క‌త్తి మ‌హేష్ మృతిపై పోలీసు విచార‌ణ‌..ఆ కోణంపై దృష్టి!

ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మృతిపై ఏపీ పోలీసుల విచార‌ణ కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టికే ప్ర‌మాద‌స‌మ‌యంలో మ‌హేష్ తో పాటు ప్ర‌యాణించిన సురేష్ ను ఏపీ పోలీసులు విచారించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు పోలీసులు…

ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మృతిపై ఏపీ పోలీసుల విచార‌ణ కొన‌సాగుతూ ఉంది. ఇప్ప‌టికే ప్ర‌మాద‌స‌మ‌యంలో మ‌హేష్ తో పాటు ప్ర‌యాణించిన సురేష్ ను ఏపీ పోలీసులు విచారించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు పోలీసులు ఈ కేసును విచారిస్తూ ఉన్నారు. 

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డ‌టం, సురేష్ మాత్రం స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డటం అనే అంశంపై పోలీసులు అత‌డిని ప్ర‌శ్నించిన‌ట్టుగా తెలుస్తోంది. త‌ను డ్రైవింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్టుగా సురేష్ చెప్పాడ‌ట‌. 

క‌త్తి మ‌హేష్ సీట్ బెల్ట్ ను పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు తీవ్ర గాయాలైన‌ట్టుగా సురేష్ వివ‌రించిన‌ట్టుగా స‌మాచారం. ఈ కేసు విచార‌ణ‌లో త‌ను పూర్తిగా స‌హ‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌ని, మ‌ళ్లీ విచార‌ణ‌కు పిలిచినా హాజ‌రు కానున్న‌ట్టుగా సురేష్ పోలీసుల‌కు, మీడియాకు చెప్పాడు. సుమారు నాలుగు గంట‌ల పాటు సురేష్ ను పోలీసులు విచారించిన‌ట్టుగా తెలుస్తోంది.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో మ‌హేష్ కూర్చున్న వైపే వాహ‌నం ఢీ కొట్ట‌డం, అందులోనూ మ‌హేష్ సీట్ బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం, ప‌గిలిన అద్దాల ముక్క‌లు మ‌హేష్ క‌ళ్ల‌లో గుచ్చుకోవ‌డం.. ఇవ‌న్నీ ఆయ‌న మృతికి కార‌ణాలు అంటూ సురేష్ వివ‌రించాడ‌ట‌. 

సురేష్ వివ‌ర‌ణ సంగ‌త‌లా ఉంటే.. క‌త్తి మ‌హేష్ మృతి గురించి విచార‌ణ అప్పుడే తేల్చేయ‌డం లేదు ఏపీ పోలీసులు. గ‌తంలో మ‌హేష్ పై దాడుల అంశం గురించి వారు వాకబు చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌తంలో మ‌హేష్ పై దాడి చేసిన వారికీ ఈ ప్ర‌మాదానికి ఏమైనా లింకు ఉందా..అనే అంశంపై ప్ర‌స్తుతం పోలీసులు దృష్టి పెట్టిన‌ట్టుగా స‌మాచారం. 

క‌త్తి మహేష్ పై కొంద‌రు తీవ్ర‌మైన కోపంతో ఉన్నారు. ఆఖ‌రికి అత‌డు మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా శాప‌నార్థాలు పెట్ట‌డానికి వెనుకాడ‌నంత స్థాయిలో ఉంది వారి ఆగ్ర‌హం. ఈ నేప‌థ్యంలో కూడా ఈ అంశంపై పోలీసుల విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్టుంది.