ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే దిగ్గజాలవంటి నాయకులు రాజీనామా చేశారు. సీనియర్లు రిజైన్ చేశారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా తరువాత ఎవరు రాజీనామా చేయబోతున్నారనే ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కేరళలో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
ఇది జరుగుతుందా? జరగదా? తెలియాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాలి. గడిచిన దాదాపు ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి చాలామంది ముఖ్య నేతలు గుడ్‌బై చెప్పారు. ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలాంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.
ఆ ఎన్నికల్లో బీజేపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌కు సొంత పార్టీ నుంచి ఎదురవుతున్న ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు. గతంలో వచ్చిన ఒక తెలుగు సినిమాలో స్వర్గీయ నూతన్ ప్రసాద్ మాటిమాటికి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది అనే డైలాగ్ చెబుతుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది.
ఈ ఏడాది మార్చిలో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తూ మే నెలలో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో 'చింతన్ శిబిర్' పేరిట మేధోమథన సదస్సును ఏర్పాటు చేసింది. అయినా, ఆ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. గతేడాది పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదలుకొని తాజాగా గులాం నబీ ఆజాద్ వరకు కాంగ్రెస్‌లో అగ్రనేతల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.
మరోవైపు, పార్టీలో ఎంతో సీనియర్ నేతగా ఉన్న ఆనంద్ శర్మ లాంటి నేతలు త్వరలో హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న వేళ పార్టీ ఇచ్చిన కీలక పదవులకు రాజీనామా చేసి దూరంగా ఉండటం కూడా ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. ఈ ఇబ్బందిని మరింత పెంచేలా శశి థరూర్ పేరు కూడా వినబడుతోంది. కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు తేవాలని, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తూ ఆ పార్టీలో కొందరు సీనియర్లు ధిక్కార స్వరంతో సోనియాకు గతంలో లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జీ-23 గ్రూపుగా ఏర్పడిన వారిలో కపిల్ సిబల్‌తో పాటు గులాం నబీ ఆజాద్ కూడా కీలక సభ్యులుగా ఉన్నారు.
అంతేకాకుండా గతేడాది పార్టీని వీడి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద్, ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతల్ని తిరస్కరించిన ఆనంద్ శర్మ కూడా ఈ గ్రూపులో సభ్యుడిగా ఉండటం గమనార్హం. బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలను కలుపుకొని పోయే అంశంపై దృష్టి పెట్టాల్సిన ఈ కీలక సమయంలో పార్టీ నేతల నుంచే ఎదురవుతున్న ఈ అనుభవాలు కాంగ్రెస్‌ను మరింతగా కుంగదీస్తున్నాయి.
ఓ వైపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతుంటే.. మరోవైపు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటం పార్టీని అయోమయానికి గురిచేస్తోంది. మరికొందరు పదవుల నుంచి తప్పుకోవడం కలవరపెడుతోంది.