దందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

‘‘రెచ్చిపోండి… అడ్డగోలుగా బెదిరింపుల పర్వం కొనసాగించండి.. అందినంత దోచుకోండి..’’ పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులకు శ్రేణులకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ చేశారు. కాలుష్యం పేరు పెట్టి పరిశ్రమల నుంచి యథేచ్ఛగా దోచుకోవడానికి ఆయన…

‘‘రెచ్చిపోండి… అడ్డగోలుగా బెదిరింపుల పర్వం కొనసాగించండి.. అందినంత దోచుకోండి..’’ పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకులకు శ్రేణులకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ చేశారు. కాలుష్యం పేరు పెట్టి పరిశ్రమల నుంచి యథేచ్ఛగా దోచుకోవడానికి ఆయన ఒక పద్ధతైన మార్గం ఏర్పాటు చేశారు. ప్రజలకు మేలు చేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం అని ఒక ముసుగు తగిలించుకోవడం… కాలుష్యకారక పరిశ్రమలను అంతం చేస్తాం అంటూ ఒక గొడుగు తయారు చేసుకోవడం.. ఆ ముసుగులో, ఆ గొడుగు కింద  చెలరేగిపోవడం… ఇది పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు నిర్దేశిస్తున్న తాజా ప్రణాళిక.

రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్యకారక ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించింది. తద్వారా పర్యావరణానికి మేలు చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఫ్లెక్సీలను నిషేధించడం అంటే… నాయకులకు అనుకూలంగా డబ్బా కొట్టుకోవడానికి ప్రతి రోజు జరిగే అడ్డగోలు ప్రచారాలను నిషేధించడమే. ఏ ఊర్లో అడుగుపెట్టినా నాయకుల పేరిట పదులు వందల సంఖ్యలో పెద్దపెద్ద ఫ్లెక్సీ పోస్టర్లు దర్శనం ఇస్తాయి అనే సంగతి అందరికీ తెలిసిందే! లెక్కలు తీస్తే కనుక ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల టన్నుల ప్లాస్టిక్ ఫ్లెక్సీలు తయారవుతూ ఉన్నాయంటే ఆశ్చర్యం ఏమీ కాదు. ఇలాంటి ఫ్లెక్సీలను నిషేధించడం ద్వారా పర్యావరణహితానికి జగన్ ప్రభుత్వం నిజంగానే ఒక అడుగు ముందుకు వేసింది.

అయితే ఇలాంటి నిర్ణయం చూసి పవన్ కళ్యాణ్ కు కన్నుకుట్టినట్టుగా అనిపిస్తోంది. కాలుష్యం అనే క్యాటగిరీ కింద దండుకోవడానికి, దోచుకోవడానికి బోలెడంత అవకాశం ఉండగా తాను ఇన్నాళ్లు చాలా కోల్పోతున్నాను అనే అవగాహన ఆయనకు కలిగినట్టుంది. అందుకే కొత్త ఆలోచనకు శ్రీకారం దిద్దారు.

రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించాలట. ఆ పరిశ్రమల మీద పోరాటం సాగించాలట. ఈ కేటగిరీ కింద ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, అటవీ సంపదకు అనుబంధంగా పనిచేసే కంపెనీలు అన్నింటి పేర్లను పవన్ కళ్యాణ్ లెక్క చెప్పేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటు వెనుక మొత్తం రాజకీయ వక్ర ప్రయోజనాలే ఉన్నట్టుగా ఆయన తేల్చి చెప్పేశారు. ఇలాంటి వాటన్నింటికీ వ్యతిరేకంగా ఇప్పుడు అర్జెంటుగా పోరాడాలని పిలుపు ఇస్తున్నారు. కొత్తగా కాలుష్య కారకులను గుర్తించాలని అనడం పెద్ద డ్రామాగా కనిపిస్తోంది.

ఆయన చెప్పే సిమెంట్ ఫార్మా కంపెనీలు ఆల్రెడీ అందరికీ తెలుసు. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే వాటిని మూసేయించాలని, తద్వారా వాటిలో పనిచేస్తున్న వేల లక్షల మంది కార్మికుల కడుపు కొట్టాలని పవన్ కళ్యాణ్ స్వయంగా ఉద్యమం ప్రారంభించవచ్చు. అలా కాకుండా కొత్తగా రాష్ట్రంలో ఉండే ప్రతి చిన్న కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించండి అంటూ పిలుపు ఇవ్వడం ఒక డ్రామా. ఇలా గుర్తించడం అనే ముసుగు కింద పార్టీ కార్యకర్తలు ఆయా పరిశ్రమల వద్దకు వెళ్లి బెదిరించి దందాలు సాగించడానికి, డబ్బు దండుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు డబ్బు ఇవ్వకపోతే మీరు కాలుష్యం కలిగిస్తున్నారంటూ జనసేన పార్టీ పోరాటానికి శ్రీకారం దిద్దుతాం అంటూ బెదిరించే దందాలు పెరుగుతాయి.

ప్రజా ఉద్యమాల పేరు చెప్పుకొని కొన్ని పార్టీలు పరిశ్రమల వద్దకు వెళ్లి దందాలు సాగించడం, కమిషన్లు పుచ్చుకోవడం.. ఆయా పార్టీల నాయకులు మాత్రం వ్యక్తిగతంగా కోటీశ్వరులుగా మారడం ప్రజలకు తెలుసు. అలాంటి వారి స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటే.. దానిని అభినందించాల్సింది బదులుగా ఈ ఏడుపు ఏమిటో అర్థం కావడం లేదు. 

ప్రభుత్వానికి పర్యావరణం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అంటూ అతిశయాలు పలకడం ఎందుకో అర్థం కావడం లేదు. ఆ మాటకొస్తే కాలుష్య కారకుల మీద పోరాడాలనే స్పృహ పవన్ కళ్యాణ్ కి ఇప్పుడే కలిగిందా.. ఇది కూడా ప్రశ్న కదా! ఆల్రెడీ ఆక్వా రంగంలోని కొన్ని పరిశ్రమల మీద అనుచితమైన పోరాటాలు చేసి భంగపడిన చరిత్ర పవన్ కళ్యాణ్ కు ఉంది. ఇలాంటి పోరాటాలు సాగించేటప్పుడు కనీస వివేచన కలిగి ఉండాలని ఒక నాయకుడిగా ఆయన తెలుసుకోవాలి. 

ఎప్పటికీ అధికారంలోకి రాబోం అనే నమ్మకం ఉన్న పార్టీలు… ఈ రకాల అసాధ్యమైన హామీలు, మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ బతుకుతుంటాయి. పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన తాజా వ్యవహారం కూడా ఆయనను ఆ పార్టీల కోవలోకి కలిపేసేలా  కనిపిస్తోంది.