రాజకీయాల్లో అబద్ధాలు చెప్పడం ఒక అర్హత. ఎంత బాగా చెబితే అంత మైలేజీ. వాళ్లు మనల్ని మోసం చేస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేం. ఐదేళ్లు ఆగాలి. కానీ సినిమా వాళ్లు అబద్ధాలు చెబితే మొదటి ఆటకే ప్రేక్షకులు ప్రతీకారం తీర్చుకుంటారు. లైగర్ పరిస్థితి ఇదే. సోషల్ మీడియాలో ఆడుకోడానికి కారణం పూరీ, చార్మీ, విజయ్ దేవరకొండ చెప్పిన అబద్ధాలే. అవి అబద్ధాలు కాదు, ప్రమోషన్ వర్క్‌లో భాగం అనొచ్చు. అంటే ఇదీ అబద్ధమే. “లై”గర్ అంటే అబద్ధం చెప్పేవాడు అని కొత్త అర్థం. ముగ్గురు లైగర్లు కలిసి సినిమాని ముంచేశారు.
ప్రమోషన్ అంటేనే ఉన్నదాన్ని పదింతలు చేసి చెప్పుకోవడం. దీంట్లో ఏమీ తప్పులేదు. ఎవరైనా తమ ప్రాడక్ట్‌ని పొగుడుకుంటారు. సినిమా కూడా అంతే. ప్రేక్షకులు రావాలి. అందుకే ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మంచి కథ, హీరో ఇరగదీశాడు, డైరెక్టర్ మనసు పెట్టి చేశాడు, థియేటర్లు దద్దరిల్లుతాయి ఇలాంటి పడికట్టు పదాలతో షో నడిపిస్తారు. నిజానికి సినిమాలో కంటే టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో హీరోలు చక్కగా నటిస్తారు.
ఫస్ట్ కాపీ చూడగానే హీరోకి, డైరెక్టర్‌కి సినిమా సత్తా అర్థమైపోతుంది. వాళ్లేం అనుభవ శూన్యులు కాదు కదా! సాధారణ ప్రేక్షకుడికే సినిమా జాతకం తెలిసిపోతున్నపుడు ప్రొఫెషనల్స్‌కి తెలియదా? తెలియదంటే భ్రాంతిలో ఉన్నారని అర్థం. తెలిసి కూడా అండపిండ బ్రహ్మాండం అని చెబుతారు. ఎందుకంటే మొదటి మూడు రోజులైనా టికెట్లు తెగితే నాలుగు డబ్బులొస్తాయని. వ్యాపారంలో దీన్ని కూడా క్షమించొచ్చు. అయితే విషయం లేకుండా ఓవర్ హైప్ చేస్తారే , వాళ్లది మాత్రం పక్కా మోసం. లైగర్‌కి జరిగింది ఇదే.
200 కోట్ల నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుందని విజయ్, OTTకి 200 కోట్లకు అడిగితే ఇవ్వలేదని చార్మీ, తాను అద్భుతం తీశానని పూరీ ఊరూరూ తిరిగి చెబుతూ వుంటే జనం నిజమని నమ్మారు. థియేటర్‌లో కూచున్న వెంటనే మూతీముక్కు పగిలిపోయాయి. ఆ కడుపు మంటతో బయటికొచ్చి తిట్టడం స్టార్ట్ చేశారు. నెగెటివ్‌గా మాట్లాడుతున్న వాళ్లని విజయ్ అభిమానులు అక్కడక్కడ అడ్డుకున్నారు కూడా.
వాస్తవం ఏమంటే సినిమా బాగుంటే 100 నెగెటివ్ రివ్యూలు వచ్చినా దాని విజయాన్ని ఆపలేరు. తుక్కు సినిమాని పాజిటివ్ రివ్యూలతో బతికించలేరు. అయినా సినిమా బాగుంటే నెగెటివ్‌గా మాట్లాడే ధైర్యం వుండదు. మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. విషయం వుండడం వల్లే బింబిసార, సీతారామం, కార్తికేయ-2 సైలెంట్‌గా సత్తా చాటాయి. ఫస్ట్ డే కిటకిటలాడే జనం లేరు. అయినా దూసుకుపోయాయి.
ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయకండి. తీసేవాళ్లకి ఉన్నాలేకపోయినా ప్రేక్షకులకి వివేకం , విచక్షణ ఉన్నాయి. అందుకే అనంతపురంలో హిట్ అయిన సినిమా అదిలాబాద్‌లో కూడా ఆడుతుంది. మనుషులందరిలో విశ్వజనీన లక్షణం వుంటుంది. దాన్నే ఎమోషన్ అంటారు. దాన్ని టచ్ చేస్తే హిట్. లేదంటే రివర్స్.
మీరు ఎన్ని కోట్లతో అయినా సినిమా తీయండి. దాని గురించి గొప్పగా చెప్పుకోండి. కానీ తెరమీద ఏదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నామని, తెలిసీ అబద్ధం చెప్పకండి. గుడ్ విల్ పోతే మళ్లీ నమ్మరు. పూరీ, విజయ్ తర్వాతి సినిమాలకి ఎన్ని చెప్పినా జనం ఆచితూచి థియేటర్ వైపు అడుగులు వేస్తారు. ఇది నిజం.
దర్శకులు, హీరోల్లో కొంచెం కూడా ఫెయిర్‌నెస్ లేకపోతే అది తెర మీద మాత్రం ఎక్కడ నుంచి వస్తుంది?
జీఆర్ మహర్షి