ఏపీ సర్కార్‌లో ఆణిముత్యం’ స్పీకర్‌ తమ్మినేని’

కొత్తసర్కారు 151సంఖ్యాబలంతో కొలువుతీరింది. ఈవిఎమ్‌లు, వివి.ప్యాట్‌లు, మోదీ, జగన్‌, కేసీఆర్‌లు నా గెలుపుపై, నా ఓటమికోసం ఎన్నెన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఖాయం. ఈసారి 130స్థానాలకు తగ్గదని ఏకధాటిగా మండలదినాలు (40రోజులు) దేశమంతా…

కొత్తసర్కారు 151సంఖ్యాబలంతో కొలువుతీరింది. ఈవిఎమ్‌లు, వివి.ప్యాట్‌లు, మోదీ, జగన్‌, కేసీఆర్‌లు నా గెలుపుపై, నా ఓటమికోసం ఎన్నెన్ని కుట్రలు చేసినా నా గెలుపు ఖాయం. ఈసారి 130స్థానాలకు తగ్గదని ఏకధాటిగా మండలదినాలు (40రోజులు) దేశమంతా గలాయించిన చంద్రన్న కేవలం 23స్థానాలతో ప్రతిపక్షంలో బిక్కుబిక్కు మనాల్సి వచ్చింది. 15ఏళ్లు ఏలుబడిలో తన సామాజిక కులానికి పెద్దపీటవేస్తూ మంత్రివర్గంలో కమ్మదనాన్ని నింపేసారు. జగన్‌ మంత్రివర్గంలో తనలానే కులపిచ్చికి పెద్దపీట వేస్తారనుకున్నారు. రెడ్లతో నింపుతారనుకున్నారు. కానీ, జగన్‌ 13జిల్లాల్లో చేసిన పాదయాత్రలో అన్నివర్గాలతో మమేకం అయ్యారు. వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు కనుక అన్ని వర్గాలకు పెద్దపీటలు వేస్తూ తన మంత్రివర్గం ఏర్పాటు చేసేసరికి ఒక్కసారి యావత్‌ రాష్ట్రమే ఉలిక్కిపడింది. రాజకీయాలపై అవగాహన ఉన్న లక్షలాది మంది ఔరా! ఏమీ జగన్‌ తీరు ఇలా ఉంది? అని నోళ్లు వెళ్లబెట్టారు.నీరసిల్లిన ప్రతిపక్షం ఏమిజరుగుతోంది? అన్నట్లు  అధికారపక్షం వైపు గుడ్లప్పగించి చూసింది. పదేళ్లపాటు వైకాపాలో ఆటుపోట్లు తిన్నవారు ఒకరా? ఇద్దరా? అనేకానేక మంది నేతలకు మంత్రివర్గంలో స్థానం ఈయకుండా మొండిచేయిని జగన్‌ అల్లల్లాడించడం నభూతోనభవిష్యతి అని గుసగుసలాడుకున్నారు.

చంద్రబాబు అండ్‌కో గెలిచినోళ్లు ఓడినోళ్లు అంతా గుమిగూడి ఏమిటీ జగన్‌ సాహసం అని చర్చలు జరిపారు. వైకాపా మంత్రివర్గంలో వీళ్లు గ్యారెంటీ అని సోషల్‌ మీడియాలో ఎన్నెన్నో పేర్లు వినవచ్చాయి? వారెవ్వరికి ఇవ్వకుండా కొత్తముఖాలను మంత్రులుగా తెరమీదకు తెచ్చారు. అదీ, రెండున్నర ఏళ్లు ఈపదవులు కొనసాగింపు. ఆపైన వేరేవారు ఆయా స్థానాల్లో వస్తారని ముఖం మీదే చెప్పడం, అవినీతికి పాల్పడినట్లు రూఢి అయితే, ఎంతటి వారినైన మంత్రి పదవుల్లోంచి పీకేస్తానని ప్రకటించారు. తినమరిగిన టీడీపీత నేతలకు జీర్ణించుకోలేనివిగా, అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించాయి. వైకాపాలో పాతకాపులకు మంత్రివర్గంలో స్థానాలు లభించలేదు. ఇక స్పీకర్‌ పదవికి రోజా, ధర్మాన, రుణాకర్‌రెడ్డి, ఇలాంటి పేర్లు సోషల్‌ మీడియాలో అదిగదిగో వచ్చేస్తున్నారనే కథనాలు వెలువడడంతో టీడీపీకి నిద్రలేకుండా చేసాయి. సోషల్‌ మీడియాల్లో కాబోయే స్పీకర్‌ పేర్లు వెల్లువెత్తాయి. వీళ్లెవరైన టీడీపీ వాణిని విన్పించకుండా నోరువిప్పితే మైక్‌లు కట్‌ అనేది జరిగిపోతుంది. గతాన్ని, గత సర్కారు నిర్వాకాన్ని గుర్తుచేసుకుని మరీ మాట్లాడనీయరు. కూర్చోబెట్టి చేసిన దోపిడీపై వేస్తున్న విచారణ కమిటీలు గురించి వినిపిస్తారని బాబు అండ్‌కో భీతిళ్లారు. అయితే, ఇక్కడకూడా ఎవరూ ఊహించని విధంగా మాజీమంత్రి, టీడీపీ మాజీనేత, ప్రస్తుత వైకాపానేత తమ్మినేని సీతారామ్‌ పేరు జగన్‌ నోటి నుంచి వెలువడింది.

