కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద రభసగా తయారవుతుంది. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు సిపిఎస్ ఉద్యోగులు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.
గతంలో ఉద్యోగుల సమ్మె విషయంలో విజయవంతం కాకుండా అడ్డుకోలేకపోయిన పోలీసు యంత్రాంగం.. ఈ దఫా సీఎం నివాసం ముట్టడి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు అడుగు వేయకుండా చూడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది.
సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులను ఎక్కడికక్కడ నియంత్రించడానికి విజయవాడ వరకు వారు రాకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో విజయవాడ నగరం పూర్తిగా ఖాకీ జల్లెడ కింద ఉన్నట్టుగా కనిపిస్తోంది.
బస్టాండు రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాలు హోటళ్లు లాడ్జీలు ఉద్యోగ సంఘ నాయకుల నివాసాలతో సహా పోలీసులు జల్లెడ పడుతున్నారు. విజయవాడ స్థానికులు కాకుండా కొత్తవారు ఎవరు కనిపించినా సరే వారి గురించి ఆరా తీస్తున్నారు. అలాగే వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మొత్తానికి విజయవాడ నగరం మొత్తం నివురు గప్పిన నిప్పులా మారింది. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చునని అభిప్రాయం కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో అసలు సిసిఎస్ రద్దు కోసం ఉద్యోగులు దీక్ష పట్టడం సబబేనా..? వారి ఆందోళన ధర్మ సమ్మతమేనా? అనే చర్చ తెరమీదకు వస్తోంది!!
ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ అనేది ఏ ప్రభుత్వానికైనా ఒక దశ దాటిన తర్వాత గుదిబండగా మారే అవకాశం ఎక్కువ. చాలా అధేనాలు చెబుతున్న కొన్ని వాస్తవాలు ఏంటంటే ఉద్యోగులకు సర్వీస్ కాలంలో పొందిన వేతనాలు కంటే ఇప్పుడు అత్యధికంగా పెన్షన్లు వస్తున్నాయి.
ప్రభుత్వాల కోణంలో నుంచి చూసినప్పుడు ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతాలు మొత్తం కంటే పెన్షనర్లకు ఇస్తున్న మొత్తమే ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఏ ప్రభుత్వం అయినా మనుగడ సాగించడమే అసాధ్యం అవుతుంది.
కేవలం దీర్ఘకాలంగా జీవిస్తున్నారు కనుక ఒకపట్లో ప్రభుత్వానికి సేవ చేశారు గనుక ఒంటరిగా ఉంటున్న ఉద్యోగులు కూడా లక్ష రూపాయలకు మించి పింఛను పొందుతున్న ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి.
కుటుంబం మొత్తాన్ని పోషించుకోవాల్సిన నిరుద్యోగులు, చిరుద్యోగులు లక్షల సంఖ్యలో… పదివేల రూపాయల వేతనానికి కూడా గతి లేని పరిస్థితుల్లో కునారీల్లుతూ ఉంటే.. మరోవైపు ఒక్కటే ఉంటున్నప్పటికీ లక్షల పెన్షన్ పొందుతున్న వారు వేల సంఖ్యలో ఉంటున్నారు. పాత పెన్షన్ విధానం అనేది సమర్థించలేని అసమానతలకు సమాజంలో అవ్యవస్థకు కారణం అవుతోంది.
వీరి ఆందోళన ధర్మమేనా కాదా? అనే చర్చ వచ్చినప్పుడు ఒకటే సందేహం తలెత్తుతోంది. సిపిఎస్ ఉద్యోగులు ఉద్యోగంలో చేరే సమయానికి, అంటే ఉద్యోగానికి ఎంపికై, ఆ ఉత్తర్వులు అందుకునే సమయానికి ఈ నిబంధన ఉందా? లేదా? వారు ఆ నిబంధనకు ఒప్పుకునే విధుల్లో చేరారా? లేదా? అనేదే ఆ ప్రశ్న!
ఉద్యోగంలో చేరినప్పుడు ఒక నిబందనకు తలొగ్గిన వాళ్లు.. చేరిన తర్వాత.. ఆ నిబంధన తొలగించకపోతే ఖబడ్దార్ అంటూ ఇలా రెచ్చిపోవడం చాలా అసహ్యకరమైన పరిణామం. ప్రభుత్వోద్యోగం రాగానే అటు ప్రజలను దోచుకోవడమూ, ఇటు ప్రభుత్వాన్ని దోచుకోవడమూ కూడా తమ హక్కుగా భావించే ధూర్తులు అనేకమంది ఉంటారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఈ నిబంధన వారికి కనిపించలేదా? అనేది అసలు ఏ ఉద్యోగానికీ గతిలేని నిరుద్యోగుల ఆవేదన.
పెన్షను సంగతి తర్వాత.. స్థిరమైన వేతనాలిస్తే.. కాంట్రాక్టు పద్ధతిలో అయినా, ఎంత పని చేయమన్నా చేస్తాం అంటూ ఉద్యోగాలకోసం నిరీక్షిస్తున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. కానీ, ఉద్యోగం రాగానే.. ఒకవైపు భారీ వేతనాలు తీసుకుంటూ, సిపిఎస్ రద్దు పేరిట ధర్మసమ్మతం కాని ఆందోళనలు చేస్తున్నవారు ప్రజల దృష్టిలో చులకన అవుతారు!