జాతీయ పార్టీ అన్నాకా.. దానికో సిద్ధాంతం ఉంటుంది. విధానం ఉంటుంది, పద్దతి ఉంటుంది! కనీసం ఉంటుందనుకోవాలి! ఈ దేశంలో అలాంటి జాతీయ పార్టీల పేర్లు చెప్పమంటే ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు! మిగతా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలం అని చెప్పుకునే పార్టీల సంగతెలా ఉన్నా.. కనీసం ఈ మూడు పార్టీలకూ రాష్ట్రానికో విధానం ఉండదనే అనుకుంటారంతా!
ఏదైనా జాతీయ స్థాయి అంశం మీద అయినా వీటికో విధానం, పద్ధతి ఉంటుంది. ఇదే విధానం పద్ధతి అన్ని అంశాల్లోనూ ఉంటుందనుకుంటారంతా! అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే కమ్యూనిస్టుల పరిస్థితి కంగాళీగా మారింది. వీళ్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరించడం, తోచినట్టుగా చేయడం గత దశాబ్దకాలంగా ఎక్కువైపోయింది. ఆల్రెడీ కమ్యూనిస్టు పార్టీ ఒక్కటంటే ఒక్క రాష్ట్రానికి కుంచించుకుపోయింది. కాలం చెల్లిపోతున్న దశలో ఉన్నారు కమ్యూనిస్టులు. తెలుగు రాష్ట్రాల్లో అయితే వీరిని జనాలు నమ్మేది లేదు. వీరు ఎటున్నా.. ఫలితమూ లేదు!
మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వరకూ చూస్తే బీజేపీ తను జాతీయ పార్టీ, అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశంలోనే భారీ సభ్యత్వాలున్న పార్టీ అనే అంశాలను మరిచిపోయిందా! అనే సందేహాలు కలుగుతున్నాయి.
తెలంగాణలో మొన్నటి వరకూ అధికారం కోసం పోటీ పడుతుందనే అంచనాలున్న పార్టీ ఇప్పుడు పడుతున్న పాట్లు చూస్తే.. ఆ పార్టీ తరఫున మొన్నటి వరకూ సోషల్ మీడియాలో విపరీతంగా కష్టపడ్డవారు కూడా నివ్వెరపోతున్నారు! ఈ బీజేపీకేమైంది అనుకుని వారు ఆశ్చర్యపోతున్నారు. బుగ్గలు నొక్కుకుంటున్నారు!
తెలంగాణలో పవన్ కల్యాణ్ పొత్తు కోసం బీజేపీ సాగిలాపడటం ఆ పార్టీ వీరాభిమానులను హతాశయులను చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందుకు అదెన్ని రోజులో అన్నం మానేసిన వీరాధివీరుడుతో తెలంగాణ విభజన క్రెడిట్ కోసం ఆరాట పడే బీజేపీ పొత్తు పెట్టుకుంది. అందునా పవన్ పొత్తుతో తెలంగాణలో అనాపైసా ఉపయోగం ఉంటుందా? అనేది కూడా ప్రశ్నార్థకమే! మరి అంతటి దౌర్భాగ్య స్థితి బీజేపీకి ఏర్పడిందా అంటూ ఆ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కూడా ఏడవడం ఒక్కటీ తక్కువ!
ఇక పురందేశ్వరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాకా.. బీజేపీ పరిస్థితి టీడీపీకి తోకగా తయారైంది! సోమూ వీర్రాజు వంటి వాళ్లు ఉన్నప్పటితో పోల్చినా.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది! పురందేశ్వరి బీజేపీ నేతగా కన్నా.. నందమూరి కుటుంబ సభ్యురాలిగానే ఎక్కువగా ఫీలవుతున్నారనేది దాస్తే దాగుతున్న అంశం కాదు.
కుటుంబ పార్టీల విధానాలను విమర్శిస్తూ దేశమంతా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పరిస్థితి ఏపీలో ఇలా దయనీయంగా తయారైంది! తెలంగాణలో పవన్ కల్యాణ్ తో దోస్తీ, ఏపీకి వస్తే పవన్ కల్యాణ్ కు చంద్రబాబుతో దోస్తీ! కమ్యూనిస్టుల కన్నా బీజేపీ పరిస్థితే దయనీయంగా మారుతున్నట్టుగా ఉంది!