సినిమా హీరోలకు తాము ఏం మాట్లాడుతున్నామనే స్పృహ ఉండటం లేదు. ప్రత్యేకించి రాజకీయ లక్ష్యాలు కలిగిన వారు.. తమ పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఏం మాట్లాడినా చెల్లిపోతుందనే భ్రమల్లో బతుకుతున్నారు. వీరు రాజకీయంగా సాధిస్తున్నది ఏమీ లేకపోయినా.. తమ చేతగాని తనాన్ని ఏవేవో మాటలు చెబుతూ కవర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఉపేంద్ర చేరాడు.
ఆ మధ్య ఒక రాజకీయ పార్టీ పెట్టి.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి తనే రాజీనామా చేసి బయటకు వచ్చిన హీరోయిజం ఈయనది. సొంత పార్టీ పెట్టి.. విలీనాలు చేసిన హీరోలు ఉన్నారు. క్లోజ్ చేసిన వారూ ఉన్నారు. వేరే వాళ్ల పల్లకిలు మోస్తున్న వారూ ఉన్నారు. ఉపేంద్ర మాత్రం తన పార్టీకి తనే రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆ పార్టీ గురించి ఇంకా ఎందుకు మాట్లాడాడో కానీ.. ఫేస్ బుక్ లైవ్ లో తన పార్టీ వైఫల్యం గురించి మాట్లాడుతూ.. ఎవరినో నిందించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ముతక సామెతను చెప్పి బుక్కయ్యాడు.
'ఎక్కడైనా కొందరు చెడ్డవాళ్లున్నారు. వారిని ఇగ్నోర్ చేయాలి. ఊరన్నాకా.. దళితుల ఇళ్లు కూడా ఉంటాయి కదా..' ఇదీ ఉపేంద్ర నోటి నుంచి కన్నడలో జాలు వారిన మాటలు! ఊరన్నాకా దళితుల ఇళ్లు కూడా ఉంటాయనే కన్నడ సామెతను నెగిటివ్ గా ఉదాహరించాడు ఉపేంద్ర. మరి ఒక స్టార్ హీరో, సమాజంపై తెగ ఇదైపోయే హీరో కదా! ఉపేంద్ర తీసిన సినిమాలకు పూర్తి విరుద్ధమైన డైలాగ్ ఇది.
తన రాజకీయ వైఫల్యానికి కొందరు కారణమన్నట్టుగా అలాంటి వారు అంతటా ఉంటారన్నట్టుగా.. చెప్పి దానికి, మధ్యలో ఊరు-దళితుల ఇళ్లు అంటూ ఈ కాలానికి తగని సామెతను చెప్పాడు ఉపేంద్ర. కులాల పేర్లతో చాలా రకాల సామెతలు ఉంటాయి. వాటిని ఈ కాలంలో వాడటం సమంజసం కాదు.
అందునా.. ఉపేంద్ర వాడిన సందర్భం అనుచితంగా ఉంది. ఈ నేపథ్యంలో దళిత వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. పలు చోట్ల ఇతడి పోస్టర్లను కూడా ధగ్ధం చేశారు కర్ణాటకలో. దీంతో ఉపేంద్ర సారీ చెప్పాడు. తను వాడిన సామెత కొందరిని బాధపెట్టిందని సారీ అంటూ ఇతడు మరో పోస్టు పెట్టాడు.