భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై ఎటు చూసినా… భక్తజనమే. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు రోజుల తరబడి వేచి చూడడానికి కూడా భక్తులు సిద్ధమయ్యారు.
భక్తులు రాక అనూహ్యంగా పెరగడంతో టీటీడీ పాలకమండలి, అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. ఇటీవల చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అప్రమత్తమైంది. ఎలాంటి విమర్శలు రాకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోంది.
శనివారం ఒక్కరోజే 83 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారంటే, ఏ స్థాయిలో కొండ కిటకిటలాడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వరుస సెలవుల కారణంగా అధిక సంఖ్యలో భక్తులు తిరుమల వస్తున్నారన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, నీళ్లు, పిల్లలకు పాలు అందిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలకు వెల్లువెత్తిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారి దర్శనానికి రావాలని ఆయన కోరారు.
వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ప్రస్తుతం అధిక సంఖ్యలో భక్తులు కొండకు వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.