కమలం కళ్లు తెరవకపోతే డేంజరే!

కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాము గనుక.. రాష్ట్రంలో లేని బలాన్ని ప్రొజెక్టు చేస్తూ.. గట్టిగా అరుస్తూ మాట్లాడినంత మాత్రాన ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లాభపడగలం అని అనుకుంటే.. భారతీయ జనతా పార్టీ పప్పులో కాలేసినట్టే.…

కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాము గనుక.. రాష్ట్రంలో లేని బలాన్ని ప్రొజెక్టు చేస్తూ.. గట్టిగా అరుస్తూ మాట్లాడినంత మాత్రాన ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో లాభపడగలం అని అనుకుంటే.. భారతీయ జనతా పార్టీ పప్పులో కాలేసినట్టే.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లోనే అధికార పీఠం మీదికి వచ్చేయాలని.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కమలదళానికి ఒక్కచోటనైనా స్థానం ఉన్నదని చాటుకోవాలని బిజెపి చాలా ఉత్సాహపడుతోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం, రకరకాల సమీకరణలతో కొత్తగా అడుగులు వేయడం జరుగుతోంది. ఇన్ని జరుగుతున్నా సరే, ఆ పార్టీకి ప్రజల స్పందన పరంగా ఎలా ఉందనే సంగతి తర్వాత.. ముందు పార్టీ సంస్థాగతంగానే అంత సానుకూల పరిణామాలు కనిపించడం లేదు. తాజాగా మాజీ మంత్రి చంద్రశేఖర్ బిజెపిని వీడి కాంగ్రెసు తీర్థం పుచ్చుకోవడం అనేది తె-రాజకీయాల్లో కీలక పరిణామం.

రాష్ట్రంలో బిజెపి పరిస్థితి.. అంత ఆశావహంగా కనిపించడం లేదు. రెండు రకాలుగా వారికి ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు పార్టీని వీడిపోతున్నారు. వికారాబాద్ నుంచి ఏకంగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనమైన రికార్డు ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడడం చిన్న విషయమేమీ కాదు. చాలా కాలంగా ఆయన బిజెపి మీద అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. 

ఇలా అనడం కంటె.. పార్టీ కూడా ఆయనను పట్టించుకోవడం లేదని, పక్కన పెట్టిందని అనడం కూడా సబబుగానే ఉంటుంది. సీనియర్లను కలుపుకోవడంపై ఎవరికీ శ్రద్ధ లేదు. ఆయన పోక ఖరారైన తర్వాత.. ఈటల వెళ్లి బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇలాంటి నేపథ్యంలో అలాంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడడమే ఒక దెబ్బ అయితే.. ఆయన తెలంగాణలో ఇటీవలి కాలంలో బాగా బలపడుతున్న కాంగ్రెస్ పంచన చేరడం అనేది మరో కీలకమైన దెబ్బ!

మూలాల్లో తెలుగుదేశం రక్తం ఉన్నట్టువంటి మాజీ మంత్రి చంద్రశేఖర్ కు కాంగ్రెసు పార్టీ కొత్త కాదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫున పెద్దపల్లినుంచి పోటీచేసి ఓడిపోయిన తర్వాతే.. బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కానీ.. ఆయనను పార్టీకోసం వాడుకోవడం గురించి అధిష్ఠానం పట్టించుకోలేదు. స్తబ్ధంగానే ఉండిపోయిన ఈ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. చంద్రశేఖర్ చేరిక కాంగ్రెసు పార్టీకి ఖచ్చితంగా బలం ఇస్తుందనే అనాలి.

ఇటీవలి కాలంలో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తాము ఉన్న పార్టీని వీడదలచుకున్న ప్రతి ఒక్కరికీ కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు మాత్రమే కనిపిపస్తున్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇలాంటి సంకేతాలు ఆ పార్టీకి ఎన్నికలపరంగా మంచి మైలేజీ ఇస్తాయని అనుకోవచ్చు. అసలే రాష్ట్రమంతా పోటీచేయాలంటే.. కనీసం అభ్యర్థులకు కూడా కరవున్న బిజెపి.. ఇలాంటి దెబ్బలు తగులుతూ ఉంటే ఎలా తట్టుకుని మనగలుగుతుందో చూడాలి. 

చంద్రశేఖర్ పార్టీని వీడిన నేపథ్యంలో బిజెపిలోనే ఇంకా పలువురు నాయకులు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.