పుండు రేగితేనే డాక్టరుకి పని! పుండు దానంతట అదే మానిపోతే అందులో డాక్టరుబాబుకి రుచించే పాయింటు ఎందుకుంటుంది? పొలిటీషియను ఎప్పుడూ జనం ప్రశాంతతను కోరుకోడు! వాళ్లలో చిన్న అశాంతి, అభద్రత ఉంటేనే వాళ్లు తన ఎదటకు వచ్చి మోకరిల్లుతారని పొలిటీషయినుకు మహా నమ్మకం.
అందుకోసం వాడు ఎంతకైనా తెగిస్తాడు? లేని అల్లర్లను సృష్టిస్తాడు. ఎదుటి పార్టీ జెండాల్ని పీకుతాడు, ఫ్లెక్సిల్ని పీకుతాడు, దిష్టిబొమ్మల్ని తగలెడతాడు, రాళ్లు రువ్వుతాడు, చేతుల్లో ఇంతింత లావు దుడ్డుకర్రలు పూని రోడ్లమ్మట దబాయింపుగా తిరుగుతాడు. తగాదాలు పెట్టుకోడానికి తహతహలాడిపోతాడు. ముందే చెప్పినట్టు సమాజంలో పుండు రేగకపోతే.. వాడికి రుచి తెలియదు.
కుప్పంలో జరిగింది అదే! తాను నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలు ఊర్లలో తిరుగుతున్నాడు గనుక.. చాలాకాలం కిందట వైసీపీ వాళ్లు కట్టుకున్న వాళ్ల పార్టీ జెండాలన్నీ కూడా పీకిపారేసి ఉండాల్సిందని చంద్రబాబునాయుడు కోరుకున్నారు. పార్టీల పట్ల రాగద్వేషాలు లేకుండా ఒకసారి ఆలోచిద్దాం. చంద్రబాబునాయుడు యాత్ర జరుగుతున్నదని తెలుసు గనుకనే.. ఆ రోడ్డమ్మట కొత్తగా వైసీపీ వాళ్లు జెండాలు కట్టారని అనుకుందాం.
వైసీపీ జెండాలు ఉంటే ఏమవుతుంది? తెలుగుదేశం వాళ్లు కూడా పుష్కలంగా తమ పార్టీ జెండాలు కట్టుకున్నారు కదా! ఆయన తిరిగిన రోడ్డులో.. వారి పచ్చజెండాల మధ్య కొన్ని లేదా మరిన్ని వైసీపీ జెండాలు కనిపించినంత మాత్రాన.. చంద్రబాబునాయుడుకు ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజాదరణ తగ్గిపోతుందా? కేవలం జెండాల వల్ల ఉండే ప్రజాదరణ మాత్రమేనా ఆయనది.
ఏడుసార్లు గెలిపించిన ప్రజలు తనను శాశ్వతంగా ప్రేమించేలా, ఆదరించేలా.. ఏ పార్టీ వారు ఎన్ని గిమ్మిక్కులు చేసినా సరే.. ప్రజలు తన వెన్నంటి ఉండేలా.. ఈ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి.. వారికోసం ఏమీ చేయలేకపోయారా? చేశాననే నమ్మకం ఆయనకు లేదా? ఇవన్నీ మనకు తలెత్తే ప్రశ్నలు.
పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు ఒక కార్యక్రమం కోసం పార్టీలు జెండాలు కట్టుకున్న తర్వాత.. నాలుగురోజులో, వారం రోజులో .. ఒక నిర్దిష్ట వ్యవధిలోగా.. వాటిని తొలగించేయాలనే నిబంధనలు మనకు ఏడ్చిఉంటే ఇలాంటి ఇబ్బంది వచ్చేదే కాదు. ప్రత్యర్థి పార్టీ జెండాలు కనిపించగానే.. ఉడుక్కుని, తన పరువు పోతుందని భయపడిపోయే తత్వం చంద్రబాబులో లేపోయినా ఈ రభస జరిగేదే కాదు. మొత్తానికి చంద్రబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజునే ఇరు పార్టీల ఘర్షణ జరిగింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం చాలా సహజం. ఒకసారి ఘర్షణ జరిగిన తర్వాత.. దానికి కొనసాగింపు ఘర్షణల కోసం వారు ఉత్సాహపడుతుండడం కూడా సహజం.
ఇంతవరకు పోలీసులు సరిగ్గానే అంచనా వేశారు. కుప్పం పరిధిలోని పోలీసు బలగాలను మాత్రం నమ్ముకుంటే సాధ్యమయ్యే పని కాదని.. ఇతర ప్రాంతాలనుంచి కూడా పోలీసు అధికారుల్ని, బలగాల్ని రప్పించారు. అందరినీ మోహరించారు. టెక్నికల్ గా చెప్పుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ.. గురువారం నాడు ఘర్షణలు శృతిమించడానికి, పరస్పర దాడులకు, తెలుగుదేశం అన్న క్యాంటీన్ వద్ద విధ్వంసానికి వీటన్నింటికీ పోలీసులదే బాధ్యత.
