పార్టీలో అసమ్మతిపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వైసీపీ దృష్టి సారించింది. ఎన్నికల ముంగిట అప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయడం వల్ల టికెట్ దక్కని నేతలు రోడ్డెక్కితే ఏదో జరిగిపోతోందన్న సీన్ క్రియేట్ అవుతుందని, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. దీంతో వివిధ సర్వే సంస్థల నివేదికలు, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు వైసీపీ పెద్దలు ప్రిపేర్ అవుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ బాధ్యతలను ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పగించారు. కొన్ని చోట్ల పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. టికెట్ దక్కదనే అనుమానం ఉన్న వాళ్లు, అలాగే తమకు ప్రత్యర్థులుగా ఎదుగుతున్నారనే వారిపై సహజంగానే విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల్లో ఎవరెవరిని పక్కన పెట్టాలనే అంశంపై జగన్ సీరియస్గా కసరత్తు చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా సర్వేల్లో పాజిటివ్ రాని వారిని నిర్మొహమాటంగా పక్కన పెడతానని జగన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. తమను పక్కన పెడతారని అనుమానిస్తున్న వారు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. అటువైపు నుంచి సానుకూల సంకేతాలు రాని వారు ఉన్న పార్టీపై అసమ్మతి వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించడానికే ఇన్చార్జ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అప్పటికీ దారికి రాకపోతే… వారి విచక్షణకే వదిలి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే నష్టాన్ని నివారించడానికి వైసీపీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల అసమ్మతివాదులతో ఇన్చార్జ్ నాయకులు చర్చలు మొదలు పెట్టారు. సదరు అసమ్మతివాదుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్తో చర్చించి, మళ్లీ మాట్లాడ్తామని చెబుతున్నట్టు సమాచారం.