కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రక్తతలకు దారి తీసింది. చంద్రబాబునాయుడు టీడీపీ అధినేతతో పాటు కుప్పం ఎమ్మెల్యే కూడా. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుండగా అడ్డుకోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పర్యటనలో గత రెండు రోజులుగా అశాంతి నెలకుందన్నది వాస్తవం. మొదటి రోజు గొడవలతోనే సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ రెండోరోజు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇందులో ఎవరి వాదన వారిది.
వైసీపీ శాంతియుత ర్యాలీ కాస్త అన్న క్యాంటీన్ వద్ద టీడీపీ ప్లెక్సీల చించివేత, ఆ పార్టీ కార్యకర్తపై దాడి, అలాగే సమీపంలోని టీడీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లే వరకూ వెళ్లింది. ఈ పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు. వైసీపీ చర్యల్ని నిరసిస్తూ ఆయన బైఠాయించారు. వైసీపీ విధ్వంసానికి తెగబడిందని పదేపదే చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రస్తావించడం గమనార్హం. అయితే కుప్పంలో ఏది విధ్వంసం? కనిపించని విధ్వంసం మాటేమిటి? ఇదే చంద్రబాబును రెండు నెలలకు ఒకసారి రప్పిస్తోంది.
అది టీడీపీని అంతమొందించే విధ్వంసం. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనేది వైసీపీ వ్యూహం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసులో మొలకెత్తిన ఆ ఆలోచన కుప్పంలో టీడీపీ వినాశనానికి దారి తీస్తోంది. ఇది టీడీపీ దృష్టిలో విధ్వంసం. వైసీపీ దృష్టిలో ప్రత్యర్థి పార్టీ పరాజయం. స్థానిక సంస్థల్లో ప్రధాన ప్రతిపక్షం ఘోర పరాజయం ఓ విధ్వంసమే. అయితే ఇది కంటికి కనిపించని విధ్వంసం. ఈ విధ్వంసం చంద్రబాబుకు నిద్ర కరువు చేసింది.
ఎందుకంటే కుప్పానికి స్వయంగా ఆయనే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అసలు కుప్పంలో ఎన్నిక ఏదైనా ఓటమి అనేదే ఉండదని చంద్రబాబు ఇంత కాలం నమ్ముతూ వచ్చారు. అయితే తన ప్రత్యర్థి వైఎస్ జగన్ ఎంతటి ప్రమాదకారో ఆయనకు తెలిసొచ్చింది. నిజానికి చంద్రబాబు కోపమంతా గత రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలపై కాదు. ఇది కేవలం సాకు మాత్రమే. టీడీపీకి కంచుకోటను రాజకీయంగా విధ్వంసం మొదలైందనేది ఆయన ఆవేదన, ఆక్రోశం. దాన్ని బయటకు చెప్పుకోలేక, మనసులో అణచుకోలేక చంద్రబాబు సతమతమవుతున్నారు.
వైసీపీ అనాలోచిత చర్యలు చంద్రబాబుకు ఆయుధాలవుతున్నాయి. వైసీపీని రౌడీ పార్టీగా నిలిపేందుకు చేజేతులా ఆ పార్టీ అవకాశం ఇస్తోందనే విమర్శలు లేకపోలేదు. కుప్పంలో టీడీపీని రాజకీయంగా విధ్వంసం చేయాలనే వ్యూహాన్ని అమలు చేసే క్రమంలో లక్ష్యం దెబ్బతింటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైసీపీ పెద్దలు ఆలోచించాలి.
అసలే చంద్రబాబు మహా నటుడు. చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థుల్ని బద్నాం చేయడానికి వెనుకాడరు. అలాంటిది బహిరంగంగా హల్‌చల్ సృష్టిస్తే ఇంకేమైనా వుంది. తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు లక్ష్యం వైపు గమనం సాగించడంపై వైసీపీ దృష్టి సారించాలి. అప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశ, ఆశయం నెరవేర్చినవారవుతారు.