తెలుగుదేశం వాళ్లు చేసిన దాడికి నిరసనగా వైసీపీ నాయకులు మరురోజు దీక్షలు చేయాలని అనుకున్నారు. చంద్రబాబునాయుడు మూడురోజుల పర్యటన ముందే ఖరారైపోయి ఉంది. ఆయన 10.30కు బయల్దేరి 10.45కు అన్న క్యాంటీన్ సందర్శనకు వెళ్లాలనేది షెడ్యూలు. 10.45 గంటలకే వైసీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసనలు తెలియజేసే దీక్షలకు పూనుకున్నారు. ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు దాదాపుగా ఒకే సమయానికి ఇరు పార్టీల కార్యక్రమాలు ఉండేలా.. అనుమతులివ్వడం పోలీసుల ప్రథమ తప్పిదం.
చంద్రబాబునాయుడు టూరు షెడ్యూలు ముందే ఖరారై ఉంటుంది. బుధవారం గొడవల తర్వాత మాత్రమే వైసీపీ నాయకులు నిరసన చెప్పదలచుకున్నారు గనుక.. వారి కార్యక్రమం కొత్తగా ఫిక్సయింది. కాబట్టి.. వైసీపీ వారికి వేరే సమయం ఇచ్చి ఉంటే.. ఈ ఘర్షణలు అసలు జరిగి ఉండేవేకాదేమో!
వైసీపీ కూడా ఈ విషయంలో శాంతి భద్రతల కోణం పట్టించుకోకుండా, ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా ప్లాన్ చేసుకుంది. బాబు కార్యక్రమం ఉదయం ఉన్న నేపథ్యంలో, సాయంత్రానికి వీళ్లు వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన ఆందోళన ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఊరు ప్రశాంతంగానే ఉండేది. ఆలోగా భారీగా జనసమీకరణ చేసి, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే.. ఆయన వెన్నులో వణుకు పుట్టేలా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా వీలయ్యేది. కానీ వాళ్లు కూడా శాంతి భద్రతలు స్థిరంగా ఉండాలని కోరుకోలేదు గనుకనే ఇదంతా జరిగింది.
పోలీసుల బలగాలకు కూడా రక్షణ కల్పించడం అనేది చాలా సులువు అయ్యేది. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటివద్ద, అన్న క్యాంటీన్ వద్ద కూడా భద్రత కల్పించారు. అన్న క్యాంటీన్ ను గాలికొదిలేశారన్నట్టుగా టీడీపీ ఆరోపించడం కరెక్టు కాదు. పోలీసులైతే రెండుచోట్ల ఉన్నారు. భరత్ ఇంటివైపు తెలుగుదేశం వాళ్లు దూసుకొస్తే సమర్థంగా అడ్డుకున్నారు. కానీ.. అన్న క్యాంటీన్ వద్ద వైసీపీ వాళ్లు విధ్వంసం చేస్తోంటే.. చేతులెత్తేశారు.
చంద్రబాబులోని రౌడీయిజం యాంగిల్ కూడా ఈ ఘర్షణలకు ఒక ప్రధాన కారణం. తాను అందరికంటె పెద్ద రౌడీనని నాలుగైదు రోజులుగా చెప్పుకుంటున్న చంద్రబాబు.. కుప్పంలోని పార్టీ శ్రేణులను తన మాటలతో పదే పదే రెచ్చగొట్టారు. రెండురోజుల్లో ఆయన ప్రజలతో మాట్లాడిన మాటలన్నీ గమనిస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ‘పోలీసులు లేకపోతే వైసీపీ వారందరి సంగతి రెండు నిమిషాల్లో తేలుస్తాం’ అనే మాటలు ఇంత అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి అసలు బుద్ధికి నిదర్శనం. ‘తేల్చడం’ అంటే ఆయన ఉద్దేశం అంటే ఏమిటి? వారిని చంపేయడమేనా? అనేది ప్రజల్లో ప్రశ్న. ఈ రకమైన చంపేస్తాం.. నరికేస్తాం.. లాంటి డైలాగులతో పార్టీ అధినేత సంకేతాలు పంపుతూ ఉంటే.. పార్టీ కార్యకర్తలు వాటిని ఎలా అర్థం చేసుకుంటారు? అందుకే ఘర్షణలు శృతిమించాయి.
అధికార పార్టీ వారిమీద లాఠీ ఎత్తడానికి వారికి భయమేసిందా? ఏమో తెలీదు. పోలీసులు ఎంతగా అధికారపార్టీకి కొమ్ము కాసినప్పటికీ.. (ఇందులో టీడీపీ మినహాయింపు ఏమాత్రం కాదు. ఎవరి జమానా వస్తే వాళ్లు పోలీసుల్ని పనివాళ్లలాగానే వాడుకుంటారు) కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే.. ఇరు పార్టీల కార్యక్రమాలకి మధ్య కనీసం రెండు గంటల తేడా ఉండేలా జాగ్రత్త తీసుకుని ఉంటే.. ఇంత కల్లోలం జరిగేది కాదు. పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నా సరే.. తాము విధులు నిర్వర్తించే చోట శాంతి భద్రతలు అదుపుతప్పాలని మాత్రం కోరుకోరు. కానీ వారు ప్లానింగ్ లేకుండా పోటీ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేయడం దీనికి కారణమైంది.
ప్రశాంతంగా ఉండే కుప్పం ప్రాంతం రణరంగం అయింది. రాజకీయ నాయకుల బాధ్యతను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారికి కావాల్సిందే రణరంగం. దానికోసమే వారు కుట్రలు చేస్తారు. కానీ.. ఇందులో పోలీసుల వైఫల్యం కూడా ఉండడం బాధాకరం.