విశాఖలో లోకల్ నినాదం మళ్ళీ ఊపందుకుంది. ఎన్నికలు కొద్ది నెలలలో జరుగుతాయనగా ఈ నినాదం బలంగా వినిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా విశాఖ వలస పాలకుల చేతిలో పడి విలవిలలాడుతోందని స్థానిక నేతలు మేధావులు అంటున్నారు. 1991 నుంచి ఇదే పరిస్థితి దాపురించిందని గతాన్ని గుర్తు చేస్తున్నారు.
వలస పాలకుల రాజ్యంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధిలో వెనకబడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా విశాఖ లోకల్ అయిన వారికే టికెట్ ఇవ్వాలని మాజీ వీసీ ఆచార్య కె ఎస్ చలం డిమాండ్ చేశారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్రాలో నూటికి తొంబై మంది ఎస్సీ, ఎస్టీ బీసీలే ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
వారి బతుకులు బాగుపడాలీ అంటే లోకల్ ఎంపీకే చాన్స్ ఈసారి ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్రాలో 20 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములు వలస పాలకుల మూలంగా దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. విశాఖలో స్థానికేతరుల దోపిడీ ఎక్కువైపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నుంచి గడచిన మూడు దశాబ్దాల కాలంలో అభివృద్ధి లేక 30 లక్షల మంది దాకా యువత ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్ళిపోయారని విశాఖలో జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో మేధావులు పేర్కొన్నారు.
విశాఖను కాపాడుకోవాలంటే స్థానికులకే రాజకీయ అధికారం ఇవ్వాలని విశాఖలోనే అభివృద్ధి ఉపాధి దొరికేలా చూడాలని వారు కోరుతున్నారు. విశాఖలో అన్ని పార్టీలూ ఈసారి ఎన్నికల్లో స్థానికులకే ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.