ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసారి మహానాడుకు ప్రత్యేకత తీసుకొచ్చింది ఈ అంశమే. ఊరువాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతిని పండగగా మార్చేశాయి. బహుశా.. చంద్రబాబు ఈ క్షణంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఉంటే, ఈ స్థాయిలో ఈ వేడుకలు జరిగేవి కాదేమో.
ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే జయంతి ఉత్సవాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎన్టీఆర్ అత్యవసరం.
2024లో తెలుగుదేశం అధికారంలోకి రావడం అత్యవసరం. లేదంటే ప్రజలు ఆ పార్టీని మరిచిపోవడం ఖాయం. అలా మరిచిపోకుండా ఉండేలా చేయడం చంద్రబాబు వల్ల కాదు, లోకేష్ వల్ల అస్సలు కాదు, బాలయ్య సోదిలో కూడా లేరు. సో.. మిగిలింది ఎన్టీఆర్ మాత్రమే. అందుకే చంద్రబాబు ఇంత ప్రయాస పడుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు.
2024లో పార్టీకి ఆక్సిజన్ ఎన్టీఆర్ మాత్రమే. అంతకుమించి చెప్పుకోడానికి బాబు దగ్గర ఎజెండా లేదు, మేనిఫెస్టో అంతకంటే లేదు. అందుకే అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ ఫొటో వైపు కన్నెత్తిచూడని బాబు, ఇప్పుడు విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే ఎప్పట్లానే ఎన్టీఆర్ మరోసారి మూలనపడతారనే సంగతి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సంక్షేమానికి ఆద్యుడు ఆయనే..
ఏపీలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అనే ప్రచారం ఇప్పుడు మొదలవుతోంది. జగన్ తీసుకొచ్చిన పథకాలతో జనం లబ్ధి పొందుతున్నారు. ఈ విషయంలో టీడీపీకి ఎక్కడా విమర్శించే అవకాశం కూడా లేదు. అయితే ఆ పథకాలన్నిటికీ మూలం ఎన్టీఆరేనని మాత్రం చెప్పుకుంటున్నారు.
పోనీ ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకి ఆద్యుడే, మరి చంద్రబాబు ఏం చేశారు..? బాబు వల్లే కదా పార్టీకి నష్టం, కష్టం, అరిష్టం. ఇప్పుడు చంద్రబాబుని ముందు నిలబెట్టి ఓట్లు అడగడం కుదరట్లేదు, అందుకే ఎన్టీఆర్ విగ్రహాన్ని ముందుకు తేవాలనుకుంటున్నారు. ఎవరినైతే వెన్నుపోటు పొడిచారో ఆ వ్యక్తే ఇప్పుడు చంద్రబాబుకు అవసరం అయ్యారు.
అందరినోటా ఆయన మాటే..
మహానాడు కార్యక్రమం ఎన్టీఆర్ జయంతి రోజుతో పాటు మరో రోజు కలిసొచ్చేలా పెడుతుంటారు. ప్రతిసారీ ఎన్టీఆర్ ని స్మరించుకుంటారు. కానీ ఈసారి మాత్రం డోసు ఎక్కువైంది.
చంద్రబాబు అధికారంలో లేకపోవడం, అటువైపు అధికార పక్షం బలంగా ఉండటం, ఎన్నికల్లో టీడీపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. ఎన్టీఆర్ పేరుతో కనీసం కొన్ని ఓట్లయినా దక్కించుకోవాలని చూస్తోంది టీడీపీ. అందులో భాగంగానే ఎన్టీఆర్ జపం మొదలైంది.
పొరపాటున రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే.. ఐదేళ్లపాటు ఎన్టీఆర్ విగ్రహాలను పట్టించుకునేవారే ఉండరు. ఆ గొప్ప అంతా చంద్రబాబుదేనని టముకు వేసుకోవడంలో పార్టీ నేతలు బిజీగా ఉంటారు. ఓ జిల్లాకు ఏకంగా ఎన్టీఆర్ పేరు పెట్టారు సీఎం జగన్. దీన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందించలేని చంద్రబాబుకు, ఇప్పుడు ఎన్టీఆర్ తో చాలా పెద్ద అవసరం వచ్చి పడింది.