టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె దివ్య దీప్తి తండ్రి వారసురాలిగా టాలీవుడ్లో అడుగు పెట్టారు. కోడి రామకృష్ణ, పద్మశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.పెద్ద కుమార్తె దివ్య దీప్తి, రెండో కుమార్తె ప్రవల్లిక.
తండ్రి దర్శకుడైతే, ఆమె మాత్రం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోడి రామకృష్ణ గురించి ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు తర్వాత వంద సినిమాలకు దర్శకత్వం వహించిన ఇద్దరు ముగ్గురిలో కోడి రామకృష్ణ ఒకరు.
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితోనూ ఆయన సినిమాలు చేశారు. ఆయన సినిమాలకో ప్రత్యేకత ఉంటుంది. సెంటిమెంట్‌తో పాటు భక్తి కలగలసి ఆయన సినిమాలు తెరకెక్కించారు.
ఇందుకు ఉదాహరణగా ఆయన తీసిన అమ్మోరు, దేవి, అరుంధతి చిత్రాలను చెప్పుకోవచ్చు. వీటితో పాటు అంకుశం, మంగమ్మగారి మనవడు లాంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా కోడి రామకృష్ణ ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించారు. అనారోగ్యంతో 2019లో తుదిశ్వాస విడిచారు.
ఇప్పుడాయన పెద్ద కుమార్తె దివ్య దీప్తి టాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. దివ్య దీప్తికి సినిమాలంటే పిచ్చి ప్రేమ. 2002 నుంచి 2007 వరకూ తండ్రి సినిమాలకు డైరెక్షన్ విభాగంలో ఆమె పనిచేశారు. పెళ్లి తర్వాత కుటుంబ పనుల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సినిమాలు చేయాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆమె ఇప్పుడు ముందుకొచ్చారు.
‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. దివ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందించనున్నారు. సినిమాపై ఆసక్తితో నిర్మాణ బాధ్యతలు చేపట్టిన దివ్యకు అన్నీ మంచి జరగాలని ఆశిద్దాం.