చంద్రబాబు గారు! ఇదెక్కడి న్యాయం సార్!

చంద్రబాబు గారు! మీ పుత్రరత్నం రాజకీయాలకు కొత్త. ఇంకా పదేళ్లైనా నిండని పసిబాలుడు. మీ నీడలో బతుకుతున్న అమాయకుడు. ఆవేశంలోనో, ఆలోచనారాహిత్యంతోనో ఏదో చేసాడంటే అర్థం చేసుకోవచ్చు. మరి మీరో. 40 ఏళ్ల రాజకీయనుభవం,…

చంద్రబాబు గారు! మీ పుత్రరత్నం రాజకీయాలకు కొత్త. ఇంకా పదేళ్లైనా నిండని పసిబాలుడు. మీ నీడలో బతుకుతున్న అమాయకుడు. ఆవేశంలోనో, ఆలోచనారాహిత్యంతోనో ఏదో చేసాడంటే అర్థం చేసుకోవచ్చు. మరి మీరో. 40 ఏళ్ల రాజకీయనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా గతవైభవం. 

కానీ ఎందుకో అస్సలు పరిణతి కనిపించట్లేదు మీలో. ఎవడో ఒక ఆకతాయి “ఘర్షణ” అని చానల్ పెట్టుకుని అందులో ముఖ్యమంత్రి కుటుంబంలోని స్త్రీల గురించి అసభ్యమైన కారుకూతలు కూస్తూ కూర్చుంటే ప్రభుత్వం ఊరికే కూర్చుంటుందా? కచ్చితంగా అరెష్టులుంటాయి. అంతెందుకు? మొన్నామధ్య ప్రస్తుత ముఖ్యమంత్రి పాలనలోనే తెదేపా మీద హద్దు దాటి వ్యక్తిగతంగా విరగబడిన వైకాపా నెటిజన్లని కోర్టు శిక్షించలేదా? అప్పుడది మీకు చమ్మగా ఉండి ఇప్పుడీ “ఘర్షణ” వెంగళ్రావుని అరెష్టు చేస్తే తప్పొచ్చిందా? 

వైకాపా కోసం నిలబడి తెదేపాని బూతులు తిట్టారు కాబట్టి ఆ నెటిజన్లకి అండగా నిలబడలేదు వైకాపా ప్రభుత్వం. హద్దు మీరి చట్టంలో ఇరుక్కునేంత తప్పు చేస్తే ప్రభుత్వం వచ్చి కాపాడేయనక్కర్లేదు. ప్రభుత్వమంటే చట్టం ప్రయోగించే విషయంలో రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. అన్ని విషయాల్లోనో వైకాపా ధర్మంగా ఉంటూ పక్షపాత రహితంగా పనిచేసేస్తోందని నేననను. ఈ విషయంలో మాత్రం వైకాపా వైఖరిని మెచ్చుకోవల్సిందే. కానీ తమరు అలా కాదు. 

మీదంతా ద్వంద్వనీతి. అది మీ చరిత్రే చెబుతుంది. అప్పట్లో పరిటాల రవి- మద్దెలచెర్వు సూరి కొట్టుకున్నారు. జనం దృష్టిలో ఇద్దరూ ఫ్యాక్షనిష్టులే. ఇద్దరూ హత్యలు చేయించినవారే. కానీ తమకి, తమ కులగుంపుకి పరిటాల గాంధేయవాది; సూరి మాత్రమే క్రిమినల్. ఇదెక్కడి న్యాయం బాబు గారూ! 

వైకాపా పక్షాన భజన చేస్తూ తెదేపా వారిని హద్దులు దాటి పచ్చి బూతులు తిట్టే పంచ్ ప్రభాకర్ లాంటి ఎందరినో వైకాపా “మాకు సంబంధం లేదు” అని పక్కనపెట్టింది. అంతే తప్ప వాళ్లకి పార్టీ నుంచి ఎవ్వడూ అండగా నిలవలేదు. 

మీ పార్టీ నాయకులు అలా కాదు. మీ నాయకులు అమెరికా వచ్చినప్పుడల్లా యూట్యూబులో వైకాపా మీద విరగబడి అమ్మా-ఆలి బూతులు తిట్టే వాళ్ళని వెతుక్కుని మరీ ఇళ్లకెళ్లి శాలువాలు కప్పొస్తున్నారు. 

అంటే తమరు, తమ పార్టీ వారు ఇస్తున్న సందేశమేమిటి? “ఎలా అన్నా వాగండి, ఏ అరచకమైనా సృష్టించండి…మీ వెనుక మేమున్నాం”  అనే కదా!

ఆ మధ్యన మీ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీ భార్యని అనరాని మాటన్నాడని ప్రెస్మీట్లో ఎక్కెక్కి ఏడ్చారు తమరు. మరి అదే బాధ, మంట వైకాపా నాయకులకుండదా సార్? 

ఆ సమయంలో మీరు వల్లభనేని మీద కోర్టు కేసులు పెట్టకపోయారా? కనీసం మీ పార్టీనుంచి డిస్మిస్ కూడా చెయ్యలేని దిక్కుమాలిన రాజకీయం అన్నట్టుంది. 

మీవాడు మీ భార్యని ఏమన్నా పర్వాలేదా? పంటి బిగువున పెట్టుకుని ఒక ఏడుపు ఏడ్చి వదిలేస్తారా? 

“ఆహా!!! ఎంత శాంతమూర్తండి మీరు” అనుకునే లోపే ఈ వెంగళ్రావు లాంటి సోషల్ మీడియా టెర్రరిష్టుల్ని అక్కున చేర్చుకుని ఎంకరేజ్మెంటిస్తారా!

ఇక్కడ పాయింటొక్కటే. ఆన్లైన్ సంఘవిద్రోహుల్ని ఏదో సమరయోధుల్లాగ భావించి వాళ్లకి అండగా నిలవడం దేనికని? అది కూడా సంఘవిద్రోహమే కదా! ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లేదా? 

మీరే ఇలా ఉంటే మీ కుమారుడు లోకేష్ బాబు “మీరు వైకాపా మీద దాడి చేయండి. మీరు లోపలికెళితే నేను బెయిలిప్పిస్తాను. మీరు రెచ్చిపోండి” అని యూట్యూబర్లకి పబ్లిగ్గా భరోసా ఇస్తున్నాడు. 

ఈ దరిద్రాన్నంతా సొంత పేపర్లలో తెదేపా శ్రేయోభిలాషులమీద దాడులంటూ అరపేజీ సైజులో వార్తలు రాయించుకుని దొంగకన్నీరు పెట్టడం మరీ విడ్డూరం. 

ఇదేదో జర్నలిజమ్మీద దాడిలా చిత్రీకరిస్తున్నారు తమరు. వెంగళ్రావు జర్నలిస్టు కాదు. ప్రతి యూట్యూబర్ని జర్నలిష్టనుకుంటే ప్రపంచమంతా జర్నలిష్టులే ఉంటారు. 

ఎంత సేపూ ఎగస్పార్టీమీద ద్వేషాన్నే కాకుండా కాస్త బుర్రని కూడా వాడాలి. లేకపోతే ఇలాంటి పనులవల్ల మీరు జనానికి అసహ్యం తెప్పిస్తున్నారు. హుందాతనాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. న్యూట్రల్ ఓటర్ల నుంచి శాశ్వతంగా దూరమౌతున్నారు. 

శ్రీనివాసమూర్తి