కుప్పంలో పేదరికానికి బాధ్యులెవరు? 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు అక్కడి ప్రజానీకానికి చేసిందేమిటి? తాను మాత్రం అక్కడి ప్రజల భిక్షతో ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాలను అనుభవిస్తూ, వారిని మాత్రం పేదరికంలోనే మగ్గేలా చేయడం ఎంత వరకు సబబు?
అన్న క్యాంటీన్‌పై చంద్రబాబు సిగ్గలేని దబాయింపు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో పేదలకు ఉచితంగా అన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్‌ను టీడీపీ ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు. అలాంటి అన్న క్యాంటీన్‌ను వైసీపీ పడగొడుతుందా? అని చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతూ ప్రశ్నించారు. అన్న క్యాంటీన్‌ను పడగొట్టడాన్ని ఎవరూ సమర్థించరు. కానీ ఇక్కడ చంద్రబాబు జవాబులు చెప్పాల్సిన ప్రశ్నలున్నాయి.
33 ఏళ్లుగా కుప్పానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్ద మనిషి… పేదరికాన్ని పోగొట్టేందుకు ఏం చేశారు? ఉచిత అన్నం కోసం ఎదురు చూడ్డం అంటే, అడుక్కునేలా చేయడమే. కుప్పం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమ య్యారనేందుకు అన్న క్యాంటీన్ నిదర్శనం కాదా? ఎవరో అన్నం పెట్టే వరకూ ఆకలి తీర్చుకోకపోవడం ఏంటి? ఇదా కుప్పంలో చంద్రబాబు మార్క్ పాలన?
కుప్పం ప్రజలు ఎప్పుడూ భిక్షమెత్తుకుంటూ బతకాలా? ఇదేనా చంద్రబాబు కోరుకుంటున్నది? రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించానని, తానో పెద్ద విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు తన సొంత నియోజకవర్గ ప్రజలు కనీసం తినడానికి తిండి ఖర్చులు కూడా సంపాదించుకోలేని దుర్భర స్థితికి బాధ్యత వహించరా? అలాంటి చోట సంక్షేమ పాలన సాగిస్తున్న వైసీపీకి ఆదరణ లభించడం అంటే… చంద్రబాబు నాయకత్వం విఫలం కాదా?
జనం తమ బతుకు తాము బతికేలా చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? కుప్పం నుంచి నిత్యం వేలాది మంది పొరుగునే వున్న కర్నాటకకు ఉపాధి నిమిత్తం వలస వెళుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టైనా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కుప్పంలో చంద్రబాబు విఫల పునాదులపై వైసీపీ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇది నిజం. తన ఫెయిల్యూర్‌ను దాచి, వైసీపీపై రాజకీయ దాడి వల్ల ఒరిగేదేమీ వుండదు.
కుప్పం టీడీపీ సొంతం కాదని గత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఆ స్ఫూర్తితో వైసీపీ దూసుకెళుతోంది. కుప్పంలో పునాదులు కదులుతుంటే… సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి తదితరులను విమర్శిస్తే లాభం ఏంటి? కుప్పంలో వైసీపీ బలపడడానికి దోహదం చేస్తున్న అంశాలేవో చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. అలా కాకుండా చిల్లర మాటలు, ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తే… అటు వైపు బెదిరే వాళ్లెవరూ లేరని తెలుసుకుంటే మంచిది.