అనుకున్నట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక సీటు జనసేనదని తేల్చి చెప్పేశారు. గాజువాకలో 2024 ఎన్నికల్లో జనసేన గెలిచి తీరుతుందని ఆయన అంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గాజువాకలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ 2019లో తనను ఓడించారని ఒకింత బాధను వ్యక్తం చేశారు.
జగన్ దోపిడీదారుడు అని తాను చెప్పినా వినకుండా గెలిపించారని వాపోయారు. అయితే ఇపుడు ప్రజలకు తన విలువ తెలిసినట్లుందని చమత్కరించారు. అందుకే తన రాక కోసం వేలాదిగా జనాలు ఎదురు చూసి ఘనస్వాగతం పలికారని పవన్ అంటున్నారు. తనకు గాజువాక జనాల వార్మ్ వెల్ కం చూస్తూంటే 2024లో జనసేనదే ఈ సీటు అని పూర్తి నమ్మకం ఏర్పడింది అని పవన్ అంటున్నారు.
గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ మళ్లీ పోటీ చేస్తారు ప్రచారం సాగుతూనే ఉంది. తాను కాకపోయినా తన పార్టీ నుంచి ఎవరో ఒకరిని నిలబెడతారు అని అంటున్నారు. ఈ సీటు టీడీపీకి కూడా కావాల్సిందే. ఆ పార్టీ విశాఖ జిల్ల్లా ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నుంచి 2024 లో పోటీకి అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
దాని మీద మీడియా ఊహాగానాలను ఆయన ఇప్పటిదాకా కొట్టి పారేస్తూ వచ్చారు. అయితే ఇపుడు పవన్ కళ్యాణే గాజువాక జనసేనది అని ప్రకటించేశాక పొత్తులలో ఈ సీటుని గాజు గ్లాస్ పార్టీ ఎగరేసుకుని పోవడం ఖాయమని అంటున్నారు. గాజువాక నా నియోజకవర్గం అని పవన్ చెప్పడాన్ని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరనే అంటున్నారు.
ఒక విధంగా జనసేనకు పవన్ కి ఈ సీటు ప్రతిష్టగా చూడాల్సి ఉంది. తాను ఓడిన చోటనే గెలిచాను అని చెప్పుకోవడానికైనా పోటీ చేస్తారని అంటున్నారు. విశాఖ జిల్లాలో వారాహి టూర్ లో పవన్ ప్రకటించిన తొలి సీటు గాజువాక కావడం విశేషం అంటున్నారు. రానున్న రోజులలో ఎక్కడెక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుందో ఆ సీట్ల విషయంలో ఇంతే క్లారిటీతో పవన్ ప్రకటిస్తారు అని అంటున్నారు.