కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్ నిర్మాణం కోసం మొత్తం 1,618 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం 385.54 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.
ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు కూడా మంత్రి చెప్పారు. ఎయిమ్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయం అంచనాలు పెరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు.
ఫార్మ్. డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు…
ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని ఆరోగ్య శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. ఫార్మ్.డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్ట్‌లకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వస్తున్నా ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ మాత్రం లేదని వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి చెప్పారు. ఆరేళ్ళ ఫార్మ్.డి కోర్సులో ప్రతి విద్యార్ధి రెండో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఏడాదికి 50 గంటలపాటు ఆస్పత్రిలో పని చేయాల్సి ఉంటుంది.
అయిదో ఏట ప్రతి రోజు ఒకపూట వార్డు రౌండ్ డ్యూటీ విధిగా నిర్వర్తించాలి. ఆరో ఏట 300 పడకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఫార్మ్.డి కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్ధులకు వారి ప్రొవిజనల్ సర్టిఫికెట్‌పై డాక్టర్ ఆఫ్ ఫార్మసీగా రాయడంతోపాటు వారి పేరు ముందు డాక్టర్ అని కూడా పెట్టాలని 2012లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలను అదేశించినట్లు మంత్రి తెలిపారు.
అలాగే ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్ చట్టం కింద ఫార్మ్.డి ఉత్తీర్ణులైన వారిని ఫార్మసీ ప్రాక్టీషనర్‌గా చేర్చడం జరిగినట్లు తెలిపారు. అలాగే డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్స్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతల కింద ఫార్మ్.డి కోర్సును కూడా చేర్చినట్లు ఆయన వెల్లడించారు.