చంద్రబాబు వ్యూహాలే పాశాలా-టీడీపీ సంక్షోభం

'చరిత్ర పునరావృతమవుతుందని ఒకనానుడి. సరిగ్గా ఇరవైనాలుగు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని ఆనాటి అధినేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ.రామారావు ఎలాంటి సంక్షోభానికి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గురిచేశారో, ఇప్పుడు అదే సంక్షోభాన్ని చంద్రబాబు…

'చరిత్ర పునరావృతమవుతుందని ఒకనానుడి. సరిగ్గా ఇరవైనాలుగు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని ఆనాటి అధినేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ.రామారావు ఎలాంటి సంక్షోభానికి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గురిచేశారో, ఇప్పుడు అదే సంక్షోభాన్ని చంద్రబాబు ఎదుర్కుంటున్నారనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ చీలిక దిశగా పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజ్యసభలో నలుగురు ఎంపీలు విడిపోయి ఒక టీమ్‌ అయ్యారు. ఆ వెంటనే వారంతా బీజేపీలో విలీనం చేయమని లేఖ అందించారు. ఇలాచేసిన నలుగురు చంద్రబాబుకు సన్నిహితులే కావడం గమనించవలసిన అంశమే. ఆయనే వాళ్లను బీజేపీలోకి పంపుతున్నారేమోన్ని కొందరికి అనుమానం ఉన్నప్పటికీ, అదంతా సంక్షోభానికి సూచనలే అవుతాయి.

చంద్రబాబు విదేశీటూర్‌కు వెళ్లిన సమయంలో జరుగుతున్న పరిణామాలు ఆయన జీర్ణించుకోలేనివే. ఒక్కసారి గతానికి వెళితే 1995లో తనమామ ఎన్‌టీఆర్‌ నుంచి పార్టీని ఆయన అల్లుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను అధిక సంఖ్యలో పోగుచేసి బసంత్‌ టాకీస్‌లో సమావేశం నిర్వహించారు. తమ పక్షంలోనే అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నందున తమదే అసలైన టీడీపీ అని తీర్మానించారు. ఆ మేరకు గవర్నర్‌కు, స్పీకర్‌కు తీర్మానం కాపీలు కూడా అందచేశారు. అప్పట్లో టీడీపీని స్థాపించిన ఎన్‌టీ.రామారావు నిస్సహాయంగా మిగిలిపోయారు. తాను గెలిపించిన ఎమ్మెల్యేలే, ఎంపీలే ఇలా తనను దిక్కరించి వెళ్లిపోయారా అన్న ఆవేదన ఆయన కలిగింది. అది కూడా స్వయంగా తన అల్లుళ్లు, కుమారులు కలిసి ఈ కుట్ర చేశారా అన్న దిగులుతో ఆయన కుమిలిపోయారు.

మాససిక వేదనకు గురిచేసింది. 1994లో ఎన్‌టీఆర్‌ తన రెండోభార్య లక్ష్మీపార్వతిని వెంట తీసుకుని ప్రజలలోకి వెళితే ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ఆదరణ చూపారు. దాని ఫలితంగా 225 సీట్లు ఆనాటి ఉమ్మడి ఏపీలో టీడీపీకి వచ్చాయి. కాని చివరికి పార్టీనే ఆయనది కాకుండాపోయింది. కొత్త పార్టీ పెట్టుకుందామనుకుని అనుకుసేసరికి ఆయన గుండెపోటుకు గురై మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వానికి పార్టీలో పెద్దగా ఇబ్బందిరాలేదు. కాని ఆయన ప్రత్యర్థులు కాని, పార్టీని వీడినవారు కాని, చంద్రబాబును ఉద్ధేశించి వెన్నుపోటుదారుడు అని ప్రచారం చేస్తుంటారు. దానికి తగ్గట్లుగా ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత విడుదల చేసిన ఒక వీడియో ఇప్పటికే సంచలనమే. అందులో ఆయన చంద్రబాబును జామాత దశమగ్రహం అంటూ తీవ్రంగా విమర్శలు కాదు.. దూషించారు. అవన్ని చంద్రబాబును ఎప్పటికి వెంటాడుతూనే ఉంటాయి. అయినా ఇంతకాలం నెట్టుకు రాగలిగారు.

కాని గత ఐదేళ్లపాలన వైఫల్యాలు అనండి, దారుణమైన తప్పిదాలు అనండి, పుత్రవాత్సల్యం అనండి.. అనేక కారణాల వల్ల టీడీపీ ఘోర ఓటమికి గురైంది. టీడీపీ ఓటమిని పసికట్టడంలో ఆయన వైఫల్యం చెందారు. పైగా ప్రధాని మోడీని, బీజేపీని తీవ్ర పదజాలంతో దూషించారు. అంతకుముందు నాలుగేళ్లు కలిసి ఉన్నా, విడిపోయిన తర్వాత చంద్రబాబు అలా తిట్టడాన్ని ప్రజలు కూడా సమర్థించలేకపోయారు. అలాగే విపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని విశ్యయత్నం చేసినా 23మంది మాత్రమే అమ్ముడుపోయారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత జగన్‌తో ఉండడంతో ఆయన తన పోరాటానికి నిరాటంకంగా కొనసాగించారు. ప్రజలలో నిత్యం సంచరించి పాదయాత్ర ద్వారా ఆదరణ చూరగొని ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా అసాధారణ రీతిలో 151 మంది ఎమ్మెల్యేలతో ఆయన అధికారంలోకి రావడంతో టీడీపీ నిర్ఘాంతపోవలసి వచ్చింది. ఇప్పుడు అసలు ఆట ఆరంభం అయింది.

