రాజకీయాల్లో కుటిల వ్యూహాల విషయంలో శరద్ పవార్ పేరు ఏనాడో వినిపించింది. సంకీర్ణయుగంలో ప్రధాని అయిపోవచ్చనే లెక్కలతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించాడు ఆ దశలో. అయితే అది కుదరకపోవడంతో తను వ్యతిరేకించి బయటకు వచ్చిన కాంగ్రెస్ కు నమ్మకమైన దోస్తుగా మారాడు. సోనియానాయకత్వాన్ని ఆ పార్టీలో ఉంటూ వ్యతిరేకించిన పవార్, ఎన్సీపీ పెట్టాకా మాత్రం.. ఆమె నాయకత్వంలో నమ్మకమైన బంటుగా పని చేస్తూ వచ్చాడు. అలాగని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో శరద్ పవార్ కు శతృత్వాలు ఏమీ లేవు!
బీజేపీతో అయినా, శివసేనతో అయినా అప్పటి నుంచి అంతర్గతంగా దోస్తీనే చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. అందులోనూ పెద్ద లాబీయిస్టు. ఎంతలా అంటే.. న్యాచురల్లీ కరప్టెడ్ పార్టీ అంటూ మోడీ చేత నిందలు పొందుతూనే, అదే మోడీ ప్రభుత్వం చేత పద్మభూషణ్ అవార్డు పొందినంత ఘనుడు. పవార్ వెనుక ఉన్న షుగర్ లాబీ అలా మోడీ ప్రభుత్వం చేతే ఈయనకు సత్కారాన్ని అందింపజేసిందనే పేరుంది!
ఇక గత పర్యాయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలయ్యాకా.. అజిత్ పవార్ అర్ధరాత్రి వ్యవహారం వెనుక కూడా శరద్ ఆశీస్సులు ఉన్నాయనే టాక్ ఉంది. ముందుగా అజిత్ ను అటు పంపింది శరద్ అని, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడనే పేరుంది. పవార్ ట్రాక్ రికార్డు ప్రకారం అదేమంత విచిత్రం కాదు.
ఇక ఇటీవల అజిత్ పవార్ మరోసారి వెళ్లి బీజేపీతో చేతులు కలిపాడు. మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యాడు. రేపోమాపో ఆయనను బీజేపీనే సీఎంగా చేయవచ్చనే ప్రచారమూ ఉంది. ఈ సారి కూడా అజిత్ కు శరద్ ఆశీస్సులు లేకపోలేదు అంటారు. పైకి అజిత్ తీరును వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడుతున్నా.. అజిత్ చేస్తున్నదంతా శరద్ వ్యూహం మేరకే అంటారు. డిప్యూటీ సీఎం అయిన వెంటనే అజిత్ వెళ్లి శరద్ ను కలిశాడు! అదేమంటే.. బీజేపీ వైపుకు శరద్ ను తీసుకెళ్లడానికి కన్వీన్స్ చేయడానికి అని చెప్పారు. ఆ తర్వాత శరద్ పవార్ భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అజిత్ వెళ్లి పరామర్శించాడు. అది ఫ్యామిలీ వ్యవహారం.
ఇక ఈ సారి అజిత్ దగ్గరికి శరద్ వెళ్లడం ఆసక్తిదాయకం. ఈ నేపథ్యంలో అజిత్ కు శరద్ ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. అయితే అలాంటిదేం లేదని శరద్ చెబుతున్నాడు. తన కుటుంబ సభ్యుడు కాబట్టే తను కలిశానంటున్నాడు! అజిత్ వెళ్లి కలిస్తే.. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ, శరద్ వెళ్లి అజిత్ తో సమావేశం కావడంతో.. ఆ తిరుగుబాటుకు శరద్ ఆశీస్సులు ఉన్నాయనే వారి వాదనకు ఆస్కారం ఏర్పడింది.
లేటు వయసులో శరద్ కు రాజకీయం పట్టు చిక్కడం లేదో, లేక అధికారం అనే మహత్యం ఎంత కురువృద్ధ కుయుక్తుల నేతను కూడా తలవంచేలా చేస్తుందో మరి!