బుగ్గ కారు లో తిరగడం అనేది ఒక హోదా, ఒక ముచ్చట! రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు చాలా సహజంగా బుగ్గ కారు లో తిరిగే స్థాయికి ఎదగాలని అరాటపడుతుంటారు. మంత్రి అయితే తప్ప ఆ హోదా దక్కదు. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బుగ్గ కారుల వాడకం మీదనే అనేకానేక వివాదాలు ఏర్పడుతున్నాయి.
కోర్టులు వీటి వాడకాన్ని నియంత్రిస్తూ అనేక తీర్పులు చెప్పాయి. సాక్షాత్తు మంత్రులు కూడా బుగ్గకారులు కలిగి ఉంటున్నారు గాని రోడ్లమీద వెళుతున్నప్పుడు మోత మోగించడం లేదు. కానీ తిరుపతిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నం.
రోడ్డుమీద వెళుతున్నప్పుడు అంబులెన్స్ సైరన్ లాగా మోత వినిపిస్తుంది. తీరా సంస్కారంగా రోడ్డు పక్కకు తప్పుకొని వాహనం నిలబెట్టి గమనిస్తే పోలీసు ఎస్కార్టుతోపాటు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బుగ్గ వాహనం కనిపిస్తుంది. కేవలం ఎమ్మెల్యే, ఆ హోదాకు అదనంగా టీటీడీ చైర్మన్ అయిన కరుణాకర రెడ్డి మోత మోగే వాహన శ్రేణి ముచ్చట తీర్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.
భూమన కరుణాకర రెడ్డి, జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా హోదా వెలగబెట్టాలని కలలు కన్నారు. కుదరలేదు. ఇక ఆయన ఎమ్మెల్యే హోదా కూడా చరమాంకానికి చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీ చేయబోతున్నారు. ఈలోగానే జగన్ ను ఆశ్రయించి మంత్రి పదవులను కూడా తలదన్నే టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ లో మోత మోగించే వైభవం అనుభవిస్తున్నారు.
నిజానికి మంత్రులు కూడా ఇలాంటి పోకడలకు దూరమైన ఈ రోజుల్లో భూమన కు ఇంకా ఆ కోరిక తీరనట్లుగా ఉంది. నిజానికి భూమన కరణాకరరెడ్డి ప్రజల ఎమ్మెల్యే లాగా వ్యవహరిస్తుంటారు. ఎమ్మెల్యే అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటూ తిరుపతిలో అనేక పాదయాత్రలు నిర్వహించిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా సాధారణ సందర్భాల్లో కూడా సామాన్యులతో కలిసిపోయే ఎమ్మెల్యేగా పేరుంది.
అయితే, అసలే ఇరుకిరుకుగా చిందర వందర గా ఉండే తిరుపతి ట్రాఫిక్ లో మోత మోగించుకుంటో తిరగడం ప్రజలకు ఆగ్రహం తెప్పించే సంగతి. వాహనపు సైరన్ మోత పోలీసులదే కావొచ్చు గాక. కానీ అది ఎవరికోసం మోగుతున్నదో వారి మీదనే కదా ప్రజలకు కోపం వస్తుంది.