ఢిల్లీకి లేఖలు :: చంద్రబాబు ఓవర్ యాక్షన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతున్నదట.. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిందేనట.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోతున్నాయట.. రాష్ట్రపతి తనకున్న విశేషాధికారాలతో జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలట..…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతున్నదట.. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిందేనట.. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోతున్నాయట.. రాష్ట్రపతి తనకున్న విశేషాధికారాలతో జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలట.. మొత్తానికి చంద్రబాబు నాయుడు మదిలో చాలా చాలా కోరికలు ఉన్నాయి! 

ఈ కోరికలన్నింటిని అక్షరాల్లోకి అనువదించి ఆయన ఢిల్లీ పెద్దలకు రెండు లేఖలు రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ఏకంగా తొమ్మిది పేజీల లేఖతో పాటు, తన మీద జరిగిన హత్యాయత్నం గురించి రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతున్న వాతావరణం గురించి 75 పేజీల డాక్యుమెంట్ను వీడియోలను, కూడా జత చేసి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పంపారు.

సూక్ష్మంగా పరిశీలించినప్పుడు, ‘రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టండి’ అనే మాట ఒక్కటీ సూటిగా ఆయన చెప్పలేదు. దాదాపుగా అదే అర్థం వచ్చేలాగా ఫిర్యాదులను ఏకరవు పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి గురించి కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ లేఖ రాయడం అనేది అతిపెద్ద కామెడీగా ఉందని పలువురు భావిస్తున్నారు. 

ఎందుకంటే ఒకవైపు మణిపూర్ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉండగా.. రాష్ట్రం మొత్తానికి అగ్గిపెట్టినట్టుగా కలహాలు, ఘర్షణలు, దాడులు విచ్చలవిడిగా చెలరేగుతుండగా అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం గురించి కేంద్రం నామమాత్రపు ప్రయత్నాలు చేస్తున్నది. 

ఎన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ మణిపూర్ లో భారతీయ జనతా పార్టీ గద్దెమీద ఉన్న కారణం గా రాష్ట్రపతి పాలన విధించడానికి వారికి చేతులు రావడం లేదు. అలాంటిది చెదురు మదురు రాజకీయ ఘటనలు మాత్రమే జరుగుతూ ఉండే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఉంటే వారి స్పందిస్తారా? అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం.

దేశంలోనే తనకు ఎవ్వరికీ లేనంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నదని టముకు వేసుకునే చంద్రబాబునాయుడుకు.. ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం, రాష్ట్రపతి జోక్యం ఉంటుందో కనీస జ్ఞానం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 

చిత్తూరుజిల్లా అంగళ్లు వద్ద ఘటన అయితే.. తెలుగుదేశం కార్యకర్తలు ఏకంగా పోలీసుల మీదనే దాడికి దిగారు. రెచ్చగొట్టిన చంద్రబాబు సహా వారి మీద హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. నేడో రేపు చంద్రబాబు విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. 

పోలీసుల మీదనే చంద్రబాబు పురికొల్పిన దాడిని పోలీసులు తేలిగ్గా తీసుకుంటారని అనుకోవడానికి వీల్లేదు. అందుకే చంద్రబాబు అతి తెలివితో.. ముందుగా కేంద్రానికి ఫిర్యాదుచేసి.. తన మీద పోలీసులు చర్య తీసుకుంటే అది ఒక కుట్ర అని ప్రచారం చేయడానికి వ్యూహం పన్నుతున్నారేమో అని ప్రజలు భావిస్తున్నారు.