ప్రధానిమోడీ, బీజేపీ అధినేత అమిత్‌ షా సినిమా చూపిస్తున్నట్లుగా ఉంది. అందులో భాగంగా రాజ్యసభలో ఉన్న టీడీపీ ఎంపీలు నలుగురు సుజనా చౌదరి, సీఎం.రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, టీజీ.వెంకటేష్‌లు పార్టీకి గుడ్‌బై చెప్పి తమదే సొంత గ్రూపు ఏర్పాటు చేసుకుని బీజేపీలో విలీనం అయిపోయారు. అంటే సరిగ్గా ఇరవై నాలుగేళ్ల క్రితం చంద్రబాబు ఏ గేమ్‌ అయితే ఆడారో అదే గేమ్‌ను ఇప్పుడు ఆయన సహచరులు ఆడి పార్టీని చీల్చుతున్నారన్నమాట. నిజానికి సుజనా చౌదరి, రమేష్‌, మోహన్‌ రావులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ఆర్థిక వ్యవహారాలన్ని వారే చూస్తుంటారు. అలాంటి వారే ఇప్పుడు పార్టీకి భవిష్యత్తు లేదని, కేసులు ఎక్కడ మెడకు చుట్టుకుంటాయోనని భయపడి బీజేపీలోకి వెళుతున్నారన్న అభిప్రాయం అయింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంగ్రెస్‌ ఎంఎల్యేలను విలీనం చేసుకుంటే, ఇక్కడ బీజేపీ నేతలు టీడీపీ ఎంపీలను కలుపుకున్నారు. ఇది సరైనదా? కాదా అన్న చర్చ ఉంది. ఇది ఏమాత్రం నైతికంగా సరికాదు. గతంలో ఇదే సుజనా, సీఎం.రమేష్‌లపై అనేక ఆరోపణలు చేస్తూ వారిని అనర్హులను చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. సుజనా చౌదరిపై ఎన్నో ఆర్థిక నేరారోపణలు వస్తే, ఆయనను ఎలా పార్టీలో చేర్చుకుంటారన్న ప్రశ్న ఉన్నా, వర్తమాన రాజకీయాలు అలా తయారయ్యాయి. రమేష్‌ కాంట్రాక్టర్‌గా అనేక పనులలో పెద్దఎత్తున అక్రంగా లబ్ధిపొందారని ఆరోపణలు వచ్చాయి. అవన్ని జగన్‌ వెలుగులోకి తీసే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో వీరు బీజేపీని షెల్టర్‌ జోన్‌గా వాడుకుంటున్నారనుకోవాలి.

గరికపాటి తన సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెళుతున్నారని చెప్పవచ్చు. ఇక టీజీ వెంకటేష్‌ రాజ్యసభ సభ్యుడు అవడానికి భారీగానే ఖర్చు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందువల్ల ఆయనకు పెద్దగా కమిట్‌మెంట్‌ ఉండదనుకోవచ్చు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన టీడీపీలోకి వచ్చి రాజ్యసభ సభ్యుడయ్యారు. మరోవైపు కాపు వర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అంటే ఓడిపోయిన ప్రముఖులంతా కలిసి సమావేశం అవడం కూడా గమనించదగ్గ పరిణామమే. కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా భవిష్యత్తులో ఏపీలో చక్రంతిప్పాలని బీజేపీ భావిస్తున్నదని చెబుతున్నారు. రాజకీయాలలో పార్టీలు మారడానికి సిద్థాంతాలు, విలువలతో పనిలేదు. చేరేవాడు ఒకందుకు చేరతాడు. చేర్చుకునేవాడు మరొకందుకు చేర్చుకుంటాడు. అది వేరే విషయం.

ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటన్నది పెద్ద చర్చ అవుతోంది. ఎంపీలలో మొదలైన ముసలం టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా పాకితే అది పార్టీ మూలాలకే దెబ్బతగిలే అవకాశం ఉంటుంది. పార్టీని ఇప్పుడు కింద నుంచి నిర్మించే వయసు కూడా చంద్రబాబుది కాదు. పోని ప్రజలలోకి వెళ్లి తిరిగి ఆదరణ పొందాలంటే ఆయన చెసిన అనేక తప్పులు ఆయనను వెన్నాడుతుంటాయి. మరోవైపు జగన్‌ రోజురోజుకు బలపడేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం స్థానాన్ని ఆక్రమించాలన్న తహతహలో బీజేపీ ఉంది. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా, ముందుగా తెలుగుదేశం భవిష్యత్తును దెబ్బతీయడం వరకు బీజేపీ సఫలం కావచ్చనిపిస్తుంది. మొత్తంమీద చంద్రబాబుకు తన వ్యూహాలే తనకు పాశాలుగా మారుతున్నాయని అనుకోవచ్చా?
-కొమ్మినేని శ్రీనివాసరావు

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే