తనను మోసం చేస్తే సహించనని, ఎంత వరకైనా వెళ్తానని హీరొ శర్వానంద్ అన్నారు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయం స్పష్టం చేసారు. కొన్నాళ్ల క్రితం ఓ నిర్మాతతో రెమ్యూనిరేషన్ విషయంలో తలెత్తిన వివాదం గురించి ప్రస్తావించినపుడు శర్వా ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
రెమ్యూనిరేషన్ పూర్తిగా ఇవ్వకుండా డబ్బింగ్ కూడా చెప్పరని, అలాంటిది తాను అన్నీ పూర్తి చేస్తే, తప్పుడు లెక్కలు చెప్పి, కార్లు కొనుక్కుంటే తాను ఎలా సహిస్తానని అన్నారు. అదే విధంగా తనను తాను అండర్ సేల్ చేసుకోనని, తన మార్కెట్ తన నిర్మాతలకు తెలుసు అని దానికి అనుగుణంగానే రెమ్యూనిరేషన్ వుంటుందని శర్వా అన్నారు.
వరుస షూటింగ్ లతో బిజీ కావడం, తన ప్రమాదం కారణంగా పలు రకాల మందులు వాడడం, స్వతహాగా ఏది పడితే అది తినేయడం వల్ల 90 కిలోల వరకు బరువు పెరిగానని, ఈ విషయం తాను గమనించాను, మిత్రులు కూడా చెప్పారని, దాంతో ఎనిమిది నెలలుగా కాస్త గ్యాప్ తీసుకుని, మేకోవర్ అయ్యా అని శర్వానంద్ చెప్పారు.
తన కెరీర్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కొన్ని హిట్ అయ్యాయని, ఏమైనా ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో వున్నానని అది కీలకమని ఆయన అన్నారు. ఏ సినిమా చేయాలి, ఏది చేయకూడదు అనే డైలమా ఎప్పుడూ వుంటుందని, కానీ ఒకటి మాత్రం వాస్తవమని, మంచి పాత్రలు ఏవీ తాను వదులుకోలేదని, అందువల్లే ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు, ఓ స్థానం వుందని శర్వానంద్ అన్నారు.
ఒకే ఒక జీవితం కథ చాలా గొప్పది అని, ఇలాంటి ఆలోచన అసలు రావడమే గ్రేట్ అని అన్నారు. తాను, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముగ్గురం టైమ్ మెషీన్ తో వెనక్కు వెళ్తామని, అలా వెళ్లి ఎవరికి వారు ఏం చేసారు అన్నది కీలకమన్నారు. తన పాత్ర మాత్రం కోల్పోయిన తల్లిని కలుసుకుంటుందని, ఇది నిజంగా చాలా ఎమోషనల్ పాయింట్ అని శర్వా అన్నారు.
యువి సంస్థలో మూడు సక్సెస్ ఫుల్ సినిమాలు చేసా అని, త్వరలో మళ్లీ అదే బ్యానర్ లో మరో సినిమా చేస్తా అని, మాంచి కథ కోసం చూస్తున్నా అని చెప్పారు.