మహానాడుతో టీడీపీలో ఊపొస్తుందా?

ఎప్పుడైతే జగన్ అఖండ మెజారిటీతో గెలిచారో, ఎప్పుడైతే టీడీపీ కౌంట్ 23కి పడిపోయిందో, అప్పుడే ఆ పార్టీ చచ్చిపోయింది. పాతాళం వైపు పరుగులుపెట్టింది. Advertisement దాన్ని మళ్లీ పైకి తీసుకొచ్చి నిలబెట్టాలని ఈ వయసులో…

ఎప్పుడైతే జగన్ అఖండ మెజారిటీతో గెలిచారో, ఎప్పుడైతే టీడీపీ కౌంట్ 23కి పడిపోయిందో, అప్పుడే ఆ పార్టీ చచ్చిపోయింది. పాతాళం వైపు పరుగులుపెట్టింది.

దాన్ని మళ్లీ పైకి తీసుకొచ్చి నిలబెట్టాలని ఈ వయసులో చంద్రబాబు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది. దీని కోసం ఆయన మహానాడును వాడుకున్న తీరు కూడా మెచ్చుకోదగ్గదే. అయితే ఇంత కష్టపడి చేసిన మహానాడు కార్యక్రమంతో టీడీపీలో ఊపొస్తుందా?

ఊపు రావాలంటే మహానాడులో బాబు చేయాల్సిందేంటి.. కానీ ఏం చేశారు..? అనేదే ఇప్పుడు చర్చ. మహానాడు కార్యక్రమానికి రాష్ట్రం నలువైపుల నుంచి కార్యకర్తలు తరలి వచ్చారు. వీళ్లందరికీ ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుని సీఎం చేయాలని మనసులో ఉంది. కానీ జగన్ ని శంకించడానికి వారికి మనసు రావడంలేదు. 

అదే సమయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలు కూడా అర్థరహితంగా ఉన్నాయి. దీంతో ఎక్కడా లాజిక్ కుదరలేదు. మహానాడుకి జనం వచ్చారు కానీ, వారంతా తిరిగి టీడీపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తారా..? లేక ఆ ఉత్సాహం కేవలం రెండు రోజులకే పరిమితమా అనేది తేలాల్సి ఉంది.

ఊపు రావాలంటే మహానాడులో చేయాల్సింది విమర్శలు కాదు, ఆశలు చిగురింపజేయాలి, భవిష్యత్తు మనదే అనే భరోసా కావాలి, ఆ భరోసా ఇవ్వడానికి సరైన పునాది ఉంది అనే ఆశ వారిలో కలగాలి. కానీ మహానాడులో ఆ ప్రయత్నం ఒక్క శాతం కూడా చేయలేదు బాబు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని చెప్పుకున్నారే కానీ, చంద్రబాబు హయాంలో సంక్షేమం ఎంతబాగా జరిగిందో చెప్పుకోలేకపోయారు.

మహా అయితే అన్న క్యాంటీన్లు మూసివేశారు అనే విమర్శ చేయగలిగారు కానీ దానివల్ల బాధితులెవరు, వారి పరిస్థితి ఏంటి అనేది కూడా వివరించలేకపోయారు. మద్య నిషేధ హామీ కేవలం జగన్ ది, చంద్రబాబు అధికారంలోకి వస్తే మద్యనిషేధం చేస్తానని హామీ ఇవ్వగలిగితే, జగన్ ని తప్పుబట్టాలి. అప్పటి వరకు జగన్ ని వేలెత్తి చూపించే అవకాశం బాబుకి లేదు. సో ఇక్కడ కూడా నిర్మాణాత్మక విమర్శకు తావు లేదు.

బాదుడే బాదుడు అంటున్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ బాదుడు అన్ని చోట్లా ఉంది. దానికి టీడీపీ దగ్గర సమాధానం లేదు. సో.. ఎలా చూసుకున్నా మహానాడులో టీడీపీది ఫ్లాప్ షో అనుకోవాలి. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, సెకండ్ డే కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ సినిమా లాంగ్ రన్ లో నిలబడలేదన్నట్టుంది టీడీపీ పరిస్థితి.

మహానాడుతో కనీసం పొత్తులపై క్లారిటీ ఇచ్చినా, టీడీపీ 2024 మేనిఫెస్టో ప్రకటించినా, పోనీ వైసీపీ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తానని చెప్పగలిగినా.. కాస్తో కూస్తో సంచలనంగా ఉండేది. కానీ బాదుడే బాదుడు అంటూ.. మహానాడుకి పిలిపించి కార్యకర్తల్ని తన మాటల్తో బాదిపడేశారు చంద్రబాబు. ఆడోళ్లతో తొడలు కొట్టించి మహానాడు కార్యక్రమాన్ని అసహ్యంగా మార్చేశారు.

టీడీపీ నాయకుల ట్విట్టర్ హ్యాండిల్స్ కళకళలాడాయి, కామెంట్లు పడ్డాయి, ఫాలోవర్స్ పెరిగారు కానీ.. మహానాడు వల్ల సామాన్య కార్యకర్తల్లో ఏమాత్రం భరోసా నింపలేకపోయారు చంద్రబాబు. సామాన్య కార్యకర్తలు ఆశించిన ఊపు మహానాడుతో రాలేదు.