ఆంధ్రలో భాజపా అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకు రాకుండా వుండరు. ఎందుకంటే పవన్ జనసేన 2019 ఓటమి తరువాత ఎదురెళ్లి మరీ భాజపాతో పొత్తు పెట్టుకుంది. ఆంధ్రలో భాజపా భయంకరమైన బలంగా ఏమీ లేదు. ఆ మాటకు వస్తే భాజపా ఎంతో జనసేన కూడా అంతే. రెండు సమానమైన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కనుక, జనసేనను కూడా భాజపా అన్నట్లు చూస్తున్నారు. భాజపాకు పవన్ పెద్ద అండ అన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, తెలుగుదేశానికి అతి పెద్ద మద్దతుదారు అని అందరూ అనుకునెే ఆర్కే వీకెండ్ కామెంట్ గమ్మత్తుగా వుంది.
‘’….తెలంగాణలో అధికారంలోకి రావడమే తరువాయి అని నమ్ముతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ దృష్టిని ఆంధ్రప్రదేశ్‌పై కూడా కేంద్రీకరించారు. ఏపీలో పార్టీ పుంజుకోవడం లేదని గుర్తించిన మోదీ–షా ద్వయం సినిమా గ్లామర్‌ను పార్టీకి అద్దాలన్న నిర్ణయానికి వచ్చారు. తొలుత వారు మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చిరంజీవి తేల్చిచెప్పడంతో వారి దృష్టి ఎన్టీఆర్‌పై పడింది. బీజేపీలో ఎన్టీఆర్ చేరితే ఏపీలో పార్టీ బలపడుతుందన్న అభిప్రాయానికి కేంద్ర పెద్దలు వచ్చారు. అందుకే ఎన్టీఆర్‌ను పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానం అందజేశారు….’’
బహుశా ఈ వ్యాసం రాసేటప్పటికి మరో హీరో నితిన్ కూడా భాజపా పెద్దలను కలుస్తున్నారన్న విషయం తెలిసి వుండకపోవచ్చు. ఆ సంగతి అలా వుంచితే ఆంధ్రలో పార్టీకి సినిమా గ్లామర్ అద్దే ప్రయత్నం..అందుకోసం చిరంజీవిని ఆహ్వానించడం..ఆయన ఎస్ అనలేదని ఎన్టీఆర్ పిలవడం. ఇవన్నీ దేనికి సంకేతాలు. మిత్రుడు పవన్ కన్నా పెద్ద సినీ ఆకర్షణ భాజపాకు ఏమి వుంటుంది. అలాంటి అవసరం ఎందుకు వచ్చింది?
అంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు కలకాలం వుండదని భాజపా భావిస్తోందా?
ఎన్నికల టైమ్ కు భాజపా కనుక తేదేపా దగ్గరకు రాకపోతే పవన్ పొత్తు వదులుకుంటారని భాజపా భావిస్తోందా?
అందుకే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టిందా? అని అనుకోవాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్థిర చిత్తం వున్న నాయకుడు కాదని ఇప్పటికే అర్థమైంది. 2014లో భాజపా వెంట వుండి 2019 టైమ్ కు అదే భాజపాను విమర్శిస్తూ ముందుకు సాగారు. మళ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందాక భాజపా వైపు వెళ్లారు. 2024 కు ఏం చేస్తారో ఆయనకే తెలియాలి. అందుకే భాజపా తన ఏర్పాట్లలో తాను వుందని అనుకోవాల్సి వుంటుంది.
బహుశా అందుకే భాజపా పవన్ ను నమ్ముకోకుండా లేదా స్థిరంగా వుండకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరిక జారీ చేసేందుకో కొత్త ఆకర్షణలకు తెరతీసిందని అనుకోవాల్సి వస్తోంది.