ప్రియాంక చోప్రా తీరని కోరిక

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా ఓ కోరిక ఉంది. అదింకా తీరలేదు. అదే పుస్తక రచన. తన ఆటోబయోగ్రఫీ రాయాలనే కోరిక తనకు చాన్నాళ్లుగా ఉందని, కానీ అదింకా పూర్తికాలేదని చెబుతోంది.  Advertisement…

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు కూడా ఓ కోరిక ఉంది. అదింకా తీరలేదు. అదే పుస్తక రచన. తన ఆటోబయోగ్రఫీ రాయాలనే కోరిక తనకు చాన్నాళ్లుగా ఉందని, కానీ అదింకా పూర్తికాలేదని చెబుతోంది. 

ఓప్రా విన్ ఫ్రే సూపర్ హిట్ టాక్ షోలో మాట్లాడిన ప్రియాంక, చాలా విషయాలపై స్పందించింది. అందులో కొన్ని ఆసక్తికరం అంశాలు మీకోసం..

నిక్ మామూలోడు కాదు

పుస్తకం అట్ట చూసి కంటెంట్ చెప్పకూడదంటారు. కానీ నేను మాత్రం నిక్ ను చూసి గుర్తుపట్టేశాను. ప్రారంభంలో నిక్ నాకు మెసేజీలు పెడుతుంటే పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు నాకు 35 ఏళ్లు. 

పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనే ఆలోచన ఉండేది. నిక్ వయసు అప్పుడు 20ల్లో మాత్రమే ఉంది. ప్రారంభంలో నిక్ చేసిన పనులు నన్ను ఆకర్షించలేదు. కానీ నిక్ మామూలోడు కాదు. చాలా సెన్సిబుల్. తనను కలిసిన ప్రతిసారి చాలా అద్భుతంగా ఉండేది.

మిస్ వరల్డ్ గురించి

నాకు తెలియకుండానే పోటీ ప్రపంచంలో లోతుల్లోకి వెళ్లిపోయాను. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటానని అస్సలు అనుకోలేదు.

ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం అది కాదు. 17 ఏళ్ల వయసుకే గ్లామర్ తో నిండిన ఆ పోటీ ప్రపంచంలోకి దూకేయడంతో నాకు ఊపిరాడలేదు.

తండ్రి లేని లోటు

నాన్నలేని లోటు పూడ్చలేనిది. నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన ఎగ్జయిటింగ్ గా ఫీల్ అయ్యారు. చివరికి మంచి డ్రెస్ వేసుకున్నా, కడుపునిండా డిన్నర్ తిన్నా నా కంటే ఎక్కువగా నాన్న ఆనందపడేవారు. 

కెరీర్ లో నేను సాధించిన ప్రతి విజయాన్ని నా కంటే ఎక్కువగా ఆస్వాదించారు. ప్రశాంతంగా ఉండమని మాత్రమే ప్రతిసారి ఆయన నాతో చెబుతుండేవారు. అందుకే ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా నాకు నాన్న గుర్తొస్తారు.

నాన్న కోసం తిరగని చోటు లేదు

నాన్న జీవితకాలాన్ని పెంచేందుకు చేయని ప్రయత్నం లేదు. సింగపూర్, న్యూయార్క్, యూరోప్, ఇండియా ఇలా అన్ని దేశాలు తిరిగాను. ఆ టైమ్ లో నిస్సహాయురాల్ని అయిపోయాను. దేవుడు నాతో లేడనిపించింది. నా సహనాన్ని, విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడనిపించింది. ఆ టైమ్ లో దేవుడిపై చాలా కోపం వచ్చింది.

తీరని కోరిక

ఎన్నాళ్ల నుంచో పుస్తకం రాద్దామని అనుకుంటున్నాను. 2018లోనే స్టార్ట్ చేశాను. కానీ కుదర్లేదు. లాక్ డౌన్ వల్ల కాస్త ఎక్కువ టైమ్ దొరికింది. నా జీవితంపై పుస్తకం (ఆటోబయోగ్రఫీ) రాయాలనేది నా కోరిక. దాని కోసం కాస్త లోతుగా నా జీవితంలోకి తొంగిచూస్తే, కొన్ని ఘటనలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. 

నిజానికి నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి నేను ఎలా రియాక్ట్ అయ్యానో కూడా నాకు తెలియదు. అందుకే పుస్తకం రాయలేకపోతున్నాను.

హిందు-ముస్లిం-క్రిస్టియన్.. అన్నీ

చిన్నప్పుడు కాన్వెంట్ లో చదువుకున్నాను. కాబట్టి క్రిస్టియానిటీ తెలుసు. నాన్న మసీదులో పాటలు  పాడేవారు. కాబట్టి ఇస్లాం గురించి కూడా తెలుసు. ఇక నేను హిందు కుటుంబంలో పెరిగాను కాబట్టి ఆ భావాలు కూడా తెలుసు. 

బేసిగ్గా నేను హిందు. మా ఇంటి ఆవరణలో గుడి కూడా ఉంది. సమయం దొరికినప్పుడు వెళ్లి పూజలు చేస్తుంటాను. అయితే ఈ మతాలు, ఆ దేవుళ్ల కంటే అతీతమైన, అమితమైన శక్తి ఒకటి ఉందని నమ్ముతాను. దానిపై నాకు నమ్మకం.

స్కూల్ డేస్ లో అవమానాలు

అప్పుడే మనకు అన్నీ తెలుస్తాయి. అవమానాలు కూడా. నిజానికి నన్ను అవమానించిన వాళ్లకు కూడా, తాము ఇంకొకర్ని బాధపెడుతున్నాం అనే విషయం తెలియదేమో. 

ఆ వయసు అలాంటిది. 16 ఏళ్ల వయసులో మన శరీరం గురించి మనకు అవగాహన వస్తున్న టైమ్ లో, మరోవైపు అవమానాలు, హేళనలు కూడా ఎదురవుతాయి. ఆ టైమ్ లో అసలు ఈ దేశంలో ఉండకూడదని అనిపించేది. అమ్మకు ఫోన్ చేస్తే వచ్చేది. కలిసి ఇంటికెళ్లిపోయేదాన్ని.

బాలీవుడ్ లో ఎంట్రీ, పరిస్థితి

వినోదరంగంలోకి ప్రవేశించిన కొత్తలో చాలా భయపడ్డాను. కేవలం కష్టపడితే పేరొస్తుందని అనుకోవద్దంటూ అంతా సలహాలు ఇచ్చేవారు. నేను సిస్టమ్ కు తగ్గట్టు పనిచేసుకుంటూ వెళ్లాను.