దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూలాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్రలో, విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయడం ఈ పార్టీ వల్ల కాలేదు. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్ పై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన వేళ, ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో తన మూలాల్ని విస్తరించాలని కసిగా ఉంది.
2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని స్థానాలు సంపాదించగలిగింది బీజేపీ. అది దాని బలం కాదనే విషయం తాజా ఎన్నికలతో నిరూపితమైంది. పైగా ఈసారి బీజేపీకి పడిన ఓట్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. అందుకే ఈసారి ఏ పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా విస్తరించాలని భావిస్తున్నారు కమలనాధులు. దీని కోసం వాళ్లొక తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అదే కులం కార్డు.
అవును.. రాష్ట్రంలో కులం కుంపట్లు రాజేసి కులాల వారీగా గ్రూపుల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది కమలం పార్టీ. ఇందులో భాగంగా ఇప్పటికే కాపు నాయకులతో సమావేశమైన కమలనాథులు.. భారీ ఎత్తున కాపునేతల్ని తమ పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలవారీగా కాపులు సమావేశమవుతున్నారు. బీజేపీకి మద్దతుగా తీర్మానాలు చేస్తున్నారు.
ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు కూడా ఇదే విధంగా రహస్యంగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. తమ సమావేశాల్ని మీడియాకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇలా కులాలవారీగా గ్రూపులు ప్రోత్సహించి, పార్టీలో చేర్చుకోవాలని ఎత్తుగడ వేశారు కమలనాథులు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ లో అనాదిగా కులరాజకీయం నడుస్తూ ఉంది. ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి కొమ్ముకాస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి బలమైన సామాజిక వర్గాలతో పాటు.. తటస్థంగా ఉన్న ఇతర కులాల్ని కూడా తమలో కలిపేసుకోవాలని నిర్ణయించింది బీజేపీ. ఓవైపు ఇతర పార్టీల నుంచి నాయకుల్ని తన పార్టీలోకి ఆహ్వానిస్తూనే, మరోవైపు ఇలా కులాలవారీగా సమీకరణలు చేపట్టింది.
టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే పెద్దఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఈ చేరికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కులాలవారీగా చేరికలు షురూ కాబోతున్నాయి. ఆ తర్వాత ప్రతి కులానికి, ఓ నాయకుడ్ని ఏర్పాటుచేసేలా ప్రణాళిక రచించారు. తమకు అవసరం లేకపోయినా రావెల కిషోర్ బాబు, కేశినేని నాని, రఘువీరారెడ్డి, ఆకుల సత్యనారాయణ లాంటి నేతలతో బీజేపీ టచ్ లోకి వెళ్లడానికి ఇదే కారణం.