వచ్చే ఎన్నికల పోరులో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పాల్గొనబోతోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా సార్లు ప్రకటించారు. మరి ఇప్పుడు సందేహం ఏమిటంటే.. కనీసం జనసేన గుర్తు అయినా వచ్చే ఎన్నికల్లో ఉండబోతోందా? అనేది! ఇప్పుడు తెలుగుదేశం సానుకూల మీడియా వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ ను ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీన్స్ చేస్తారట! అదెందుకంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన గుర్తు బరిలో లేకుండా! అంటే.. తెలుగుదేశం గుర్తు మీదే జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేస్తారట!
జనసేన కు అంటూ కొన్ని సీట్లను కేటాయిస్తారట, అక్కడ జనసేన అభ్యర్థులు టీడీపీ గుర్తు మీదే పోటీ చేస్తారట! మరి టీడీపీ గుర్తు మీద పోటీ చేసినప్పుడు వారు జనసైనికులు ఎలా అవుతారు? అని ఎవ్వరూ అడగొద్దు! చంద్రబాబు అనుకుంటే ఏమైనా జరుగుతుంది జనసేన విషయంలో!
ఈ విషయంలో పవన్ కల్యాణే స్వయంగా వివరణ ఇవ్వగలరు కూడా! ఎలాంటి పరిస్థితుల్లో తమ పార్టీ గుర్తు ఈవీఎంల మీద లేకుండా కేవలం సైకిల్ గుర్తు మీదే జనసేన కూడా పోటీ చేస్తోందో పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా వివరించగలరు కాబట్టి, ఆ ఎమోషన్ ను ఆయన పండించగలరు కాబట్టి.. జనసేన నుంచి అభ్యంతరాలు ఏమీ ఉండకపోవచ్చు!
ఇందుకు కావాలంటే కొన్ని ఉదాహరణలున్నాయి. గతంలో శరత్ కుమార్ ది తమిళనాట ఒక పార్టీ ఉండేది. ఆ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగిందొకసారి. అప్పుడు శరత్ కుమార్ పార్టీకి జయలలిత రెండు సీట్లను కేటాయించారు. అందులో ఒకటి శరత్ కుమార్ కు, ఇంకోటి మరొకరికి. అయితే ఆ ఎన్నికల్లో శరత్ కుమార్ పార్టీకి వేరే గుర్తు లేదు. అన్నాడీఎంకే రెండాకులు గుర్తు మీదే వారు పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో శరత్ కుమార్ తొలిసారి, చివరి సారి ఎమ్మెల్యేగా నెగ్గారు. అన్నాడీఎంకే రాష్ట్రమంతా స్వీప్ చేసిన ఆ ఎన్నికల్లో శరత్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఆయన పార్టీ ఎప్పుడూ ఊసు లోలేదు. ఆ తరహాలో తెలుగుదేశం గుర్తు మీద జనసేన పోటీ చేయొచ్చు! గాజు గ్లాస్ గుర్తు వల్ల గందరగోళం లేకుండా సైకిల్ గుర్తు మీదే జనసేన పోటీ చేసినా చేయొచ్చు. ఎలాగూ అజ్ఞాతవాసి వంటి సినిమాలో పవన్ స్వయంగా చెప్పారట తనకు సైకిల్ అంటే చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టమో!