పెళ్లిలో తద్దినం మంత్రాలు-పవన్ స్పీచ్

తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ సమక్షంలో జనసేన నాయకుడు పవన్ ప్రసంగం ఎలా వుంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్‌ల మీద విమర్శలు కురిపించేంత దమ్ము..…

తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ సమక్షంలో జనసేన నాయకుడు పవన్ ప్రసంగం ఎలా వుంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్‌ల మీద విమర్శలు కురిపించేంత దమ్ము.. ధైర్యం పవన్ కు లేవు అన్నది వాస్తవం. 

జగన్ మీద ఒంటి కాలి మీద లేచినంత, ఏకవచనం వాడినంత గానీ తెలంగాణ నేతల విషయంలో వాడేంత సీన్ పవన్ కు లేదని తెలిసిందే. అందుకే పవన్ స్పీచ్ మీద ఆసక్తి. మరి ఇంతకీ పవన్ ప్రసంగం ఎలా వుంది? అంటే…పెళ్లిలో తద్దినం మంత్రాలు చదవినట్లు తప్ప మరోటి కాదు.

తెలంగాణలో జరుగుతున్నవి రాష్ట్ర ఎన్నికలు. అంతే తప్ప జాతీయ ఎన్నికలు కావు. కానీ పవన్ తన ప్రసంగం అంతా ‘ఔర్ ఏక్ బార్ మోడీజీ’ అన్న పాయింట్ మీదే సాగింది. తన కోరిక అదే అని చెప్పారు. తన మద్దతు ప్రకటించారు. బిసి ల విషయంలో నోటి మాటలు కాదు, నిజమైన చేతలు చేసేది మోడీ అనే అంటూ చెప్పారు తప్ప, తెలంగాణలో అసలు భాజపాకు ఎందుకు ఓటెయాలి. తెరాస కు ఎందుకు ఓటేయకూడదు అన్నది చెప్పలేదు.

పదేళ్లలో దేశం ప్రగతి అంటూ చెప్పుకొచ్చారు తప్ప తెలంగాణలో ప్రగతి వుందా లేదా అన్నది చెప్పలేదు. మోడీకి మరోసారి ఎందుకు ఓటేయాలో చెప్పుకువచ్చారు కానీ అసలు తెలంగాణ ఎన్నికలు కదా, కేసీఆర్ పార్టీకి ఎందుకు వద్దో చెప్పలేదు. 

నిధులు, నీళ్లు అందరికీ అందాయి.. అందలేదు అనే మధ్యన వున్న స్పేస్ లో ఇరుక్కున్నట్లుగా ఓ లైన్ చెప్పిన పవన్, ఇంతకీ తెలంగాణలో నీళ్లు, నిధులు అందరికీ అందాయో లేదో క్లారిటీ ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు.

ఇలా కేవలం మోడీ కోసం వచ్చారు.. మోడీ కోసం మాట్లాడారు.. మోడీ గురించి మాట్లాడారు. అంతే తప్ప తెలంగాణ ఎన్నికల ప్రచార ప్రసంగం చేయలేకపోయారు పవన్.