సెప్టెంబర్ బాక్సాఫీస్.. ప్రతి సినిమాకు వారమే ఛాన్స్

ఆగస్ట్ లో చిన్న సినిమాలొచ్చాయి, భోళాశంకర్ లాంటి పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. కానీ సెప్టెంబర్ లో మాత్రం పోటీ మామూలుగా లేదు. వారానికో ప్రామిసింగ్ మూవీ వస్తోంది. ప్రతి సినిమాపై అంచనాలున్నాయి. దేన్నీ…

ఆగస్ట్ లో చిన్న సినిమాలొచ్చాయి, భోళాశంకర్ లాంటి పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. కానీ సెప్టెంబర్ లో మాత్రం పోటీ మామూలుగా లేదు. వారానికో ప్రామిసింగ్ మూవీ వస్తోంది. ప్రతి సినిమాపై అంచనాలున్నాయి. దేన్నీ తక్కువ చేయడానికి లేదు.

సెప్టెంబర్ 1న ఖుషి సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ఇది. ఇప్పటికే పాటలు పెద్ద హిట్. ట్రయిలర్ కూడా క్లిక్ అయింది. శివ నిర్వాణ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎంత పద్ధతిగా షూటింగ్ పూర్తి చేశారో, అంతే పద్ధతిగా పాన్ ఇండియా లెవెల్లో ప్రచారం కూడా చేస్తున్నారు.

ఖుషి వచ్చిన వారం రోజులకే, అంటే సెప్టెంబర్ 7వ తేదీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వచ్చే అవకాశం ఉంది. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 7కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న మూవీ కావడం, నవీన్ పొలిశెట్టిపై కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఆ తర్వాత వారం స్కంద సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో రామ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే రామ్ కంటే ముందు ఇది బోయపాటి సినిమాగా గుర్తింపు పొందింది. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న మూవీ ఇది. పైగా శ్రీలీల లాంటి హీరోయిన్ ఉండనే ఉంది. అందుకే ఈ మూవీపై ట్రేడ్ లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.

ఇక సెప్టెంబర్ బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు సలార్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఎందుకంటే, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను డైరక్ట్ చేశాడు కాబట్టి. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రల్లో జగపతిబాబు, పృధ్వీరాజ్ కనిపించనున్నారు.

ఇలా సెప్టెంబర్ లో వారానికో పెద్ద సినిమా వస్తోంది. ప్రతి సినిమాపై అంచనాలున్నాయి. వీటితో పాటు.. మార్క్ ఆంటోనీ (విశాల్), జవాన్ (షారూక్ ఖాన్), చంద్రముఖి 2 (లారెన్స్) సినిమాలు కూడా సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉంది.