ఎక్కడ ఏ చిన్న తప్పుజరిగినా.. ఆ నిందితుడు ఎవరు, ఏంటి అని ఆరా తీయడంతోపాటు, ఏ పార్టీకి చెందినవాడు అనే ప్రశ్న కొత్తగా వచ్చి చేరుతోంది. ఇక్కడ నుంచి పార్టీల మధ్య రచ్చ మొదలవుతుంది. సోషల్ మీడియా వేదికగా ఈ గోల మరోసారి మొదలైంది. ఒంగోలులో బాలికపై అత్యాచారం చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఓ దివ్యాంగుడు వైసీపీ కార్యకర్త అని టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. వైసీపీ కండువాలు కప్పుకుని ఉన్న అతని ఫొటోలు పోస్ట్ చేస్తూ పార్టీని టార్గెట్ చేసింది.
ఈమధ్య కాలంలో ఇదో వింత విష సంస్కృతిగా మారుతోంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పార్టీని మధ్యలోకి లాగేస్తున్నారు. అంతెందుకు జగన్ పై దాడి జరిగిన గంటల వ్యవధిలోనే.. దాడికి పాల్పడ్డ వ్యక్తి జగన్ అభిమాని అని, జగన్ తో ఉన్న ఓ పోస్టర్ ని అప్పటికప్పుడు డిజైన్ చేసి మరీ సోషల్ మీడియాలో వదిలారు. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా ఏం తక్కువ తినలేదు. దాడి కేసు నిందితుడితో లోకేష్, చంద్రబాబు కలిసి ఉన్నట్టు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా యుద్ధానికి దిగారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో వందలకొద్దీ జరిగాయి. దీంతో అసలు తప్పు పక్కకు పోయి, పార్టీ తప్పు ప్రముఖంగా కనిపిస్తోంది.
తప్పులు జరిగినప్పుడు వెంటనే తప్పు చేసిన వాడు ఏ పార్టీ అనే ప్రశ్న మొదటగా వస్తోంది. పోలీస్ విచారణపై ఇలాంటి దుష్ప్రచారాల ప్రభావం ఉంటుందా లేదా అనే విషయం కూడా చర్చకు వస్తోంది. పార్టీల సపోర్ట్ తో ఎవరూ తప్పుడు పనులు చేయరు. అసలు ఏ పార్టీ కూడా ఇలాంటి తప్పుడు పనులను ప్రోత్సహించదు. వారి వారి నేపథ్యాలను బట్టే మంచిపనులు, చెడ్డ పనులు చేస్తుంటారు వ్యక్తులు. అలాంటి వారిపై పార్టీ ముద్రవేసి కేసుల్ని తప్పుదోవ పట్టిస్తోంది సోషల్ మీడియా.
తాజాగా ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో జరుగుతోంది కూడా ఇదే. నిందితుడు వైసీపీవాడంటూ టీడీపీ సోషల్ మీడియా వార్ స్టార్ట్ చేసింది. దీనికి ప్రతిగా వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రతిదాడికి దిగుతోంది. గతంలో చంద్రబాబుతో పలువురు నిందితులు కలిసి దిగిన ఫొటోలని పోస్ట్ చేస్తోంది. అంతెందుకు.. కేసుల నేపథ్యంలో ఇటీవలే పార్టీ మారిన నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా నిన్న మొన్నటి వరకూ టీడీపీలోనే ఉన్నారు కదా. దానికి దీనికి తేడా ఏంటి? అసలు నేరాలతో నేరస్థులకు సంబంధం ఉంటుంది కానీ పార్టీలకు ఎందుకు ఉంటుంది? ఇకనైనా ఇలాంటి విష సంస్కృతికి అడ్డుకట్ట పడితే బాగుంటుంది. లేకపోతే.. రేపు పార్టీల పేరు చెప్పుకుని నేరాలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.