ఇది కాస్త ఆశ్చర్యంగా వుండొచ్చు కానీ, ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితుల అలా వున్నాయి మరి. సత్యరంగయ్య, వెంకట్రామిరెడ్డి లాంటి పెద్ద ఫైనాన్స్ సిండికేట్ లు సినిమా ఫైనాన్స్ దాదాపు 90 శాతం ఆపేసాయి. సుధీర్, శోభన్ లాంటి సిండికేట్ లు కోట్లలో చేస్తాయి కానీ మరీ యాభై కోట్లు, వంద కోట్లు కాదు.
ఇలాంటి నేపథ్యంలో సినిమాలో పెద్ద సినిమాలకు ఫండింగ్ సమస్య కొంత వరకు వుంది. అయితే ఎన్టీఆర్-కొరటాల సినిమాకు ఇప్పటికే ఫైనాన్స్ అగ్రిమెంట్ అయిపోయింది. ఆచార్య విడుదలకు కొన్ని నెలల ముందే సత్యరంగయ్య కంపెనీతో ఈ సినిమాకు ఫైనాన్స్ అగ్రిమెంట్ కుదిరింది, కొద్దిగా అడ్వాన్స్ కూడా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆచార్య సినిమా తరువాత పరిస్థితులు మారాయి. నిర్మాత సుధాకర్ అంటే ఒక విధంగా టాలీవుడ్ కు కొత్త కిందే లెక్క. అలాగే కొరటాల క్రెడిబులిటీ కాస్త మసకబారింది. అందువల్ల ఇప్పుడు ఫైనాన్స్ కంటిన్యూ కావాలంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ తరపున హరి కూడా ఈ అగ్రిమెంట్ లో జాయిన్ కావాల్సి వుంటుందని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఫైనాన్స్ అగ్రిమెంట్ లో భాగమైందో లేదో తెలియదు.
అలా కాకపోతే మాత్రం ఎన్టీఆర్ సినిమాకు ఫైనాన్స్ సమస్య వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా నూరు శాతం ఫైనాన్స్ కాకుండా కాస్తయినా వనరులు స్వంతంగా సమకూర్చుకోవాల్సి వుంటుంది. ఆ దిశగా నిర్మాత సుధాకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా సినిమా, భారీ సినిమా కనుక కనీసం 250 కోట్లకు పైగానే ఖర్చు అవుతుంది. దాదాపు తొమ్మిది భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు. బోలెడు సిజి వర్క్ వుంటుంది. పలు భాషలకు చెందిన భారీ తారాగణం కూడా వుంటుంది. అందువల్ల ఈ సినిమాకు బలమైన ఫండింగ్ తో పాటు అవసరం అయితే నాన్ థియేటర్ ప్రీ సేల్స్, బలమైన పెద్ద ఏరియాల ప్రీ అగ్రిమెంట్లు కూడా కావాల్సి వుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో వున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్ మీదకు వెళ్తుందని బోగట్టా.