టీడీపీ యువకిశోరం నారా లోకేశ్ పార్టీపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు. ఇందుకు తొలి మెట్టుగా మహానాడును సద్వినియోగం చేసుకున్నారు. కొందరు సీనియర్ నాయకులు గబ్బిలాల మాదిరిగా పట్టుకు వేలాడుతున్నారని గుర్తించారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్న అలాంటి నేతలపై వేటు వేసేందుకు కూడా వెనుకాడకూడదని లోకేశ్ గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో వరుసగా మూడు సార్లు ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వకూడదనే ప్రతిపాదనను లోకేశ్ మహానాడు వేదికగా తెరపైకి తెచ్చారు. లోకేశ్ తీరు కొంత మంది సీనియర్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి మూడుసార్లు ఓడిపోయారు. కానీ చంద్రబాబు కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా శ్రేణులకు నెగెటివ్ సంకేతాలు పంపినట్టైందని లోకేశ్ భావన.
గతంలో జరిగిన తప్పులను పునరావృతం కానివ్వకూడదని లోకేశ్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కత్తెర పట్టారు. లోకేశ్ తీరుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితర నాయకులు మండిపడుతున్నారని సమాచారం.
తన ఓటమికి సామాజిక అంశాలు కారణమని సోమిరెడ్డి చెబుతున్నారు. ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న చోట, గెలుపోటములతో సంబంధం లేకుండా నిలిచి, పార్టీ ఉనికిని కాపాడినట్టు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు.
ఇలాంటివి పరిగణలోకి తీసుకోకుండా, వ్యక్తిగతంగా మనసులో ఏదో పెట్టుకుని అడ్డు తొలగించుకునేందుకు లోకేశ్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే అనుమానం పార్టీలో వ్యక్తమవుతోంది. లోకేశ్ నిర్ణయాలు కొందరి రాజకీయ జీవితాలకు ముగింపు పలికేలా ఉండడంతో, సహజంగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
అయితే పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలంటే, పాతది పోవాలనే సిద్ధాంతాన్ని లోకేశ్ టీఎం తెరపైకి తెస్తోంది. పార్టీని మరోసారి అధికారంలోకి తేవడానికి కఠిన నిర్ణయాలు తప్పవని, కొందరికి చెడ్డయినా ఫర్వాలేదనే భావనలో లోకేశ్ వున్నారు.