బ్రో సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు తీసుకుంటున్న పారితోషికాలపై చాలా చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ ఎంత పారితోషికం తీసుకున్నారో చెప్పాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మిగతా హీరోల పారితోషికాలపై కూడా కథనాలు వస్తున్నాయి.
వీటిపై తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో చాలా అంశాలున్నాయని, వాటిని పట్టించుకోకుండా, తమ పారితోషికాలపై పడతారేంటంటూ చిరంజీవి కామెంట్ చేశారు.
ఇప్పుడీ వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. పారితోషికాల విషయంలో చిరంజీవికి మద్దతుగా మాట్లాడాడు వర్మ. భారీ పారితోషికాలు తీసుకోవడంలో తప్పు లేదంటున్నాడు.
“హీరోలు భారీగా పారితోషికాలు తీసుకోవడంలో తప్పు లేదు. రెమ్యూనరేషన్ ఇచ్చేవాడిది తప్పు, తీసుకునేవాడిది ఎలా తప్పు అవుతుంది? నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా తీసుకుంటా. నాకు ఎంత ఇవ్వాలనేది నిర్మాత ఆలోచించుకోవాలి. హీరోల విషయంలో కూడా ఇదే లాజిక్ ఉంటుంది.”
హీరోలు తీసుకునే పారితోషికాల భారం ప్రజలపై పడుతుందనే వాదనను అంగీకరించడం లేదు వర్మ. డిమాండ్-సప్లయ్ ఆధారంగానే హీరోల రెమ్యూనరేషన్లు డిసైడ్ అవుతాయని చెబుతున్నాడు.
“పారితోషికాల భారం ప్రజలపై పడుతుందనే వాదనలో నిజం లేదు. హీరోల పారితోషికాలు, వాళ్ల మార్కెట్ వాల్యూ బట్టి వస్తుంది. అంతే తప్ప, భారీగా పారితోషికం ఇచ్చామని టికెట్ రేట్లు ఎవ్వరూ పెంచరు. టికెట్ రేట్లు పెంపుదల అనేది సినిమా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది.”
సినిమాకు క్రేజ్ ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచినా థియేటర్లకు వెళ్లి చూస్తారని, క్రేజ్ లేని సినిమాకు టికెట్ రేట్లు పెంచి ఉపయోగం లేదని కామెంట్ చేశారు ఆర్జీవీ.