బాబుకు కుప్పం తాజా హెచ్చ‌రిక ఏంటంటే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కుప్పం న‌డివీధిలో నిలిచి రంకెలేస్తున్నారు. కుప్పం తాజా ప‌రిణామాలు ఆయ‌న‌కు కొత్త హెచ్చ‌రిక‌ను పంపాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు నెల‌ల‌కు ఒక‌సారి మూడు రోజుల పాటు కుప్పం…

టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కుప్పం న‌డివీధిలో నిలిచి రంకెలేస్తున్నారు. కుప్పం తాజా ప‌రిణామాలు ఆయ‌న‌కు కొత్త హెచ్చ‌రిక‌ను పంపాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు నెల‌ల‌కు ఒక‌సారి మూడు రోజుల పాటు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే ఇది స‌రిపోద‌ని, నెల‌లో క‌నీసం ఐదారు రోజులు కుప్పంలోనే చంద్ర‌బాబు వుంటే త‌ప్ప రానున్న ఎన్నిక‌ల‌ను టీడీపీ ఎదుర్కోలేద‌ని స్ప‌ష్ట‌మైంది.

గ‌త రెండు రోజుల ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ గూండాల్లారా రండి అని స‌వాల్ విసిరారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…

“ధైర్యం వుంటే వైసీపీ రౌడీలు ఇప్పుడు రండి. అధికార పార్టీ చోటామోటా నాయ‌కులు, పుంగ‌నూరు రౌడీ పెద్దిరెడ్డి, ఆయ‌న కుమారుడు, త‌మ్ముడు, డీజీపీ, స‌ల‌హాదారులు అంతా క‌లిసి కుప్పం రండి. పోలీసులు కాసేపు ప‌క్క‌న వుంటే ఎంత వైసీపీ గూండాలు వ‌స్తారో చూస్తా. వారి క‌థ రెండు నిమిషాల్లో తేలుస్తా.

న‌న్ను కుప్పం రానివ్వ‌రా? చంపేస్తారా? నేను మీకు భ‌య‌ప‌డాలా? మా కార్య‌క‌ర్త‌ల‌ను కొడితే నేను మీ ఇళ్ల‌కు వ‌చ్చి కొడ‌తా? తెలుగుదేశం పార్టీ రౌడీలు, గూండాలు, తీవ్ర‌వాదులు, ముఠా నాయ‌కుల‌ను అణ‌చివేసింది. నా ప్ర‌జాజీవితంలో ఎంతో మంది నాయకుల‌ను చూశా. నీలాంటి చ‌రిత్ర‌హీనుల్ని మాత్రం చూడ‌లేదు. ఖ‌బ‌డ్దార్ జ‌గ‌న్‌రెడ్డీ” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, స‌ల‌హాదారులు కుప్పానికి రావ‌డం ప‌క్క‌న పెడితే, పూర్తిగా తాను కుప్పంలోనే మ‌కాం వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబుకు అర్థ‌మైంది. ఇళ్ల‌కు వెళ్లి కొడ్తా లాంటి బ‌డాయి మాట‌లు చంద్ర‌బాబు అన‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే మాట‌లు చంద్ర‌బాబువి, చర్య‌లు మాత్రం ప్ర‌త్య‌ర్థుల‌వి అనే రీతిలో కుప్పం ఉంది. చంద్ర‌బాబు గ‌ట్టిగా గ‌ట్టిగా అరుస్తున్నారంటే… ఆయ‌న బాగా భ‌య‌ప‌డుతున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఎందుకో గానీ కుప్పం ఆయ‌న్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఏమ‌వుతుందోన‌న్న ఆందోళ‌న నీడ‌లా వెంటాడుతోంది. అస‌లే త‌న ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్ అంత మంచి వ్య‌క్తి కూడా కాద‌నేది ఆయ‌న భావ‌న‌.  రోజురోజుకూ కుప్పంలో టీడీపీ నైతిక స్థైర్యాన్ని కోల్పోతోంది. ప్ర‌జ‌ల్లో టీడీపీకి ఆద‌ర‌ణ ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని భ‌విష్య‌త్‌లో సొమ్ము చేసుకునే ప‌రిస్థితి ఉందా? అనే అనుమానాలు త‌లెత్తుతు న్నాయి. కుప్పానికి తాను ప‌రుగెత్తేలా జ‌గ‌న్‌తో పాటు చంద్ర‌బాబు ఎవ‌రి పేర్లైతే చెబుతున్నారో వారంతా చేశార‌నేది అక్క‌సు.

రాష్ట్ర‌, జాతీయ నాయ‌కుడిగా గుర్తింపు, గౌర‌వం అందుకున్న తన‌ను చివ‌రికి సొంత నియోజ‌క‌వ‌ర్గానికి క‌ట్ట‌డి చేస్తున్నార‌నే ఆవేద‌న చంద్ర‌బాబులో ఉంది. త‌న‌ను కుప్పం త‌ర‌మ‌డం కాద‌ని, వాళ్లంతా రావాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న త‌న‌కే దిక్కు లేక‌పోతే, టీడీపీ ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌కులు అధికార పార్టీకి ఎదురొడ్డి త‌ట్టుకోగ‌ల‌రా? అనేది ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తున్న ప్ర‌శ్న‌. రానున్న రోజుల్లో కుప్పం మాత్రం అత్యంత వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గం అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.