ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడేళ్ళ కాలంలో ఎన్నో సార్లు విశాఖ వచ్చారు. ఆయన ఫ్లాష్ బ్యాక్ లో 2020లో విశాఖ వస్తే అపూర్వమైన స్వాగతం లభించింది. విశాఖ ప్రగతి కొరకు పాటుపడే సీఎం సార్ థాంక్ యూ అంటూ నాడు విశాఖలో రోడ్డుకు రెండు వైపులా నిలబడి జనాలు జేజేలు పలికారు.
అదే అద్భుతం అనుకుంటే ఈసారి మరింతగా కొత్తగా జగన్ కోసం విశాఖ ముస్తాబు అవుతోంది. ఈ నెల 26న విశాఖకు జగన్ వస్తున్నారు. విశాఖ టూ భీమిలీ దాకా ఉన్న పాతిక కిలోమీటర్ల సాగర తీరాన్ని క్లీన్ చేసే అతి పెద్ద కార్యక్రమంలో ఆయన పాలు పంచుకుంటారు.
అలాగే ఏయూలో జరిగే మరో కార్యక్రమంలో పాల్గొని ఒకేసారి ఎనిమిది వేల మందికి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తారు. ఇక బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం కోసం విశాఖ వస్తున్న జగన్ కోసం బ్రహ్మాండమైన స్వాగతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలోని ఏయూ నుంచి ఎయిర్ పోర్టు దాకా ఉన్న పది కిలోమీటర్ల దూరాన రోడ్డుకు రెండు వైపుల జగన్ కటౌట్లు, వైసీపీ జెండాలతో మొత్తం నింపేశారు.
జగన్ రాక సందర్భంగా పార్టీ శ్రేణులతో పాటు అధికారులు ఘనస్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈసారి తన కోసం కొత్తగా ముస్తాబైన విశాఖను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మురిసిపోవడం ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.