంగాణాకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ స్పందించారు. ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతో వారు నడ్డాను కలిశారని వివరించారు. ''ప్రధాని మోదీ పాలన పట్ల తాము ఆకర్షితులయ్యామని మిథాలీరాజ్‌, నితిన్‌ చెప్పారు. ఈ దేశానికి మోదీ సరైన నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. మోదీని కలవాలని ఇద్దరూ తాపత్రయం వ్యక్తం చేశారు.

మిథాలీరాజ్‌, నితిన్‌ను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని జేపీ నడ్డా ఆదేశించారు. క్రీడా రంగం, సినిమా రంగం నుంచి వచ్చిన వారైనప్పటికీ రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రధాని మోదీ కోసం తమ సేవలు అందించేందకు సిద్ధంగా ఉన్నట్టు వారు చెప్పారు. ప్రచారానికి వచ్చేందుకు కూడా సిద్ధమని, మళ్లీ ప్రధానిగా మోదీ నాయకత్వం ఈ దేశానికి అవసరమని వారు చెప్పారు'' అని లక్ష్మణ్‌ తెలిపారు. ఇది నిజమో, కట్టు కథ తెలియదు.