ఒక్కసారి టీడీపీలో పిడుగుపడ్డట్లు అయ్యింది. అందుకు కారణాలున్నాయి. తమ్మినేని మైక్‌పట్టుకుంటే అనర్ఘళంగా ఏకధాటిగా పిడుగులు కురిపించేలా ప్రసంగించగల మహాదిట్ట. పలుమార్లు అప్పటి సీఎం చంద్రబాబు బహిరంగ సభల్లో ఏమయ్యా సీతారామ్‌ నీ వాక్పటిమను ఈసభకు హాజరైన మన వారికి విన్పించు. చివరాఖరిలో నేను మాట్టాడుతానని చెప్పి పురమాయించేవారు. తమ్మినేని ఏపార్టీలో ఉంటే ఆ పార్టీలో అంకిత భావంతో ఉంటారనేది అందరికి తెలుసు. తెలుగుదేశం తమ్మినేనిని ఎన్‌టీఆర్‌ నుంచి గుర్తించినా సరైన గుర్తింపునీయలేదు. ప్రభుత్వవిప్‌, చిన్నశాఖల మంత్రిని చేసారు. కారణం ఆయన వాగ్ధాటి అలాంటిది. ఇలాంటివారిని పెద్దగా ఎదగ నీయరాదనేది టీడీపీలో ఉండేదని ఆపార్టీ నేతల్లో  విన్పించేది. అందుకు శ్రీకాకుళం జిల్లా నేతలు కూడా  టీడీపీి అధిష్టానం చెవుల్లో ఉన్నవీ లేనివి నూరిపోసేవారు. తమ్మినేని వివాదస్పదుడు కారు. ముఠాలుకట్టరు. తన జిల్లాలో పార్టీ ఎంఎల్‌ఏలను తనవెంట తిప్పుకునేదే లేదు. ఉన్నంతలో సింహతేజంతో పార్టీకి విధేయుడుగా సాగారే తప్ప జిల్లాలో అన్నింటా వేలుపెట్టని నేతగా తమ్మినేనికి  పేరుంది. వీటన్నిటికి మించిపోయి ఏపార్టీలో ఉంటే ఆపార్టీకి అంకితభావంతో ఉంటారనేది నేడు వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీకి కొరుకుడు పడని విధంగా ఉంది.

స్పీకర్‌ ఎన్నికయ్యాక తమ్మినేనిని స్పీకర్‌స్థానంలో ఆశీనులను చేయడానికి సీఎం, ప్రతిపక్షనేత కలిసి చేయాల్సిన కార్యక్రమాన్ని బాబు డుమ్మాకొట్టారు. తను కదలకుండా అచ్చెన్నాయుడుని పంపారు. అక్కడ బాబు తీరులో మరోకోణం దాగి ఉంది. అప్పట్లో టీడీపీలో తమ్మినేని విధేయుడుగా ఉండేవారు. అనవసర విషయాల్లో ఉండేవారు కాదు. ఏదైనా పదవి ఇస్తే అదో అమృత భాండంగా పుచ్చుకునేవారు. నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కొర్రీలు వేసేవారు కాదు. అలిగి అటకెక్కేవారు కాదు. పార్టీలోంచి వెళ్లిపోయినప్పుడు వందో, నూటెనిమిది ప్రశ్నలో సంధించి, కారణాలు నివేదించి పార్టీ గుమ్మం దిగిపోయేరు. పైగా, తమ్మినేని స్వంత బామ్మర్ధి మరియు మేనల్లుడిని తమ్మినేని స్థానంలో భర్తీచేసి తమ్మినేని కుటుంబంలో ఆరనిచిచ్చు రగిల్చింది బాబే. ఇవన్నీ చేసిన నిర్వాకాల బాబుకు ముఖం చెల్లుబాటు కాలేదు. అందుకే తమ్మినేని స్పీకర్‌ కావడం ఒకశాతం కూడా ఇష్టంలేదు. కానీ, తనమాట జగన్‌ సర్కారులో చెల్లుబాటు కాదు. కొత్తసర్కారులో జీవచ్ఛవంలా సాగాలి తప్పదు. రాజకీయాలన్నాక ఇలాంటి ఆటుపోట్లుంటాయి. లోగడ పదేళ్లు ప్రతిపక్షం అంటే ఏమిటో అవగతమైంది. కానీ, ఈసారి జగన్‌ అండ్‌కోని ఫేస్‌ చేయడం కష్టమే. ఏమైతే అదే అయ్యిందని స్పీకర్‌ విషయంలో తనసీటులో కదలకుండా బాబు బిగదీసుకున్నారు.

