ఏపీలో బీజేపీ -జనసేన పొత్తులో ఉన్నట్లు పైకి కనబడుతోంది. కానీ రెండు పార్టీలు కలిసి ఏ కార్యక్రమాలూ చేయవు. ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా ఉంటాయి. ఏపీలో కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీతోనే పొత్తులో కొనసాగుతాడా? కొత్తగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడా? లేదా టీడీపీ -బీజేపీ – జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాయా అనేది పెద్ద చర్చనీయాంశమైపోయింది. వైసీపీకి అడ్డుకట్ట వేసే శక్తి టీడీపీకే ఉంది. కానీ పూర్తిగా లేదు. అది ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పనికిరాదు. బీజేపీ అసలు బలం లేదు. పైగా రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న కోపం ఇంకా ప్రజల్లో తగ్గలేదు.
బీజీపీ కంటే పొత్తుకు జనసేన బెటర్. అంతో ఇంతో బలముంది. పొత్తుకు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి విషయం స్పష్టంగా చెప్పడంలేదు. ఇక అసలు విషయానికొస్తే …. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం బిజివేముల కాషాయ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఆయన్ను త్వరలో బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించబోతోంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తరపున ప్రచారాస్త్రం ఎవరనేది తేలాల్సి ఉంది. వైసీపీ తరపున విక్రమ్ రెడ్డి ఇప్పటికే జనాల్లోకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు పరిచయం అయ్యారు. ఇప్పుడు బీజేపీ కొత్తగా తమ అభ్యర్థిని పరిచయం చేయాలి, ప్రచారం చేయాలి. ప్రచార కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ ని ఆహ్వానించాలనుకుంటోంది ఏపీ బీజేపీ. గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. అయితే ప్రచారంలో ఉండగా ఆయన అనారోగ్యంపాలవడంతో.. హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత బద్వేల్ ఉప ఎన్నికల్లో పూర్తిగా బీజేపీకి హ్యాండ్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టినా పవన్ కల్యాణ్ ప్రచారానికి రాలేదు.
దివంగత నేత కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారు కాబట్టి.. తమ ఆనవాయితీ ప్రకారం అక్కడ పోటీ చేయబోము, ప్రచారం కూడా చేయము అన్నారు, అన్నట్టుగానే బద్వేల్ ఉప ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది. ఇప్పుడు ఆత్మకూరులో వైసీపీ తరపున కూడా దివంగత నేత కుటుంబ సభ్యులకే అధికార పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ కూడా సెంటిమెంట్ ప్రకారం జనసేన పోటీలో ఉండకూడదు. అయితే బీజేపీ మాత్రం పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తోంది. ఆయన్ను ప్రచారానికి తీసుకు రావాలనుకుంటోంది. ఇప్పటికే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించారు బీజేపీ నేతలు. ఇక ప్రచారానికి పవన్ ని తీసుకొచ్చి హడావిడి మొదలు పెట్టాలనుకుంటున్నారు. కనీసం పోత్తులో ఉన్న జనసేన పార్టీతో చర్చించకుండా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ప్రకటించడం ఎంత వరకూ సబబు.
దీన్నిబట్టే రెండు పార్టీల మధ్య పొత్తు డొల్ల అని అర్ధమవుతోంది. ఎన్నిక ఏకగ్రీవం అయితే వైసీపీ విజయం సాధించిందని మాత్రమే చెప్పుకోవడానికి వీలుంటుంది. అలా కాకుండా మరో పార్టీ పోటీలో నిలబడటంతో గత కంటే ఎక్కువ మెజారిటీ సాధించామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రచారం రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీకి ఏదో మేరకు సానుకూలత చేకూరుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో బద్వేలు నియోజవకర్గ ఉప ఎన్నికలో కూడా బీజేపీ పోటీ చేసి దారుణంగా పరాజయం పాలైన సంగతి ఈ సందర్భంగా ఒక సారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణింతో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.
మరణించిన ఎమ్మెల్యేకు సానుభూతిగా అక్కడ ఆయన భార్యను వైసీపీ రంగంలోకి దింపడంతో ఆ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తెలుగుదేశం భావించింది. జనసేన కూడా పోటీ నుంచి తప్పుకుని ఆనవాయితీని, సెంటిమెంటునూ గౌరవించింది. అయితే ఏ మాత్రం గెలుపు అవకాశం లేని బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం ఉప ఎన్నికలో పోటీకి దిగాయి. ఫలితం అనూహ్యమేమీ కాదు. బద్వేలులో బీజేపీ, కాంగ్రెస్ లు డిపాజిట్లు కోల్పోయాయి. వాటికి డిపాజిట్లు వచ్చినా ఒరిగేదేం లేదు కానీ, ఆ రెండు పార్టీలూ పోటీలో ఉండటం వైసీపీకి ప్రయోజనం చేకూర్చిందనే చెప్పాలి. మరి ఆత్మకూరు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ ఏపక్షంగా తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.