కొంతమంది రివ్యూ రైటర్లు యథారీతిన 'కబీర్ సింగ్' మీద విరుచుకుపడ్డారు. హీరో ఆటిట్యూడ్ బాగా లేదంటూ సినిమాకు నెగిటివ్ రేటింగులు ఇచ్చారు ఆ రివ్యూయర్లు. వారికి నచ్చకపోతే నచ్చకపోయాడు కానీ ప్రేక్షకులను మాత్రం హిందీ అర్జున్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. షాహిద్ కపూర్ సినిమాల్లోనే బెస్ట్ కలెక్షన్స్ దిశగా పరుగులు తీస్తూ ఉంది 'కబీర్ సింగ్'.
తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 70 కోట్లరూపాయల పై స్థాయి వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. నాన్ హాలిడేలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా శుక్రవారం నుంచి మంచి వసూళ్లను పొందుతూ ఉందని తరణ్ పేర్కొన్నాడు.
తొలి రోజు ఈ సినిమా ఇరవై కోట్ల రూపాయలను, రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలను, మూడో రోజు ఆదివారం దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు. ఇలా స్థూలంగా డెబ్బై కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను 'కబీర్ సింగ్' సాధించిందని తరణ్ ఆదర్శ్ విశ్లేషించాడు.
ఇవన్నీ దేశీయంగా వచ్చిన వసూళ్లు మాత్రమే అని ఈ ట్రేడ్ ఎనలిస్ట్ వివరించాడు. మొత్తానికి తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' హిందీలోనూ అలాంటి స్థాయి ఫలితాన్నే నమోదు చేసేలా ఉంది.