ఇవేవి పట్టించుకోకుండా స్పీకర్‌ స్థానంలో ఒదిగి కూర్చున్నారు తమ్మినేని సీతారామ్‌. అయితే, ఆయన్ని అభినందిస్తున్నప్పుడు సీఎం జగన్‌ మాటల్లో తమ్మినేనిపై తన అభిప్రాయం వెల్లడించారు. ఆదేవుని దయతో ఓమంచి అనుభవజ్ఞుడైన వ్యక్తి మాకు స్పీకర్‌గా లభించారని చెప్పడంతో బాబు అండ్‌ కోకి నొసలు నొక్కుకునే  పరిస్థితి ఏర్పడింది. ఆపైన స్పీకర్‌గా మీ పరిధిలో సభను నడపండి. ఎవరినీ ఉపేక్షించొద్దు. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వారిపై మీకున్న విశేషాధికారాలతో అనర్హత వేటు వేయండి. మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను అనేమాటలు ములుకుల్లా, తుపాకి తూటాల్లా టీడీపీకే తగిలాయి. ముఖ్యంగా చంద్రబాబు మరియు అచ్చెన్నాయుడులకు తడబాటు కలిగించింది. ఇక అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మా శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు స్పీకర్లయ్యారు. అందులో తమ్మినేని స్పీకర్‌ కావడం మాకెంతో అనందంగా ఉందని గుండెలోతుల్లోంచి కాకుండా తప్పదన్నట్లు చెప్పారు. ఇక్కడ మరోవాస్తవం దాగి ఉంది. తమ్మినేని ఆనాడు టీడీపీలో అంకితభావంతో ఉంటూ కూడా ఆపార్టీలో పెద్దపీట వేయించుకోలేకపోవడానికి కారణం కింజరాపు సోదరులే.

దివంగత ఎర్రన్నాయుడు జిల్లాలో మూడోస్థానంలో తన సామాజిక కులం ఉన్నా అక్కడ ఎంపీగా గెలుస్తూ, ఢిల్లీ రాజకీయాలు చేసారు. ఆపైన కేంద్రంమంత్రి కావడం, సాక్షాత్తు  అప్పటి ప్రధాని వాజ్‌పాయ్‌తో పొత్తుమాటున తనపనులు చేయించు కోవడంలో ఢిల్లీ రాజకీయ రుచిమరిగారు. అయితే జిల్లాలో కులసముద్రమైన కాళింగకులనేత తమ్మినేనిని ఈసారి ఎంపీగా ఢిల్లీ పంపాల్సిందేనని చంద్రబాబు ఎన్నికలప్పుడు అంటుంటే ఎర్రన్నాయుడు తనకు పెద్దఅడ్డంకి తమ్మినేనే అని డిసైడ్‌ అయ్యారు. అక్కణ్నించి ఎర్రన్నాయుడు తమ్మినేని గురించి బాబుకు నూరిపోసేవారు. చెప్పుడు మాటలు వినడంలో చంద్రన్న ముందు వరుసలో ఉన్నందున తమ్మినేని పార్టీలో తులం బరువయ్యారు. పార్టీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి తమ్మినేనికి ఏర్పడింది. అందుకే అచ్చెన్నాయుడు స్పీకర్‌గా తమ్మినేని చూడడంలో ఒకింత తడబాటుకు కారణమయ్యింది. వాస్తవానికి తమ్మినేని ఎవరిని దీర్ఘకాల శత్రువుగా చూడరు. ఆయన వివాదస్పదుడు కానే కారు. ఆయనలో భోళావ్యక్తిత్వం ఉంది.

రాజకీయాల్లో శత్రుత్వం కలకాలం ఉండదని రాజకీయ నేతలు చెబుతుంటారు. దానికి ప్రతిరూపమే నేటి స్పీకర్‌ తమ్మినేని సీతారామే. ఇక, స్పీకర్‌ అభినందిస్తూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. తమ్మినేనిని బాగా ఎరుగుదును. అనర్ఘళంగా గంటో రెండుగంటలో ఏకధాటిగా పిడుగులు కురిపించేలా ప్రసంగించడంలో దిట్ట. అలాంటి వక్తను తిన్నగా తీసుకుపోయి అట్టే మాట్లాడనక్కర్లేదన్నట్లు స్పీకర్‌ను చేసి కూర్చోబెట్టేసారని చెప్పినతీరు బాబు అండ్‌కోని గుటకలు మింగించింది. సభికులను సంభ్రమంలో మునిగితేల్చింది.

