కొన్నేళ్ల కిందటి సంగతి.. చిరంజీవి వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న టైమ్ అది. అలాంటి టైమ్ లో వచ్చిన ఆచార్య సినిమా మెగా దూకుడుకు స్పీడ్ బ్రేకర్ లా అడ్డుపడింది. ఆ సినిమా దెబ్బతో, తను చేస్తున్న ప్రాజెక్టులన్నింటినీ పునఃసమీక్షించుకున్నారు చిరంజీవి. ఆ టైమ్ లోనే వెంకీ కుడుములతో చేయాల్సిన సినిమా ఆగింది.
మళ్లీ ఇప్పుడు భోళాశంకర్ సినిమాతో చిరంజీవి కెరీర్ కు మరో స్పీడ్ బ్రేకర్ పడింది. మరి ఈసారి ఏ సినిమాపై ఆ ఎఫెక్ట్ పడుతుందో చూడాలి.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో 2 సినిమాలున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. వీటిలో ఒక సినిమా కల్యాణకృష్ణ దర్శకత్వంలో ఉంటుంది.
కూతురు నిర్మాణ సారధ్యంలో అన్నీతానై, కల్యాణకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఈ సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి స్టోరీ కూడా దాదాపు లాక్ చేశారు. తన తదుపరి చిత్రం ఇదేనంటూ చిరంజీవి ఈమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఈ ప్రాజెక్టుకు బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఇంతకుమించి అప్ డేట్ లేదు.
ఇప్పుడీ రెండు సినిమాలపై భోళాశంకర్ ఒత్తిడి ఉంది. ఈ రెండు కథల్ని చిరంజీవి మరోసారి సమీక్షించబోతున్నారు. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా, సినిమాను పక్కనపెట్టడానికి చిరు అస్సలు మొహమాటపడరు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల్లోనే చిరు బర్త్ డే కానుకగా కల్యాణకృష్ణ సినిమా స్టార్ట్ అవుతుంది. భోళాశంకర్ ప్రభావం పడితే మాత్రం ఆలస్యమౌతుంది.