జగన్‌ మంత్రివర్గంను ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. స్పీకర్‌గా తమ్మినేనిని సీఎం జగన్‌ ఎంపిక చేయడం అన్ని పార్టీలు సంభ్రమంగా తిలకించారు. తమ్మినేని సభను నడిపే తీరు స్పీకర్‌గా చేసిన ప్రసంగం యావత్‌ సభను ఆకట్టుకుంది. ఆపైన టీవీల్లో తిలకించే ప్రజలను కూడా చకితులను చేసింది. కొత్తస్పీకర్‌ తమ్మినేనిని చానళ్లలో క్రమం తప్పకుండా నిత్యం పొలిటికల్‌ లైవ్‌ డిబేట్లలో పాల్గొనే పలువురు ప్రముఖులు కొనియాడారు. అద్భుతంగా తమ్మినేని సభను నడుపుతున్నారన్నారు. తమ్మినేనికి పార్టీపరంగా ఆదేశించి చేయమని హుంకరింపులుండవు, స్పీకర్‌ను గుప్పిట్లోకి లాక్కుని కనుసైగలతో నడిపించుకునేదే లేదు. మీపరిధిలో మీకున్న అధికారాలతో స్పీకర్‌ స్వతంత్రంగా నడుపుకునే వీలు, నా సర్కార్‌ మీకు కల్పిస్తుందని జగన్‌ చెప్పడంతో ఏపీలో లైవ్‌ చూస్తున్న టీవీ వీక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమ్మినేని కూడా స్పీకర్‌ అంటే ఏమిటో? స్పీకర్‌ సత్తా ఏమిటో చూపేందుకు సర్వసన్నద్ధం అయ్యేలా ఆసీట్లో ఒదిగిపోయారు.

అసెంబ్లీ చివరిరోజున హోదా తీర్మానంపై జగన్‌ మాట్లాడుతుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మద్యలో తగిలేసరికి జగనే మీరు మాట్లాడండి. తర్వాతే నేమాట్లాడుతా అని కూర్చుండిపోతే బాబులేచి హవుస్‌ స్పీకర్‌ నడిపేలాలేదు. సీఎం జగనే నడుపుతున్నట్లుందని ఓచురక అంటించి తను చెప్పాల్సింది చెప్పారు. ఆవెంటనే అచ్చెన్నాయుడు లేచి జగన్‌వైపు వేలు చూపుతూ నాకూ మాట్లాడే అవకాశం కల్పించండని జగన్‌ను కోరారు. దాంతో స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహంతో సీఎం వైపు వేలుచూపి అడుగుతున్నారు. మీ ఉద్దేశ్యం ఏమిటి? గత సర్కారులా ఉండదు అని ఆరోజే చెప్పాను. తీరు మార్చుకోండని గుర్రుమన్నారు. దాంతో అచ్చెన్నాయుడు సర్ధుకుని మిమ్మల్నే అడుగుతున్నానని చెప్పి గమ్మున కూర్చుండిపోయారు. అచ్చెన్నాయుడు తోకముడిచిన తీరుతో చంద్రబాబు కూడా అయోమయంగా చూసారు.

జగన్‌ స్పీకర్‌కున్న పరిధిలు, హక్కులు స్పీకర్‌కు వాడుకోమనడం బాబుకు అసలుమింగుడు పడడంలేదు. తమ్మినేనిని చూస్తుంటే బాబుకు నివురుగప్పిన నిప్పును చూసినట్లు అనిపిస్తోంది. అచ్చెన్నాయుడు సీఎంనే మాట్లాడే అవకాశమివ్వండని కోరడం. స్పీకర్‌ గుర్రెత్తి పోవడంతో ఇంత భారీకాయం అచ్చెన్నాయుడు సీఎంను అడగలేదు. స్పీకర్‌నే అడిగానని మాట మార్చి చెప్పి కూర్చోవడం స్పీకర్‌ తమ్మినేనిని నెగ్గుకురావడం మున్ముందు కష్టమే అని బాబు ముఖంలో రంగులు మారిపోయాయి.

స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అంటే ఏమిటో? టీడీపీకి తడాఖా? మజాకా? చూపారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకున్నాయి. స్పీకర్‌ తమ్మినేని ముందు చంద్రబాబు, అచ్చెన్నాయుడులా కుప్పిగంతులు ఇకపై కష్టమే.
-యర్నాగుల సుధాకరరావు

పవన్ ఓటమికి మరెవరూ కారణం కాదు.. పవన్ కల్యాణే